నాలుగు నెల‌ల త‌ర‌వాత పెద‌వి విప్పిన దాస‌రి

ఈరోజు దాస‌రి పుట్టిన రోజు. ప్ర‌తీ యేడూ… ఈరోజున దాస‌రి ఇల్లు క‌ళ‌క‌ళ‌లాడిపోయేది. రోజంతా.. దాస‌రి ఉత్సాహంగా క‌నిపించేవారు. ఆ రోజేంటి? దాస‌రి ఇంట ప్ర‌తీరోజూ పండ‌గే. అయితే ఈమ‌ధ్య దాస‌రి ఇల్లు కాస్త క‌ళ త‌ప్పింది. ఇటీవ‌ల దాస‌రి అనారోగ్యం పాలైన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడిప్పుడే కోలుకొంటున్నారు. ఈరోజు ఆయ‌న పుట్టిన రోజు. చాలా రోజుల త‌ర‌వాత దాస‌రి ఇంట్లో ఉత్సాహ‌భ‌రిత‌మైన వాతావ‌ర‌ణం క‌నిపించింది. మిత్రులు, శ్రేయోభిలాషులు, చిత్ర‌సీమ పెద్ద‌లు దాస‌రికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. వాళ్లంద‌రి మ‌ధ్యా.. ఈరోజు కేక్ క‌ట్ చేశారు దాస‌రి. చిరు, మోహ‌న్‌బాబు, అల్లు అర‌వింద్‌, ముర‌ళీమోహ‌న్‌… త‌దిత‌రులంతా దాస‌రి ఇంటికి వ‌రుస క‌ట్టారు. దాస‌రి కాస్త కోలుకొన్న‌ప్ప‌టికీ ఇది వ‌ర‌క‌టి క‌ళ, ఉత్సాహం క‌నిపించ‌లేదు. మీడియాతో కూడా ఓపిక తెచ్చుకొని మాట్లాడారు. దాస‌రి మాట్లాడి నాలుగు నెల‌లైంద‌ట‌. ప‌ది రోజుల క్రింద‌టే ఆయ‌న‌కు మాట్లాడే ఓపిక వ‌చ్చింద‌ట‌. ఈ విష‌యాన్ని దాస‌రే స్వ‌యంగా చెప్పారు. ఇటీవ‌ల దాస‌రికి అల్లు రామ‌లింగ‌య్య అవార్డు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆపురస్కారాన్ని చిరంజీవి ఈరోజు దాస‌రి స్వగృహంలో అంద‌జేశారు. దాస‌రి త్వ‌ర‌గా కోలుకోవాల‌ని, మ‌ళ్లీ సినిమాల‌తో బిజీ అవ్వాల‌ని చిరు కోరుకొన్నారు. దాస‌రిని ఇలా చూస్తుంటే ఎవ్వ‌రికైనా గుండె త‌రుక్కుపోతోంది. నెల రోజుల పాటు ఆసుప‌త్రిలో అనారోగ్యంతో పోరాడి, ఇటీవ‌లే డిశ్చార్జ్ అయిన దాస‌రి.. మునుప‌టి ఉత్సాహంతో క‌నిపించాల‌ని కోరుకొందాం. దాస‌రి గారూ.. హ్యాపీ బ‌ర్త్‌డే.. గెట్ వెల్ సూన్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com