‘డియ‌ర్ కామ్రేడ్’ ట్రైల‌ర్‌: ‘రౌడీ’ ఈసారీ కొట్టేట్టు ఉన్నాడుగా

విజ‌యాన్ని ఇంటి పేరుగా మార్చుకున్న తాజా సంచ‌ల‌నం… విజ‌య్ దేవ‌ర‌కొండ‌. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం.. ఇలా ఒక్కో సినిమాకీ ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు. ఇప్పుడు `డియ‌ర్ కామ్రేడ్‌` అంటూ ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. ఈ సినిమాపై కూడా భారీ అంచ‌నాలున్నాయి. విజ‌య్ ఈ సినిమాతోనూ ఈ సినిమాతో త‌న విజ‌య ప‌రంప‌ర‌ను కొన‌సాగిస్తాడ‌ని `రౌడీ` ఫ్యాన్స్ ఆశ‌లు పెట్టుకున్నారు. వాళ్ల ఆశ‌ల్నీ, అంచ‌నాల్నీ ఇంకాస్త పెంచుతూ `డియ‌ర్ కామ్రేడ్‌` ట్రైల‌ర్ వ‌చ్చేసింది. బాబి అనే ఓ రౌడీ స్టూడెంట్‌కీ, లిల్లీ అనే ఓ క్రికెట‌ర్‌కీ మ‌ధ్య జ‌రిగే ప్రేమ క‌థ ఇది. అందులో కాలేజీ స్టోరీ, ఎమోష‌న్స్‌, రాజ‌కీయాలు, రౌడీ ఇజం, కోపం. ప్రేమ‌, అనుబంధం.. ఇలా అన్నీ మిక్స్ చేశాడు. దాంతో పాటు మంచి మ్యూజిక్ కూడా. విజయ్ పాత్ర‌లో మూడు ర‌కాల షేడ్స్ క‌నిపిస్తున్నాయి. `అర్జున్ రెడ్డి`లో యాంగ‌ర్ మేనేజ్‌మెంట్ లేక‌.. ఎలా త‌న జీవితాన్ని కోల్పోవాల్సివ‌చ్చిందో – ఇక్క‌డా త‌న కోపం వ‌ల్ల ప్రేమ‌నీ, బంధాల్నీ వ‌దులుకోవాల్సివ‌స్తుంది. అవ‌న్నీ దాటుకుని మూడేళ్ల త‌ర‌వాత త‌న ప్రేయ‌సిని వెదుక్కుంటూ వెళ్లిన క‌థానాయ‌కుడికి ఎలాంటి అనుభ‌వాలెదుర‌య్యాయి అన్న‌దే `డియ‌ర్ కామ్రేడ్‌` క‌థ‌. ఈ క‌థ‌లోని ఎమోష‌న్‌నీ, పాత్ర‌ల మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ‌నీ ట్రైల‌ర్‌లో చూపించే ప్ర‌య‌త్నం చేశాడు. విజ‌య్ – ర‌ష్మిక‌ల జోడీ మ‌రోసారి ఈ సినిమాతోనే ఆక‌ట్టుకోబోతోంది. ఇద్ద‌రి మ‌ధ్యా హాటు ముద్దులూ, రొమాన్స్ క‌నిపిస్తున్నాయి. ఈనెల 26న డియ‌ర్ కామ్రేడ్ రాబోతోంది. ట్రైల‌ర్‌లో హిట్టు ల‌క్ష‌ణాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. విజ‌య్ ఇంటెన్సిటీ, క‌థ‌లోని డెప్త్‌, ఇవి రెండూ ఈ సినిమాకి ప్ల‌స్ కాబోతున్నాయి. మ‌రి రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.