భాజ‌పాకి ప‌రువు పోతోంద‌న్న భ‌యం ప‌ట్టుకుంది..!

ఏపీకి చేయాల్సిన దానిక‌న్నా ఎక్కువే చేశామ‌ని భాజ‌పా నేత‌లు చెబుతున్నారు క‌దా..! అలాంట‌ప్పుడు ఎందుకీ భ‌యం..? స్వ‌తంత్రం వ‌చ్చిన త‌రువాత ఏ కేంద్ర ప్ర‌భుత్వ‌మూ ఏ రాష్ట్రానికీ చేయ‌నంత మేలు చేశారు క‌దా..! అలాంట‌ప్పుడు ఈ త‌త్త‌ర‌పాటు దేనికి..? స్వార్థ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోస‌మే ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఢిల్లీకి వ‌చ్చారంటున్నారు క‌దా! అలాంట‌ప్పుడు ఆయ‌న ప‌ర్య‌ట‌న త‌రువాత ఈ భుజాలు త‌డుముకునే ప‌నులు ఎందుకు..? ఏపీకి జ‌రిగిన అన్యాయాన్ని, భాజ‌పా స‌ర్కారు చేసిన నిర్ల‌క్ష్యాన్ని జాతీయ మీడియాకి చంద్ర‌బాబు వివ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కొన్ని జాతీయ ఛానెళ్లు కూడా చంద్ర‌బాబుతో ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలు చేశాయి. అయితే, ఇప్పుడా ఇంట‌ర్వ్యూల ప్ర‌సారాల‌పై భాజ‌పా కొన్ని ఆంక్ష‌లు పెడుతున్నట్టు స‌మాచారం..!

ఇదే విష‌యాన్ని తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ ఒక ట్వీట్ చేశారు. చంద్ర‌బాబుతో చేసిన ఇంట‌ర్వ్యూల‌ను పూర్తి నిడివితో ప్ర‌సారం చెయ్యొద్దంటూ రెండు ఛానెళ్ల‌కి భాజ‌పా పెద్ద‌ల నుంచీ సూచ‌న‌లు వెళ్లాయ‌ని ఒబ్రెయిన్ చెప్పారు. చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న త‌రువాత, ఏపీ అంశ‌మై భాజ‌పా ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డింద‌ని ఇప్ప‌టికే ఢిల్లీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయ‌నీ, భాజ‌పా చ‌ర్య‌లు వాటిని ధ్రువీక‌రించే విధంగా ఉన్నాయంటూ ఆయ‌న ట్వీట్ చేశారు.

ఢిల్లీలో చంద్ర‌బాబు ఏకాకిగా మిగిలార‌ని సాక్షి మీడియా పుంఖానుపుంఖాలుగా క‌థ‌నాలు రాస్తోంది. చంద్ర‌బాబు మీడియా స‌మావేశాన్ని ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదని వైకాపా నేత‌లు విమ‌ర్శ‌లు చేశారు. కానీ, ఢిల్లీలో వాస్త‌వ‌ ప‌రిస్థితి ఇలా ఉంది. చంద్ర‌బాబు ఇంట‌ర్వ్యూల‌ను ప్ర‌సారం చేయ్యొద్దంటూ జాతీయ మీడియా సంస్థ‌ల‌కి భాజ‌పా ఆంక్ష‌లు పెడుతున్న ప‌రిస్థితి. ఏపీకి అన్నీ చేశాం అనుకున్న‌ప్పుడు.. చంద్ర‌బాబు విమ‌ర్శ‌లకు కౌంట‌ర్ ఇవ్వాలి. అంతేగానీ, ఆయ‌న మాటల్ని ప్ర‌సారం చేయ‌కుండా మీడియాకు ఆంక్ష‌లు పెడితే ఏమ‌ని అర్థం చేసుకోవాలి? మొత్తానికి, ఏపీ విష‌య‌మై జాతీయ స్థాయిలో త‌మ ప‌రువు పోయేలా ఉంద‌నే భ‌యం భాజ‌పాకి ప‌ట్టుకుంద‌న‌డంలో సందేహం లేదు. లేదంటే, ఇలాంటి ప‌నులు ఎందుకు చేస్తారు..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.