రివ్యూ: డిటెక్టీవ్‌

డిటెక్టీవ్ న‌వ‌ల‌ల్ని ఎప్పుడైనా చ‌దివారా?
ఓ కేసు వ‌స్తుంది.
పోలీసులు కూడా ఛేదించ‌లేనంత క్లిష్టంగా ఉంటుంది.
త‌ప్ప‌ని స‌రి ప‌రిస్థితుల్లో ఆ కేసుని డిటెక్టీవ్‌కి అప్ప‌గిస్తారు.
త‌న తెలివితేట‌ల‌తో ఆ చిక్కుముడుల‌న్నీ విప్పి.. ఎంచ‌క్క‌గా ప‌రిష్క‌రిస్తాడు డిటెక్టీవ్‌.
పేజీలు తిప్పుతుంటే భ‌లే థ్రిల్‌గా ఉంటుంది. స‌డ‌న్‌గా చివ‌రి పేజీకి వెళ్లి ఏం జ‌రిగిందో తెలుసుకోవాల‌న్న కుతూహ‌లం పెరుగుతుంటుంది.

అలా గుక్క‌తిప్పుకోని క‌థ‌నంతో ఉక్కిరి బిక్కిరి చేయ‌డం చాలా క‌ష్టం. సినిమాల్లో స‌న్నివేశాలుగా చూపించ‌డం ఇంకా క‌ష్టం. ఈ క‌ష్ట‌మైన మార్గాన్ని ఎంచుకొన్నాడు మిస్కిన్‌. విశాల్‌తో తెర‌కెక్కించిన `డిటెక్టీవ్‌` ఇలాంటి క‌థే. మ‌రి ఈ క‌థ‌ని చెప్ప‌డానికి మిస్కిన్ ఎంచుకొన్న క‌థ‌నం ఎలా ఉంది? ఓ న‌వ‌ల చ‌దువుతున్న ఫీలింగ్ ఈ సినిమా చూస్తే వ‌చ్చిందా?? చూద్దాం రండి.. పేజీలు తిప్పేద్దాం.

* క‌థ‌

వ‌రుస‌గా రెండు ప్ర‌మాదాలు జ‌రుగుతాయి. ఇద్ద‌రు చ‌నిపోతారు. కానీ అవేం ప్ర‌మాదాలు కాదు.. ప‌క్కా ప్రీ ప్లాన్డ్ మ‌ర్డ‌ర్‌. స‌హ‌జ‌మ‌ర‌ణాలుగా లోకం న‌మ్మేలా ఈ హ‌త్య‌లు జ‌రుగుతాయి. ఇంత‌లో నా కుక్క‌పిల్ల చ‌చ్చిపోయింది అంకుల్ అంటూ డిటెక్టివ్ ఆది (విశాల్) ద‌గ్గ‌ర‌కు ఓ చిన్న పిల్లాడు వ‌స్తాడు. ఈ కేసుని టేక‌ప్ చేస్తాడు ఆది. కుక్క పిల్ల ఎలా చ‌నిపోయింది? ఎవ‌రు చంపారు? అనే దిశ‌గా ఆలోచిస్తే…. ప్ర‌మాద‌వ‌శాత్తూ మ‌ర‌ణించిన ఇద్ద‌రు వ్య‌క్తుల‌వి ప్ర‌మాదాలు కావ‌ని, హ‌త్య‌ల‌ని తేలుస్తుంది. అక్క‌డి నుంచి.. ఆ కేసు చిక్కుముడిని ఎలా విప్పుకొంటూ వెళ్లాడు? చివ‌రికి ఏం సాధించాడు? కుక్క పిల్ల కోసం వెళ్తే.. ఓ భ‌యంక‌ర‌మైన ముఠా ఎలా దొరికింది? అనేదే క‌థ‌.

* విశ్లేష‌ణ‌

డిటెక్టీవ్ న‌వ‌ల‌లు ప‌దో, ప‌దిహేనో చ‌దివిన వాళ్ల‌కు ఆ ఫార్మెట్ బాగా అర్థ‌మైపోతుంది. పోలీసులు కూడా త‌ల‌లు ప‌ట్టుకొనే కేసు.. చివ‌రికి డిటెక్టీవ్ ద‌గ్గ‌ర‌కు వ‌స్తుంది. దాన్ని అత‌ను ఎలా ఛేదించాడ‌న్న‌దే కీల‌కం. ఈ సినిమా కూడా అలానే మొద‌ల‌వుతుంది. డిటెక్టీవ్ న‌వ‌ల‌లు బాగా చూసి, బాగా స్ట‌డీ చేసి ఈ క‌థ రాసుకొన్నాడేమో మిస్కిన్‌. ఆ ల‌క్ష‌ణాల్ని తు.చ త‌ప్ప‌కుండా ఫాలో అయ్యాడు. ఆదిగా విశాల్ పాత్ర‌ని బాగా డిజైన్ చేశాడు మిస్కిన్‌. విశాల్ ప్ర‌వ‌ర్త‌న వింత‌గా ఉంటుంది. అత‌ని మాట‌లు, చేష్ట‌లు అర్థం కావు. కోపం, ప్రేమ ఇవేం పూర్తిగా చూపించ‌డు. ఎవ‌రినీ క‌ళ్ల‌లో క‌ళ్లు పెట్టి చూడ‌డు. ఇవ‌న్నీ డిటెక్టీవ్‌ల ల‌క్ష‌ణాలేమో, మేధావులు ఇలానే ఆలోచిస్తారేమో అనుకొనేలా ఆ పాత్ర‌ని తీర్చిదిద్దాడు మిస్కిన్‌. ప్ర‌తీ సీన్‌ని చాలా డిటైల్డ్‌గా చూపిస్తూ వెళ్లాడు. అత‌ని ఫ్రేమింగ్ బాగుంది. క‌థ‌ని ప‌క్క‌దోవ ప‌ట్టించే స‌న్నివేశాలు ఇలాంటి సినిమాల్ని ప్ర‌మాదంలో నెట్టేస్తుంది. ఆ విష‌యం బాగా గ్ర‌హించాడు మిస్కిన్‌. అందుకే ఈ సినిమాలో అను ఇమ్మానియేల్ లాంటి అంద‌మైన నాయిక ఉన్నా.. ఆమె పాత్ర‌ని కేవ‌లం క‌థ ప్ర‌కార‌మే వాడుకొన్నాడు. హీరోయిన్ ఉంది, హీరో వ‌య‌సులో ఉన్నాడు క‌దా అని వాళ్లిద్ద‌రి మ‌ధ్య రొమాన్స్ ఇరికించే ప్ర‌య‌త్నం చేయ‌లేదు.

ఏది ఎంత చెప్పాలో అంతే చెబుతూ.. ఫ‌స్టాఫ్ ని బాగా క్రిస్పీగా తీసుకెళ్లాడు. సెకండాఫ్ లో తొలి స‌గం కూడా బాగానే ఉంటుంది. కానీ కీల‌క‌మైన ద‌శ‌లో… క‌థ‌నం గంద‌ర‌గోళంగా ఉంటుంది. హ‌త్య‌లెవ‌రు చేశార‌న్న విష‌యాన్ని ఓ పాత్ర‌తో చెప్పించేశాడు ద‌ర్శ‌కుడు. ఆ స‌మ‌యంలో ప్ర‌తీ డైలాగునీ వొళ్లు ద‌గ్గ‌ర పెట్టుకొని, చెవులు రిక్క‌రించుకొని మ‌రీ వినాలి. లేదంటే అంత వ‌ర‌కూ చూసిన సినిమా అంతా మ‌న‌కేం అర్థం కాకుండా త‌యార‌వుతుంది. సైన్స్ సూత్రాలతో ముడిప‌డిన స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల తెలివితేట‌ల‌కు ప‌రీక్ష పెడ‌తాయి. ప‌తాక స‌న్నివేశాలూ సుదీర్ఘంగానే సాగిన‌ట్టు అనిపిస్తాయి. చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నా… మొత్తానికి ఓ థ్రిల్ల‌ర్ సినిమా చూస్తున్న ఫీలింగ్‌, ఓ డిటెక్టీవ్ న‌వ‌ల చ‌దువుతున్న అనుభూతి క‌లిగించ‌గ‌లిగాడు మిస్కిన్‌.

* న‌టీన‌టుల ప్ర‌తిభ‌

ఊర మాసు సినిమాలు చేసీ చేసీ అలాంటి పాత్ర‌ల్లోనే ద‌ర్శ‌న మిచ్చిన విశాల్‌ని ఈసినిమాలో కొత్త‌గా చూసే అవ‌కాశం ద‌క్కింది. అత‌ని బాడీ లాంగ్వేజ్ మ‌రీ అంత డిఫ‌రెంట్‌గా ఏం ఉండ‌దు గానీ, డిటెక్టీవ్ పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా మారిపోగ‌లిగాడు. స్నేహితుడిగా ప్ర‌స‌న్న కూడా ఆక‌ట్టుకొంటాడు. అను ఇమ్మానియేల్ ది చిన్న పాత్రే. డైలాగులు కూడా త‌క్కువే. కానీ కీల‌క‌మైన స‌మ‌యంలో త‌న `పిక్ పాకెట్‌` విద్య ప్ర‌దర్శించి హీరోకి ఓ క్లూ ఇస్తుందా పాత్ర‌. ఆండ్రియా నెగిటీవ్ పాత్ర చేసింది. మిగిలిన వాళ్లంతా ఓకే అనిపిస్తారు.

* సాంకేతిక వ‌ర్గం

ఇది ద‌ర్శ‌కుడి సినిమా. కాస్త గంద‌ర‌గోళం ఉన్నా తన స్క్రీన్ ప్లే త‌ప్ప‌కుండా ఆక‌ట్టుకొంటుంది. కెమెరా వ‌ర్క్ సూప‌ర్బ్‌. సంగీతం మ‌రో ప్ల‌స్ పాయింట్‌. పాట‌ల్లేవు గానీ, ఓ ప్ర‌మోష‌న‌ల్ గీతం మాత్రం ఉంది. ఆ పాట‌ని పాడిన విధానం, రాసిన ప‌ద్ధ‌తీ ఆక‌ట్టుకొంటాయి. తెలుగు సినిమా చూసిన ఫీలింగే క‌లుగుతుంది త‌ప్ప‌, డ‌బ్బింగ్ సినిమా అనిపించ‌దు. నిర్మాత డ‌బ్బింగ్ విష‌యంలో క్వాలిటీకి ప్రాధాన్యం ఇవ్వ‌డం ఆక‌ట్టుకొంటుంది.

* తీర్పు: మెద‌డుకు మేత పెడుతూ, ఉత్కంఠ‌త క‌లిగిస్తూ సాగే సినిమాల్ని ఇష్ట‌ప‌డేవారికి డిటెక్టీవ్ త‌ప్ప‌కుండా న‌చ్చుతాడు. సైన్స్ సూత్రాలు తెలిసుంటే ఈ క‌థ‌కు త్వ‌ర‌గా క‌నెక్ట్ అవుతాడు. ఊర మాస్ గీతాలు, కామెడీ, ఐటెమ్… ఇలాంటివి కోరుకొనేవాళ్లు మాత్రం కాస్త దూరంగా ఉండ‌డం మంచిది.

* ఫైన‌ల్ ట‌చ్‌: ‘డిటెక్టీవ్‌’… బుర్ర‌కు ప‌దును పెట్టాడు

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com