రివ్యూ: ధ‌మాకా

Dhamaka movie telugu review

తెలుగు360 రేటింగ్ 2.5/5

చూసిన క‌థ‌ని మ‌ళ్లీ చూడ్డానికి ప్రేక్ష‌కులు రెడీగానే ఉంటారు. కాక‌పోతే… చాలా కండీష‌న్లు వ‌ర్తిస్తాయి.
క‌థ పాత‌దే అయినా చెప్పిన విధానం కొత్త‌గా ఉండాలి. ఇది వ‌ర‌క‌టి సినిమాలో లేని కొత్త అంశ‌మేదో.. క‌నిపించాలి. అది మాస్ మ‌సాలా సినిమా అయితే.. ఎంట‌ర్‌టైన్‌మెంట్ అదిరిపోవాలి. హీరోయిజం ఓ రేంజ్ లో ఉండాలి.. ఇలా అన్నీ కుదిరితేనే.. పాత సినిమాల‌కు కొత్త క‌ల‌రింగ్ ఇస్తేనే వ‌ర్క‌వుట్ అవుతాయి. ఈ విష‌యం ర‌వితేజ‌కు బాగా తెలుసు. ఎందుకంటే త‌న భారీ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో పెద్ద క‌థేం ఉండ‌దు. త‌న‌కు బాగా అచ్చొచ్చిన ఎంట‌ర్‌టైన్‌మెంట్ పిచ్చ పిచ్చ‌గా వ‌ర్క‌వుట్ అయిపోయిన సినిమాలే.. ర‌వితేజ‌కు హిట్లు ఇచ్చాయి. ధ‌మాకా లాంటి రొటీన్ క‌థ‌ని ర‌వితేజ న‌మ్మాడంటే… దానికి కార‌ణం.. త‌న ఎంట‌ర్‌టైన్‌మెంట్‌పై త‌న‌కున్న న‌మ్మ‌కం. మ‌రి.. ఆ న‌మ్మ‌కం నిజ‌మైందా? ధ‌మాకా.. డ‌బుల్ ఇంపాక్ట్ ఇచ్చిందా..?

స్వామి (ర‌వితేజ‌)ది మిడిల్ క్లాస్‌. గొడ‌వ‌ల‌తో ఉద్యోగం పోగొట్టుకొంటాడు. ఓ కొత్త ఉద్యోగం సంపాదించి… వెంట‌నే లోన్ తీసుకొని, చెల్లికి పెళ్లి చేయాల‌న్న‌ది త‌న క‌ల‌. ఆనంద్ (ర‌వితేజ‌)కి ఓ పెద్ద కంపెనీయే ఉంటుంది. తండ్రి చ‌క్ర‌వ‌ర్తి (స‌చిన్ ఖేడ్క‌ర్‌) ఆశ‌యాల ప్ర‌కారం.. నెల రోజుల్లో వెయ్యిమందికి ఉద్యోగాలు ఇవ్వాల‌నుకొంటాడు. కాక‌పోతే.. స్వామి, ఆనంద్ ఇద్ద‌రూ ఒకేలా ఉంటారు. వీరిద్ద‌రి ఒకేసారి ప్రేమిస్తుంది ప్ర‌ణ‌వి (శ్రీ‌లీల‌). మ‌రోవైపు చ‌క్ర‌వ‌ర్తి కంపెనీని త‌న చేతుల్లోకి తీసుకోవాల‌ని జేపీ (జ‌య‌రాం) విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తుంటాడు. మ‌రి.. జేపీ ఎత్తుగ‌డ‌ల‌ను ఆనంద్ ఎలా తిప్పి కొట్టాడు? ఇంత‌కీ స్వామి, ఆనంద్ ఇద్ద‌రూ ఒక్కరేనా, వేర్వేరా? అనేది తెర‌పై చూసి తెలుసుకోవాలి.

ఈమ‌ధ్య ర‌వితేజ ఎంచుకొన్న క‌థ‌లు పూర్తిగా సీరియ‌స్ టోన్‌లో వెళ్లిపోతున్నాయి. ర‌వితేజ మార్క్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ మిస్స‌వుతున్నాం.. అనే కంప్లైంట్ ఉంది. అందుకే… ర‌వితేజ మ‌ళ్లీ త‌న పాత స్కూల్ కి వెళ్లి `ధ‌మాకా` లాంటి స‌బ్జెక్ట్ ఎంచుకొన్నాడు. రెట్రో ర‌వితేజ‌ని ప్రేక్ష‌కుల‌కు చూపించాలి అనుకోవ‌డంలో ఎలాంటి త‌ప్పూ లేదు.కాక‌పోతే… పాత ర‌వితేజ‌ని చూపించ‌డానికి మ‌ళ్లీ పాత క‌థే ఎంచుకోవ‌డం మాత్రం స్వ‌యం కృతాప‌రాధం. ఇద్ద‌రు ఒక‌లా ఉండ‌డం, ఒక‌రి స్థానంలోకి మ‌రోక‌రు వెళ్ల‌డం, లేదంటే.. ఒక్క‌డే ఇద్ద‌రిలా న‌టించ‌డం, అది తెలీక విల‌న్ గ్యాంగ్ క‌న్‌ఫ్యూజ్ అవ్వ‌డం.. ఇవ‌న్నీ `దొంగ మొగుడు` నుంచీ చూస్తున్న క‌థ‌లే. ర‌వితేజ మ‌ళ్లీ ఆ రోజుల్లోకి వెళ్లి, అరిగిపోయిన క‌థ ప‌ట్టుకొచ్చాడు.

ర‌వితేజ‌లు ఇద్ద‌రా? ఒక్క‌రా అనేది ఇంట్ర‌వెల్ ట్విస్ట్‌. ఆ ట్విస్ట్ వ‌చ్చిన‌ప్పుడు ప్రేక్ష‌కులు అవాక్కయిపోతారు అని ద‌ర్శ‌కుడు భావించి ఉంటాడు.కానీ విచిత్రం ఏమిటంటే..? ఆ ట్విస్టేమిటో.. సినిమా మొద‌లైన కాసేప‌టికే ప్రేక్ష‌కుడు అర్థం చేసేసుకోగ‌ల‌డు. కాబ‌ట్టి… ఆ ట్విస్ట్ పెద్ద‌గా కిక్ ఇవ్వ‌దు. రెండో స‌గంలో ఆడిటోరియానికి తెలిసిన పోయిన ఓ విష‌యాన్ని మళ్లీ దాచి, కేవ‌లం ఆ పాయింట్ తోనే విల‌న్ తో మైండ్ గేమ్ ఆడేస్తుంటాడు హీరో. అది ఇంకా పేల‌వంగా ఉంటుంది. రౌడీ అల్లుడులో కూడా ఇంతే. ఇద్ద‌రు చిరంజీవులు ఉంటారు. ఏ చిరంజీవి తెర‌పైకి వ‌చ్చాడో ప్రేక్ష‌కుడికి తెలిసిపోతుంది. పాత్ర‌ల‌కు త‌ప్ప‌. కానీ.. రౌడీ అల్లుడు స‌న్నివేశాల్లో బ‌లం ఉంటుంది. ఆ పాత్ర‌ల్లో వినోదం పుట్టుకొస్తుంది. నిజంగా ఏ పాత్ర ఏమిటో అర్థం కాక‌… విల‌న్లు త‌ల‌లు ప‌ట్టుకొంటారు. అలాంటి క‌న్‌ఫ్యూజ‌న్ కామెడీ.. ఇక్క‌డా వ‌ర్క‌వుట్ అయితే… నిజంగానే రౌడీ అల్లుడుకు ధ‌మాకా స‌రికొత్త వెర్ష‌న్‌లా ఉండేది.

అలాగ‌ని.. ధ‌మాకాలో ఏం లేదా? అంటే ఉన్నాయి. ర‌వితేజ మార్క్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అక్క‌డ‌క్క‌డా క‌నిపిస్తుంటుంది. ర‌ఘుబాబుతో కామెడీ ఫైట్‌, మ‌చ్చ‌ర‌వి.. ద‌గ్గ‌ర‌కు వెళ్లి వార్నింగ్ ఇవ్వ‌డం, విల‌న్ ముందు ఒక‌లా. వెనుక మ‌రోలా న‌టించ‌డం… ఇవ‌న్నీ ర‌వితేజ మార్క్ సీన్లే. వాటికి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. బీ,సీ ఆడియ‌న్స్ ని దృష్టిలో ఉంచుకొని కొన్ని సీన్లు డిజైన్ చేశారు. `ప‌ల్స‌ర్ బండి..` పాట‌ని క‌రెక్ట్ టైమ్ లో ప్లేస్ చేశారు. ఆ పాట థియేట‌ర్‌ని ఓ ఊపు ఊపేస్తుంది. రావు ర‌మేష్ – ర‌వితేజ తిట్ల దండ‌కం కూడా.. కొత్త‌గా ఉంటుంది. మ‌రీ ముఖ్యంగా ఇంద్ర సినిమాలోని కీ సీన్‌ని.. ధ‌మాకాలో స్ఫూఫ్ చేశారు. ఎప్పుడైతే `ఇంద్ర‌` బీజియ‌మ్ మొద‌లైందో.. థియేట‌ర్లో క్లాప్స్ మొద‌లైపోతాయి. ర‌వితేజ‌లాంటి ఓ టాప్ హీరో… ఓ సూప‌ర్ హిట్ సినిమాలోని స‌న్నివేశానికి స్ఫూఫ్ చేయ‌డం నిజంగా కొత్త‌గా అనిపిస్తుంది. ర‌వితేజ ఎలాగూ చిరంజీవి ఫ్యానే కాబ‌ట్టి, ఆ విష‌యం అంద‌రికీ తెలుసు కాబ‌ట్టి.. ఆ సీన్ వ‌ర్క‌వుట్ అయిపోతుంది. రావు ర‌మేష్ – హైప‌ర్ ఆది మ‌ధ్య ట్రాక్‌… ఆది వేసిన పంచ్‌లు బాగా పండాయి. కాక‌పోతే… జ‌బ‌ర్‌ద‌స్త్ కి ఈ ట్రాక్ ఎక్ట్సెంష‌న్‌లా అనిపిస్తుంది. ఫ‌స్టాఫ్‌లో టైమ్ పాస్ ఎలిమెంట్లు ఉన్నాయి. ద్వితీయార్థంలో మాస్‌కి న‌చ్చే బిట్ సాంగ్స్ క‌నిపిస్తాయి. మాస్ పాట‌ల‌న్నీ సెంక‌డాప్‌కి షిఫ్ట్ చేసి మంచి ప‌ని చేశారు. ఎందుకంటే సీన్‌లో ఊపు త‌గ్గిన‌ప్పుడ‌ల్లా.. భీమ్స్ ఇచ్చిన బాణీల్ని వాడుకొన్నారు.

ర‌వితేజ దూకుడు ఈ సినిమాలోనూ క‌నిపించింది. రెండు పాల్ర‌లైనా… పెద్ద‌గా తేడాలేం ఉండ‌వు. డాన్సుల్లో మాత్రం ఇదివ‌ర‌కు క‌నిపించ‌ని ఎర‌ర్జీ వ‌చ్చేసింది. బ‌హుశా భీమ్స్ ఇచ్చిన ట్యూన్స్ మ‌హ‌త్యం కావొచ్చు. శ్రీ‌లీల పాత్ర‌కు స్కోప్ త‌క్కువ‌. కాక‌పోతే.. డాన్సుల్లో అద‌ర‌గొట్టింది. స‌చిన్ ఖేడ్క‌ర్‌, జ‌య‌రాం, త‌నికెళ్ల భ‌ర‌ణి, రావు ర‌మేష్‌.. వీళ్లెవ‌రివీ కొత్త త‌ర‌హా పాత్ర‌లు కావు. జ‌య‌రాం విల‌నిజం స్టైలీష్‌గా ఉంది.

తెర ముందున్న హీరో ర‌వితేజ అయితే.. వెనుక ఉన్న హీరో భీమ్స్‌. ఈమ‌ధ్య ఇంత హుషారైన ఆల్బ‌మ్ రాలేదు. మాస్ పాట‌లు పెద్ద పీట వేశారు. కొరియోగ్ర‌ఫీ కూడా బాగుంది. ప్ర‌స‌న్న అందించిన సంభాష‌ణ‌లు అక్క‌డ‌క్క‌డ మెరిశాయి. `వాడి కన్ను ప‌డితే.. చెవులు వినిపించ‌వు` లాంటి అర్థ‌వంత‌మైన డైలాగులు ప‌డ్డాయి. నిర్మాణ విలువ‌లు కూడా రిచ్‌గా ఉన్నాయి. అయితే. రొటీన్ క‌థ‌, ఏమాత్రం బ‌లం లేని స‌న్నివేశాలు, ఊహాజ‌నిత‌మైన ముగింపులతో బోర్ కొట్టించారు. ర‌వితేజ నుంచి కేవ‌లం ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఆశించే వాళ్ల‌కు `ధ‌మాకా` కాస్త న‌చ్చుతుంది. అంత‌కంటే ఎక్కువ ఆశిస్తే మాత్రం… డ‌బుల్ ఇంపాక్ట్ కి గురి కావాల్సివస్తుంది.

ఫినిషింగ్ ట‌చ్‌: ఇంపాక్ట్ త‌గ్గింది

తెలుగు360 రేటింగ్ 2.5/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

‘పారిజాత ప‌ర్వం’ రివ్యూ: సినిమా తీయ‌డం ఓ క‌ళ‌!

Parijatha Parvam movie review తెలుగు360 రేటింగ్: 1.5/5 'కిడ్నాప్ చేయ‌డం ఓ క‌ళ‌'... అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్రం 'పారిజాత ప‌ర్వం'. దాన్ని బ‌ట్టి ఇదో కిడ్నాప్ క‌థ‌ అని ముందే అర్థం చేసుకోవొచ్చు....

ఉద్యోగం ఊస్టింగ్ ? వెంకట్రామిరెడ్డి ఇక జగన్ సేవకే.. !

ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది ఈసీ. ఆయన వైసీపీ కోసం ఎన్నికల ప్రచారం చేయడంతో నిర్ణయం తీసుకుంది. అంతే కాదు ఆయనను అమరావతి దాటి వెళ్లవద్దని ఉత్తర్వులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close