తెలంగాణలో భూపరిపాలనను ప్రక్షాళన చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం భూభారతి దిశగా అడుగులు వేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం పాత అక్రమాల పరంపర కొనసాగుతుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా రిజిస్ట్రేషన్ ఫీజుల చెల్లింపుల్లో భారీ కుంభకోణం వెలుగుచూడటం వ్యవస్థలోని లొసుగులను ఎత్తిచూపుతోంది. ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన కోట్ల రూపాయల ఆదాయం పక్కదారి పట్టినట్లు వచ్చిన ఆరోపణలపై లోకాయుక్త సైతం సీరియస్ అయ్యింది. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేయడంతో, భూభారతి ముసుగులో జరుగుతున్న అవినీతి బాగోతం బట్టబయలైంది.
ధరణి సమస్యలు ఇప్పటికీ కంటిన్యూ
గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ పట్ల రైతుల్లో ఉన్న వ్యతిరేకతను ఓట్లు చేసుకోవడంలో రేవంత్ రెడ్డి విజయం సాధించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం, భూభారతి పేరుతో కొత్త ఆశలు కల్పించింది. అయితే, ధరణిలో ఉన్న సాంకేతిక ఇబ్బందులు, అక్రమాలకు భూభారతి ఏమాత్రం పరిష్కారం చూపడం లేదన్న విమర్శలు విన్పిస్తున్నాయి. ధరణిలో జరిగినట్లుగానే రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో డేటా తారుమారు చేయడం, ఫీజుల ఎగవేతకు సహకరించడం వంటి అంశాలు మళ్లీ పునరావృతమవుతున్నాయి. కేవలం పేర్లు మార్చడం వల్ల కాకుండా, క్షేత్రస్థాయిలో అక్రమార్కులపై ఉక్కుపాదం మోపడంలో ప్రభుత్వం విఫలమవుతోందనే వాదన బలంగా వినిపిస్తోంది.
భూభారతిలోనూ భారీగా అక్రమాలు
ఈ అక్రమాలపై పోలీసులు కేసులు నమోదు చేసినా, దర్యాప్తు ప్రక్రియ నత్తనడకన సాగుతుండటంపై విపక్షాలు మండిపడుతున్నాయి. రిజిస్ట్రేషన్ ఫీజుల గోల్మాల్ వెనుక ఉన్న పెద్ద తలకాయలను పట్టుకోవడంలో రేవంత్ సర్కార్ సీరియస్ గా లేదనే సంకేతాలు వెలువడుతున్నాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల కిందిస్థాయి సిబ్బందిలో భయం పోయిందని, ఫలితంగానే లోకాయుక్త జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సామాన్యుల భూ సమస్యలను తీర్చడమే లక్ష్యమని చెబుతున్న ప్రభుత్వం, ఇలాంటి ఆర్థిక నేరాల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
ధరణి, భూభారతి ఒక్కటే అయితే ఏంటి ప్రయోజనం ?
మొత్తానికి, పాత ధరణికి కొత్త రంగు పూసి భూభారతిగా ప్రవేశపెట్టినప్పటికీ, అవినీతి పుట్టలు మాత్రం అలాగే ఉన్నాయన్నది చేదు నిజం. భూ రికార్డుల ప్రక్షాళన అంటే కేవలం డిజిటల్ డేటా మార్పు మాత్రమే కాదని, వ్యవస్థలో పాతుకుపోయిన మధ్యవర్తులు, అవినీతి అధికారుల అడ్డాను కూల్చడమని ప్రభుత్వం గుర్తించాలి. లోకాయుక్త విచారణ నేపథ్యంలోనైనా ప్రభుత్వం స్పందించి, సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించకపోతే ‘భూభారతి’ కూడా రాజకీయ నినాదంగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే కాంగ్రెస్ కు అంత కన్నా పెద్ద వైఫల్యం ఏమీ ఉండదు.


