టీ కాంగ్రెస్ కు దిగ్విజ‌య్ త‌ల‌నొప్పి..!

ఇన్నాళ్లుగా ఈసురోమంటూ ఉన్న తెలంగాణ కాంగ్రెస్ ఇప్పుడు నెమ్మ‌దిగా బ‌ల‌ప‌డుతోంద‌న్న‌ట్టుగా క‌నిపిస్తోంది. కేసీఆర్ స‌ర్కారుపై వ్య‌క్త‌మౌతున్న వ్య‌తిరేక‌త‌ను టి కాంగ్రెస్ ఓ మాదిరిగా ఓన్ చేసుకుని అనుకూలంగా మార్చుకుంటోంద‌న్నట్టుగానే ఉంది. రాహుల్ గాంధీ రావ‌డంతో పార్టీలో కొంత ఊపు వ‌చ్చింది. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇన్ ఛార్జ్ దిగ్విజ‌య్ సింగ్ పుణ్య‌మా అని పార్టీ మ‌రోసారి స‌మ‌స్య‌ల్లో ప‌డింది! మూలిగే న‌క్క‌మీద తాటిపండులా… ఇప్పుడిప్పుడే ప్ర‌జ‌ల్లో ఓ పాజిటివ్ వేవ్ ను పెంచుకుంటున్న టీ కాంగ్రెస్ కు డిగ్గీరాజా గుదిబండ‌లా మారుతున్నార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మౌతోంది. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో మియాపూర్ భూ కుంభ‌కోణం క‌ల‌కలం రేపుతున్న సంగ‌తి తెలిసిందే. నిజానికి, రాజ‌కీయంగా ఇది కాంగ్రెస్ కు అందివ‌చ్చిన అవ‌కాశం. తెరాస‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించ‌గ‌లిగే వ్య‌వ‌హారం. దీన్ని వీలైనంత జాగ్ర‌త్త‌గా వాడుకోవాలి. కానీ, దిగ్గీరాజా ఏం చేశారూ… సెల్ఫ్ గోల్ చేశారు!

ఈ కుంభ‌కోణంలో తెలంగాణ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ పాత్ర ఉందంటూ దిగ్విజ‌య్ ఆరోపించారు. నిజానికి, ఈ కుంభ‌కోణంలో ఎక్క‌డా త‌ల‌సాని పేరు బ‌య‌ట‌కి రాలేదు. ఓ ర‌కంగా చెప్పాలంటే డిప్యూటీ సీఎం మ‌హమూద్ అలీ పేరు వినిపించింది. రూ. 50 కోట్లు విలువ చేసే రెండు ఎకరాల భూమిని ఆయ‌న అక్ర‌మంగా త‌న బినామీల పేరున రిజిస్ట్రేష‌న్ చేయించారంటూ కొన్ని క‌థ‌నాలు వ‌చ్చాయి. కానీ, ఆయ‌న గురించి ప్ర‌స్థావిస్తే మైనారిటీల నుంచి ఎక్క‌డ వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మౌతుందో అని డిగ్గీరాజా అనుకున్న‌ట్టున్నారు! పోనీ, అలాగ‌ని నేరుగా కేసీఆర్ స‌ర్కారును టార్గెట్ చేసి మాట్లాడినా బాగుండేది. అనూహ్యంగా మంత్రి త‌ల‌సాని పేరును ప్ర‌స్తావించారు. దీంతో మంత్రి రియాక్ట్ అయ్యారు. త‌న‌పై దిగ్విజ‌య్ సింగ్ త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్నారంటూ ఆయ‌న ఫైర్ అయ్యారు. అక్క‌డితో ఆగ‌లేదు. త‌న‌పై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేసి, త‌న‌కు అప్ర‌తిష్ఠ‌ను అంట‌గ‌డుతున్న దిగ్విజ‌య్ పై రూ. 10 కోట్ల ప‌రువు న‌ష్టం కేసు పెడుతున్న‌ట్టు త‌ల‌సాని ప్ర‌క‌టించారు. ఈ వ్య‌వ‌హారాన్ని ఎట్టిప‌రిస్థితుల్లోనూ వ‌దిలేది లేద‌ని త‌ల‌సాని ఆగ్ర‌హిస్తున్నారు.

మొత్తానికి, దిగ్విజ‌య్ వ్య‌వ‌హార శైలితో తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు మ‌రోసారి త‌ల‌లు ప‌ట్టుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. ఈ మ‌ధ్య‌నే… తెలంగాణ పోలీసుల‌పై ఆయ‌న తీవ్ర ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. దీనిపై కేసు కూడా న‌మోదు అయింది. ఇలాంటి అనుభ‌వం ఉండి కూడా మ‌రోసారి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల జోలికి దిగ్విజ‌య్ ఎందుకు వెళ్లారంటూ టీ కాంగ్రెస్ నేత‌లు మ‌ద‌న‌ప‌డుతున్నారు. రాష్ట్రంలో తెరాస‌ను ఎదుర్కొనే శ‌క్తిగా కాంగ్రెస్ ఎదుగుతున్న స‌మ‌యంలో డిగ్గీరాజా వ్య‌వ‌హార శైలి కాస్త ఇబ్బందిక‌రంగానే మారుతోందని అంటున్నారు! ఈ విష‌యాన్ని హైకమాండ్ కు ఫిర్యాదు చెయ్యాల‌నే అభిప్రాయం పార్టీలో వ్య‌క్తమౌతున్న‌ట్టు తెలుస్తోంది. పార్టీ వ్య‌వ‌హారాల బాధ్య‌త‌ల నుంచి ఆయ‌న్ని త‌ప్పించాల‌నే డిమాండ్ మొద‌లైన‌ట్టు స‌మాచారం!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.