దిల్‌రాజు డిస్టిబ్యూటర్గానే ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తరవాత అగ్ర నిర్మాతగా ఎదిగారు. అయితే ఈమధ్య కాలంలో సినిమాల డిస్టిబ్యూషన్ విషయంలో ఆచి తూచి అడుగులేస్తున్నారు. పెద్ద సినిమాల జోలికి వెళ్లడం లేదు. అయితే చాలా కాలం తరవాత ఆయన Toxic సినిమాని తెలుగులో విడుదల చేస్తున్నారు. యశ్ హీరోగా నటించిన సినిమా ఇది. కేజీఎఫ్‌తో తెలుగులో పాపులారిటీని దక్కించుకొన్న హీరో యశ్. అయితే ఈ సినిమాపై ఆయన ఏకంగా రూ.120 కోట్లు పెట్టుబడి పెట్టినట్టు టాక్. ఓ కన్నడ డబ్బింగ్ సినిమాని ఇంత పెట్టి ఎందుకు కొన్నారు? ఎలా కొన్నారు? అనే చర్చ టాలీవుడ్ వర్గాల్లో మొదలైంది. యశ్ సినిమా కేజీఎఫ్ తెలుగులోనూ మంచి వసూళ్లు అందుకొంది కాబట్టి, ఈ సినిమాపై బజ్ ఏర్పడింది కాబట్టి, దిల్ రాజు ఈ స్థాయిలో పెట్టుబడి పెట్టి ఉంటారన్న ప్రచారం జరుగుతోంది. కొంతమంది దీన్ని పబ్లిసిటీ స్టంట్ గా కొట్టేస్తున్నారు. అంకెలు చూపించుకొని, క్రేజ్ పెంచుకోవడానికి రూ.120 కోట్లు అంటున్నారే తప్ప, అంతకు కొనే ఛాన్స్ లేదన్నది విశ్లేషకుల మాట.
దీనిపై దిల్ రాజు స్పందించారు. ‘టాక్సిక్ సినిమాని రూ.120 కోట్లకు కొనడం కేవలం పబ్లిసిటీ స్టంట్ అనేవాళ్లపై మీ కామెంట్ ఏమిటి?’ అని అడిగితే ఆయన చాలా క్యాజువల్ గానే స్పందించారు. ”అలా డౌటు పడేవాళ్లకు బ్యాంక్ స్టేట్మెంట్లు చూపిస్తా. అప్పుడు నమ్ముతారేమో” అని తేల్చేశారు. సంక్రాంతి సినిమాలపై కూడా దిల్ రాజు స్పందిచారు. 2027 సంక్రాంతి బరిలో చాలా సినిమాలున్నాయి కదా, ఇన్ని సినిమాలు నిజంగానే వస్తాయా? అని అడిగితే.. ”సంక్రాంతికి ఎన్ని సినిమాలు వచ్చినా ఆడేవి రెండో మూడో ఉంటాయి. ఎవరి కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటే వాళ్లే నిలబడతారు. సంక్రాంతికి కోడి పుంజుల పోటీలానే ఇది కూడా. ఈ పోటీలో ఉండాలా, వద్దా అనేది నిర్మాతలే నిర్ణయించుకోవాలి” అన్నారు.
