DRD పేరుతో దిల్ రాజు ఓ సంస్థని స్థాపించిన సంగతి తెలిసిందే. అంటే.. ‘దిల్ రాజు డ్రీమ్స్’ అన్నమాట. కొత్త దర్శకులు, రచయితలు, నిర్మాతల్ని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన వ్యవస్థ ఇది. డీఆర్డీ తన కార్యకలాపాల్ని ప్రారంభించి ఏడెనిమిది నెలలయ్యింది. ఈ ప్రయాణంలో ఈ సంస్థకు వెబ్ సైట్ ద్వారా 330 పై చిలుకు కథలు వచ్చాయి. వాటిలో వంద కథల్ని విన్నారు. ఆ వందలో 5 ఫైనల్ చేశారు. అందులో రెండు సినిమాలు ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ‘మార్కాండేయ’ అనే సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ఈ రోజు బయటకు వదిలారు. ఏడాదికి కనీసం 5 నుంచి 6 సినిమాలు డీఆర్డీ నుంచి వస్తాయని దిల్ రాజు ప్రకటించారు.
ఔత్సాహికులైన దర్శకులు, రచయితలు, నిర్మాతలకు దిల్ రాజు నుంచి ఈ సంస్థ రూపంలో గట్టి భరోసానే లభించింది. దిల్ రాజు అనేది ఓ బ్రాండ్. ఆ పేరు.. ఈ సినిమాలకు వెన్నుదన్నుగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. చిన్న సినిమాలు హిట్టయితే అందులోంచి వచ్చే కిక్ ఎలా ఉంటుందో దిల్ రాజుకి బాగా తెలుసు. పైగా.. పెట్టుబడి కూడా లేని వ్యాపారం. కొత్త నిర్మాతలకు తన సలహాలు, సూచనలు అందిస్తూ, ఆ సినిమాలో తాను భాగం తీసుకొంటారు. దిల్ రాజు అండదండలు ఉన్నాయి కాబట్టి.. ఆ బ్రాండ్ కో వాల్యూ ఉంది కాబట్టి ఓటీటీ వ్యాపారానికి మార్గం సుగమం అవుతుంది. దిల్ రాజు చేతిలో థియేటర్లు ఉన్నాయి కాబట్టి, థియేట్రికల్ రిలీజ్ విషయంలో ఎలాంటి భయాలూ ఉండవు. కాబట్టి నిర్మాతలకూ ధైర్యం ఉంటుంది. 330 కథల్లో వంద విని అందులో 5 మాత్రమే ఎంచుకొన్నారంటే.. కథల్ని ఎంతగా ఒడగడుతున్నారో అర్థం అవుతోంది. సో.. కంటెంట్ విషయంలో బెంగ పడాల్సిన పనిలేదు. రిజల్ట్ ఎలా ఉంటుందన్నది చూడాలి.
