నంద్యాలలో ప్రచారానికి బాలయ్య వస్తారా..?

నంద్యాల ఉప ఎన్నిక‌ల రాజ‌కీయం రానురానూ ర‌స‌కందాయంలో ప‌డుతోంది. ఎన్నిక తేదీ ద‌గ్గ‌ర‌ప‌డుతూ ఉండ‌టంతో అధికార, ప్ర‌తిప‌క్ష పార్టీలు భారీ ఎత్తున ప్ర‌చారం చేస్తున్నాయి. నిజానికి, ఇది ఉప ఎన్నికే అయినా.. 2019 కురుక్షేత్రానికి నాంది అంటూ రాష్ట్రవ్యాప్తంగా ఈ ఎన్నిక‌ల‌పై అధికార, ప్ర‌తిప‌క్షాలు అత్యంత ఆస‌క్తిని రేకెత్తించేస్తున్నాయి. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మూడున్న‌రేళ్ల పాల‌న‌పై ప్ర‌జ‌లు కోరుకుంటున్న మార్పు ఇక్క‌డి నుంచే మొద‌లౌతుంద‌ని విప‌క్ష నేత జ‌గ‌న్ చెబుతూ ఉంటే… చంద్ర‌బాబు చేస్తున్న అభివృద్ధిని ప్ర‌జ‌లు చూస్తున్నార‌ని టీడీపీ నేత‌లు ప్ర‌చారం చేస్తున్నారు.

మంత్రులూ, ఇతర ప్రాంతాల ఎమ్మెల్యేలు టీడీపీ ప్ర‌చార బాధ్య‌త‌ల్ని మొద‌ట్నుంచీ తీసుకున్నారు. కొంత‌మంది నంద్యాల‌లోనే మ‌కాం వేసి పార్టీ వ్యూహాల‌ను అమ‌లు చేస్తున్నారు. ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు రెండుసార్లు నంద్యాల‌కు వ‌చ్చారు. మంత్రి నారా లోకేష్ కూడా ప‌ర్య‌టించారు. అయితే, వైకాపా అధినేత జ‌గ‌న్ నంద్యాల‌లో స‌భ నిర్వ‌హించిన త‌రువాత ఆ పార్టీ కాస్త జోరు పెంచింది. ఈ నేప‌థ్యంలో టీడీపీ ప్ర‌చార జోరును మ‌రింత పెంచాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆ పార్టీ నేత‌లే అంటున్నారు. ప్ర‌చారం చివ‌రి ద‌శ‌కు చేరుకుంటున్న నేప‌థ్యంలో మ‌రోసారి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నంద్యాల‌కు వ‌చ్చే అవ‌కాశాలున్నాయ‌ని అంటున్నారు. అయితే, ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి వియ్యంకుడు, హిందూపురం ఎమ్మెల్యే, ప్ర‌ముఖ న‌టుడు నందమూరి బాల‌కృష్ణ పేరు తెర‌మీదికి వ‌స్తోంది.

నంద్యాల‌లో బాల‌య్య‌తో ప్ర‌చారం చేయించాల‌ని ఆ పార్టీ శ్రేణులు డిమాండ్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. బాల‌య్య ప్ర‌చారానికి వ‌స్తే మాస్ లో మ‌రింత ఊపు వ‌స్తుంద‌నీ, ఆయ‌న కొన్ని పంచ్ డైలాగుల చెబితే వైకాపాకి ధీటుగా స్పందించిన‌ట్టు ఉంటుంద‌ని టీడీపీ నేత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారని స‌మాచారం. అయితే, నంద్యాల ఉప ఎన్నిక‌ల విష‌య‌మై బాల‌య్య ప్ర‌చారానికి వ‌చ్చే అవ‌కాశాలు కాస్త త‌క్కువ‌గానే ఉన్న‌ట్టు చెబుతున్నారు. ఎందుకంటే, ఆయ‌న వ‌రుస సినిమాల‌తో బిజీబిజీగా ఉంటున్నారు. 2019 ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ఒప్పుకున్న సినిమాల‌ను పూర్తి చేసే ప‌నిలో ఉన్నారు. అయితే, ఎంత బిజీగా ఉన్నాస‌రే ఒక్క రోజైనా వీలు చూసుకుని నంద్యాల‌కు వ‌స్తే బాగుంటుంద‌ని స్థానిక టీడీపీ నేత‌లు డిమాండ్ చేస్తున్నార‌ట‌.

మంత్రి నారా లోకేష్ భార్య బ్ర‌హ్మ‌ణిని నంద్యాల ప్ర‌చారానికి పంపాలంటూ మంత్రి అఖిల ప్రియ సీఎంను కోరిన‌ట్టు ఈ మ‌ధ్య క‌థ‌నాలు వ‌చ్చాయి. ఈ ప్ర‌తిపాద‌నను చంద్ర‌బాబు సున్నితంగా తోసిపుచ్చిన‌ట్టు కూడా చెప్పుకున్నారు. మ‌రి, బాల‌కృష్ణ ప్ర‌చారానికి వ‌స్తే బాగుండ‌ని వినిపిస్తున్న ఈ డిమాండ్ పై చంద్ర‌బాబు స్పంద‌న ఎలా ఉంటుందో చూడాలి, మ‌రి! బాల‌య్య‌ను ఒక స‌భ‌కు తీసుకొస్తే ఆ పార్టీకి ఎంతో కొంత మేలు జ‌రుగుతుంది క‌దా! ముఖ్యమంత్రి చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్ త‌ప్ప ఇత‌ర కుటుంబ స‌భ్యులెవ‌రూ నంద్యాల ప్ర‌చారానికి వెళ్ల‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నారేమో..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com