విజ‌య‌వాడ‌లో కిడ్నాప్ సంస్కృతి!

విజ‌య‌వాడ ఇంత‌కు ముందు కేవ‌లం వ‌ర్గ పోరాటాల‌కు మాత్ర‌మే కేంద్రంగా ఉండేది. ప‌ర‌స్ప‌రం క‌క్ష‌లు తీర్చుకునే వారు. సంబంధం లేని వారి జోలికి వ‌చ్చేవారు కాదు. ఇప్పుడు కాలం మారింది. విజ‌య‌వాడ న‌వ్యాంధ్ర‌కు రాజ‌ధానిగా మారింది. అభివృద్ధితో పాటూ అన్ని ర‌కాల అరాచ‌కాలూ పెరిగాయి. కాల్ మ‌నీ వేధింపుల‌న్నారు.. ఆత్మ‌హ‌త్య‌ల వ‌ర‌కూ వెళ్ళింది. కాల్ మ‌నీ కేసుల్లో ఉన్న‌దీ అధికార పార్టీ వారే అనే ఆరోప‌ణ‌లు వినిపించాయి. అంత ఉవ్వెత్తున లేచిన ఆ ఆరోప‌ణ ఉన్న‌ట్టుండి చ‌ల్ల‌బ‌డిపోయింది. ప్ర‌తిప‌క్ష‌మూ ఆ అంశాన్ని వ‌దిలేసింది. అంశాల వారీగా పోరాడ‌తామ‌ని చెప్పుకునే ప్ర‌తిప‌క్షం కొత్త అంశాల‌ను క‌నుగొన‌డం.. కొన్నాళ్ళు క‌థ న‌డిపించ‌డం… ఇలా సాగుతోంది…. ఆంధ్ర ప్ర‌దేశ్ రాజ‌కీయం.
తాజాగా హ‌వాలా వ్య‌వ‌హారం వెలుగులోకి వ‌చ్చిందంటూ ప్ర‌తిప‌క్షానికి చెందిన ఒక చానెల్ బ్రేకింగ్ న్యూస్‌లు వేస్తోంది.
దీని ప్ర‌కారం, వైద్యులు ఇందులో ఉన్నారు. మొత్తం ఎనిమిదిమందిమీద కేసులు న‌మోదు చేశార‌ని తెలుస్తోంది. విదేశాల నుంచి నిధుల‌ను ర‌ప్పించుకునేందుకు ఈ వైద్యులు బ్ర‌హ్మాజీ అనే హ‌వాలా బ్రోక‌ర్‌కు పెద్ద మొత్తంలో క‌మిష‌న్ ముట్ట‌జెప్పారు. నెల‌లు గ‌డుస్తున్నా త‌మ నిధులు త‌మ ఖాతాల‌లోకి బ‌దిలీ కాక‌పోవ‌డంతో బ్ర‌హ్మాజీని కిడ్నాప్ చేశారు. ఈ వ్య‌వ‌హారంలో కృష్ణా జిల్లాకు చెందిన ఓ మంత్రి జోక్యం చేసుకున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. బ్ర‌హ్మాజీ స‌న్నిహితుల‌తో మంత‌నాలూ ప్రారంభించారు. ఈ మ‌కిలి త‌న‌కెక్క‌డ అంటుకుంటుందోన‌ని టీడీపీకి బెంబేలు ప‌ట్టుకుంది. త‌క్ష‌ణం పోలీసుల‌ను రంగంలో దించింది. బ్ర‌హ్మాజీని కిడ్నాప్ చేసిన కారును స్వాధీనం చేసుకుని, ఇందుకు స‌హ‌క‌రించిన ఓ ఏసీపీనీ, మ‌రో అధికారినీ స‌స్పెండ్ చేసింది. బ్ర‌హ్మాజీని విడిపించాల‌ని అత‌ని బంధువులు పోలీసు ఉన్న‌తాధికారుల‌కు మొర‌పెట్టుకోవ‌డంతో ప్ర‌భుత్వం ఉలిక్కిప‌డిందంటూ ఓ చానెల్ స్క్రోలింగుల మీద స్క్రోలింగులు వేస్తోంది. ఓ మామిడి తోట‌లో బ్ర‌హ్మాజీని చెట్టుకు క‌ట్టి హింసిస్తున్నార‌ని క‌ళ్ళ‌తో చూసిన‌ట్లు రాసేస్తోంది. ఇదంతా నిజ‌మా కాదా! నిజ‌మే అయితే.. విజ‌య‌వాడ‌లో మ‌రో విష సంస్కృతి వేళ్ళూనుకుంటున్న‌ట్లే. వృత్తి నిపుణులైన వైద్యులే కిడ్నాప్‌ల‌కు పాల్ప‌డ‌డం దేనికి సంకేత‌మో వారే చెప్పాలి.

-సుబ్ర‌హ్మ‌ణ్యం విఎస్ కూచిమంచి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com