నాకు చాలా తిక్క ఉంది.. దానికి లెక్క ఉండదు అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు అందర్నీ షాక్ కు గురి చేస్తోంది. అయితే తనను తాను పొగుడుకోవడం లేకపోతే ఇతరులపై నిందలేయడం ఆయన స్టైల్ గా మారింది. అన్ని దేశాలపై పన్నులు పెంచేసి.. వాటిని వాయిదా వేసి చర్చలకు రావాలంటూ పిలుస్తున్న ఆయన అలా వస్తున్న వివిధ దేశాల ప్రతినిధుల్ని ఘోరంగా అవమానిస్తున్నారు. ఆయన తీరుతో ఎలా ఉండే అమెరికా ఎలా అయిపోయిందని ప్రపంచదేశాలన్నీ విస్మయానికి గురవుతున్నాయి.
తాజాగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు అమెరికాకు వచ్చారు. వైట్ హౌస్ కు వెళ్లారు. అధికారిక సమావేశం… ట్రంప్ తో జరిగింది. సాధారణంగా ఇలాంటి అధ్యక్షుల సమావేశం అంటే పరస్పర గౌరవం ఉంటుంది. వైట్ హౌస్ కు అతిథిగా వచ్చారంటే మరింత గౌరవం ఇస్తారు. కానీ ట్రంప్ రూటే వేరు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రాగానే లైట్లు ఆఫ్ చేసి.. సినిమా చూపించారు. దక్షిణాఫ్రికాలో తెల్లజాతీయులపై దాడులు జరుగుతున్నాయని ఆయన ఆ వీడియోలో చూపారు. అవన్నీ ఎక్కడ జరిగాయో తనకు తెలియదని.. తమ దేశంలో జరగలేదని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు చెప్పినా పట్టించుకోలేదు. మీ దగ్గరే జరిగాయని వాదించారు.
దక్షిణాఫ్రికా ఒకప్పుడు జాతుల సమస్యతో అల్లాడింది. తర్వాత ప్రశాంతంగా మారింది. ఇప్పుడు ఆఫ్రికాలోనే అభివృద్ధి చెందిన దేశంగా కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో ఆ దేశంలో ఏదో జరిగిపోతోందని చిచ్చు పెట్టేలా ఫేక్ వీడియోలను ట్రంప్ ప్రదర్శించారు. పన్నులపై ఓ ఒప్పందం చేసుకుందామని వచ్చిన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు వైట్ హౌస్ లో ఇలాంటి అవమానం ఎదురవుతుందని అనుకోలేదు. ఊసూరుమంటూ వెళ్లిపోయాడు. ఇక్కడ పోయింది.. దక్షిణాఫ్రికా అధ్యక్షుడి గౌరవం కాదు.. ట్రంప్‌ది కూడా కాదు. అమెరికాది.