డ్ర‌గ్స్ రాకెట్ వ్య‌వ‌హారం రంగు మారుతోందా..?

హైద‌రాబాద్ లో బ‌య‌ట‌ప‌డ్డ డ్ర‌గ్స్ రాకెట్ కేసు సంచ‌ల‌నం రెకెత్తిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ వ్య‌వ‌హారంపై అధికార పార్టీ స్పందిస్తున్న తీరు చూస్తుంటే… దీని రంగు మారుతోందా అనే అనుమానాలు క‌లుగుతున్నాయి. ఈ రాకెట్ లో సినీ రంగంతోపాటు ప‌లు విద్యా సంస్థ‌లు, సాఫ్ట్ వేర్ కంపెనీల ఉద్యోగులు వినియోగ‌దారులుగా ఉన్న‌ట్టు ఇప్ప‌టికే పోలీసులు చెప్పారు. అయితే, ఈ విష‌యంలో ద‌ర్యాప్తు అధికారులు కాస్త చొర‌వ‌గా ముందుకు వెళ్తుంటే.. వారు ఓవ‌రాక్ష‌న్ తో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే అభిప్రాయం అధికార పార్టీ వ‌ర్గాల నుంచి వినిపిస్తోంది. యువ‌త‌కు సంబంధించిన ఓ సున్నిత‌మైన అంశాన్ని పోలీసులు అన‌వ‌స‌రంగా పెద్దదిగా చేసి సంచ‌ల‌నం కోసం ప్ర‌య‌త్నిస్తున్నారనే అభిప్రాయం అధికార పార్టీ వ‌ర్గాల నుంచే వినిపిస్తూ ఉండ‌టం విశేషం!

ప్ర‌స్తుతం ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్ట‌ర్ గా అకున్ స‌బ‌ర్వాల్ బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. ఈ డ్ర‌గ్ర్ రాకెట్ విష‌యంలో ఆయ‌న బాగానే చొర‌వ తీసుకుంటున్నారు. అయితే, తాజాగా ఈ కేసుకు తెర‌మీదికి రావ‌డంతో, దీన్ని అన‌వ‌స‌రంగా అకున్ సంచ‌లనాత్మ‌కంగా మార్చేశార‌నే విమ‌ర్శ ప్ర‌భుత్వ వ‌ర్గాల నుంచి వినిపిస్తోంది. ఎక్క‌డో ఒక‌రిద్ద‌రు ఈ దందాలో ఉంటే… దాన్ని తీసుకొచ్చి కొన్ని స్కూళ్ల‌కి త‌గ‌లించేశార‌నీ, దీంతో ఆయా స్కూళ్లు పేర్లు బ‌య‌ట‌కి రావ‌డం, డ్ర‌గ్స్ రాకెట్ వ‌ల‌లో ఉన్న బ‌డుల‌కు త‌మ పిల్ల‌ల్ని పంపిస్తున్నామా అని చాలామంది త‌ల్లిదండ్రులు టెన్ష‌న్ పడుతూ ఉన్నార‌నే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి.

అయితే, ప్ర‌భుత్వ శాఖ‌తో సంబంధం లేకుండా కొన్ని విద్యా సంస్థ‌ల‌కు స‌బ‌ర్వాల్ స్వ‌యంగా లేఖ‌లు రాయ‌డంపై కూడా చ‌ర్చ జ‌రుగుతోందట‌. విద్యా శాఖ‌కు ఈ విష‌యం తెలియ‌జేయ‌లేద‌నీ, ఇంత‌వ‌ర‌కూ దీనిపై త‌మ‌కు వారి నుంచి ఎలాంటి స‌మాచారం లేద‌ని ఉప ముఖ్య‌మంత్రి క‌డియం శ్రీ‌హ‌రి అన్నారు. ద‌ర్యాప్తు అధికారుల తీరుపై ఆయ‌న కాస్త అసంతృప్తిగానే ఉన్నార‌నీ, ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూడా దాదాపు ఇలాంటి అభిప్రాయంతోనే ఉన్నారంటూ అధికార పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు, ఈ వ్య‌వ‌హారంపై గ‌డ‌చిన కొన్ని రోజులుగా మీడియాలో ప్ర‌ధానంగా క‌థ‌నాలు వ‌స్తుండ‌టంతో, సీఎం స్పందించార‌ని చెబుతున్నారు. అకున్ స‌బ‌ర్వాల్ తో సీఎం ఫోన్లో మాట్లాడార‌నీ, ఈ సంద‌ర్భంగా క్లాస్ తీసుకున్నార‌ని కూడా చెబుతున్నారు. ఉన్న‌త స్థాయికి చెందిన కొంత‌మంది అధికారుల‌తోపాటు ముఖ్య‌మంత్రి, ఉప ముఖ్య‌మంత్రి కూడా అధికారుల తీరుపైనే అసంతృప్తిగా ఉన్న‌ట్టు తెలుస్తోంది.

డ్ర‌గ్స్ రాకెట్ చ‌ర్చ ఎట్నుంచి ఎటో వెళ్లిపోతున్న‌ట్టుగా ఉంది. మొన్న‌టికి మొన్న‌.. ఈ రాకెట్ తో సంబంధించిన సీనీ రంగం వారు కూడా ఉన్నార‌ని క‌థ‌నాలు వ‌చ్చాయి. బ‌డాబాబులే డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రాలో ఉన్న‌ట్టు అనుమానిస్తూ మీడియాలో చ‌ర్చ జ‌రిగింది. ఇప్పుడు ఆ క‌లర్ మొత్తం మారింది. ఏదో చిన్న కేసును ప‌ట్టుకుని అధికారులు ఓవ‌రాక్ష‌న్ చేస్తున్నారంటూ ప్ర‌భుత్వం భావిస్తున్న‌ట్టుగా రంగు మారుతోంది. నిజంగానే అధికారుల అతి వ‌ల్లే ఈ వ్య‌వ‌హారం సంచ‌ల‌మైందా..? లేదా, అధికారుల మీద నెపాన్ని నెట్టేసి.. అస‌లు విష‌యాల‌పై చ‌ర్చ రానీయ‌కుండా చేసే ప్ర‌య‌త్న‌మా..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com