ఈడీ సమన్లే జగన్ కొంప ముంచాయా!

హైదరాబాద్: మొత్తానికి దోబోచులాట ముగిసింది. అస్పష్టత తొలగిపోయింది. ఫిరాయింపులు జరిగిపోయాయి. అయితే ఈ ఐదుగురు ప్రజాప్రతినిధులూ వైసీపీనుంచి టీడీపీలోకి ఎందుకు ఫిరాయించారనేదానిపై మాత్రం స్పష్టత రాలేదు. మీడియాలో రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. స్థూలంగా చూస్తే, ప్రతిపక్షం నుంచి అధికారపార్టీలోకి ప్రజాప్రతినిధులు ఫిరాయించటం సర్వసాధారణంగా జరిగే రివాజే. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కూడా టీడీపీ నుంచి అనేకమంది కాంగ్రెస్ లోకి ఫిరాయించారు. ఇప్పుడు తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలనుంచి అధికార టీఆర్ఎస్‌లోకి జోరుగా ఫిరాయింపులు జరుగుతున్నాయి. రాజకీయం అంతా డబ్బు చుట్టూ తిరుగుతున్న సమకాలీన పరిస్థితులలో ఎమ్మెల్యేగా గెలవటానికి పెట్టిన ఖర్చును, భవిష్యత్తులో కొనసాగటానికి కావలసిన ఖర్చును రాబట్టుకోవాలంటే ప్రతిపక్షంలో కంటే అధికారపక్షంలో ఉంటే వెసులుబాటు ఎక్కువ ఉంటుంది. దానికి తోడు ఫిరాయించటానికి అధికారపార్టీ ఎర చూపే ప్యాకేజిలు ఎలాగూ ఉంటాయి. నిన్న పచ్చ కండువా కప్పుకున్నవారంతా అన్యాపదేశంగా అదే చెప్పారు. ప్రతిపక్షంలో ఉండటం వలన పనులు జరగటంలేదని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోతున్నామని అన్నారు(అంటే ప్రతిపక్ష సభ్యుల నియోజకవర్గాలపట్ల ప్రభుత్వం పక్షపాత ధోరణి వహిస్తుందని అర్థమా?). సరే, ఆ రివాజును పక్కన పెడితే బలంగా వినబడుతున్న ఒక వాదన ఏమిటంటే, జగన్ రాజ్‌భవన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుకు సవాల్ విసరటమే దీనంతటికీ కారణం అని. అధికారపార్టీని రెచ్చగొట్టటం వలన చంద్రబాబు దానిని సీరియస్‌గా తీసుకుని ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరతీశారని ఆ వాదనలో సారాంశం. అయితే ఏమాటకామాటే చెప్పుకోవాలి… జగన్ ఆ రోజున ప్రభుత్వాన్ని పడగొడతానని సవాల్ విసరలేదు. దమ్ము, ధైర్యం ఉంటే ఎన్నికలకు రావాలని మాత్రమే సవాల్ విసిరారు. ఒక విలేకరి ప్రశ్నకు సమాధానమిస్తూ, టీడీపీ ప్రభుత్వాన్ని కూల్చేటానికి కావాల్సిన 21 మంది ఎమ్మెల్యేలు తమవద్ద ఉన్నారని తాను చెప్పలేదని, అంతమంది వస్తే విలేకరులకు చెబుతానని, ఆ తర్వాత గంటలోనే ప్రభుత్వాన్ని కూల్చేస్తామని మాత్రమే అన్నారు. ఫిరాయింపులకు కారణంపై టీడీపీ వారు కూడా ఒక వాదన చెప్పుకొస్తున్నారు. తమ అధినేతకు మొదట్లో ఆపరేషన్ ఆకర్ష్ మీద ఆసక్తి లేదని, అయితే జగన్ కాపుల ఆందోళన వెనక చేరి విధ్వంసాన్ని సృష్టించి అల్లకల్లోలానికి ప్రయత్నించటంతో చంద్రబాబు వైసీపీ అధినేతకు చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు. “నన్ను జగన్ అండర్ ఎస్టిమేట్ వేస్తున్నాడు, అతనికి త్వరలోనే నేనేంటో తెలిసొచ్చేలా చేస్తాను” అని బాబు ఇటీవల పార్టీకి చెందిన ఒక సమావేశంలో చెప్పినట్లు తెలుగు తమ్ముళ్ళు చెప్పుకొస్తున్నారు. అందుకే ఆయన వైసీపీ నాయకులు చేరికకు జెండా ఊపారని, ఎక్కడికక్కడ ఆసక్తి కల వైసీపీ నాయకులను తీసుకురావాలని టీడీపీ నేతలను ఆదేశించారని అంటున్నారు. మరోవైపు జగన్ వ్యవహారశైలి నచ్చకే ఎమ్మెల్యేలు బయటకొస్తున్నారని ఇంకో వాదన కూడా వినిపిస్తోంది. ఒంటెత్తు పోకడ, ఎవరి సలహా వినే అలవాటు లేకపోవటం, నియంతృత్వ ధోరణి, తప్పుడు నిర్ణయాలతో పార్టీలోని స్వతంత్రభావాలు కలవారందరూ విసిగిపోయారని చెబుతున్నారు. ఇది కొంతవరకు నిజమేనన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే వీటన్నంటికీ భిన్నంగా ఒక వాదన వినబడుతోంది. ఈడీ కోర్ట్ సమన్లు జారీచేయటమే జగన్ కొంప ముంచాయని చెబుతున్నారు. జగన్‌పై కేసులు నీరుగారిపోయాయని వైసీపీ శ్రేణులు భావిస్తుండగా ఇటీవల జారీ అయిన సమన్లు ఆ కేసుల తీవ్రతను గుర్తు చేసి వారిలో ఆందోళన రేకెత్తించాయంటున్నారు. దానికి తోడు – 2019 ఎన్నికలలోపే జగన్ జైలుకు వెళ్ళటం, కనీసం రెండేళ్ళకు తక్కువకాకుండా శిక్ష పడటం ఖాయమని, ఆ తర్వాత ఎన్నికల్లో పోటీచేయటానికి కూడా పనికిరాకుండా పోతారని పుకార్లను వ్యాపింపజేసి వైసీపీ నాయకులలో టీడీపీవారు భయాందోళనలు రేకెత్తించారని చెబుతున్నారు. దీనితోనే ఇక వైసీపీ పుట్టి మునగటం ఖాయమని, అక్కడ ఉంటే భవిష్యత్తు ఉండదని ఎమ్మెల్యేలు సర్దుకుంటున్నారని అంటున్నారు. ఏది ఏమైనా జగన్ వ్యవహారశైలి మొదటినుంచీ లోపభూయిష్టంగానే ఉంది. ఆయన ముఖ్యమంత్రి గద్దెనెక్కటం ఒక్కటే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎప్పుడెప్పుడు ఆ కుర్చీలో కూర్చుంటానా అని తహతహలాడుతున్నారు తప్పితే ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఉన్నట్లు ఏ కోశానా కనబడటంలేదు. ఏ సభలో చూసినా చంద్రబాబు నామస్మరణ చేస్తూ ఆయనపై నిప్పులు చెరగటం, ఈ ప్రభుత్వం త్వరలోనే పడిపోతుందని జోస్యం చెప్పటం తప్పితే నిర్మాణాత్మక ప్రతిపక్ష నేత పాత్ర పోషించినది లేదు. ప్రజలు ఇదంతా గమనిస్తూనే ఉంటారు. ఇప్పటికైనా ఆయన తన పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది. మరోవైపు చంద్రబాబునాయుడు కూడా తక్కువ తినలేదు. తెలంగాణలో తలసాని శ్రీనివాస యాదవ్ వంటి నాయకులు స్వార్థ ప్రయోజనాలకోసం పార్టీలు మారారని ఇటీవల జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ప్రసంగాలు చేసివచ్చి, ఏపీలో అదేపని చేయటం ఏ విధమైన సచ్చీలతో ఆయనే సమాధానం చెప్పాలి. మాటకుముందు నైతిక విలువలు గురించి లెక్చర్‌లు దంచే ముఖ్యమంత్రి, వైసీపీ ఎమ్మెల్యేలను తీసకోవాలనుకుంటే వారితో రాజీనామాలు చేయించి ఉండాల్సింది. అలా చేస్తే ఒక సత్సాంప్రదాయానికి శ్రీకారం చుట్టినవారయ్యేవారు. తెలంగాణలో పార్టీ ఎమ్మెల్యేలు వీడుతున్నపుడు చంద్రబాబు చెప్పే స్టాక్ డైలాగ్ ఒకటుంటుంది… “నాయకులు వెళ్ళినా టీడీపీకి క్యాడర్ బలంగా ఉంటుంది” అని. మరి ఆ సూత్రం ఇక్కడ వర్తించదా!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com