“అధికారం అనేది రిజర్వేషన్లతో బదిలీ అయ్యే వస్తువు కాదు.. అది ఆత్మవిశ్వాసంతో సాధించుకునే హక్కు. చట్టసభల్లో మహిళల సంఖ్య రిజర్వేషన్ల ద్వారా పెరగడం విజయానికి సగం దూరమే.. వారి గళం స్వతంత్రంగా వినిపించినప్పుడే గమ్యం చేరినట్లు.”
భారత రాజకీయాల్లో ఇప్పుడు కొత్త అంకం మొదలైంది. కులం, మతం, ప్రాంతం అనే పాత చింతకాయ పచ్చడి రాజకీయాల నుంచి ఓటర్లను మళ్లించి జెండర్ పాలిటిక్స్ వైపు తీసుకెళ్తున్నాయి రాజకీయ పార్టీలు. ఇందులో భాగంగానే మహిళా రిజర్వేషన్ల బిల్లును రాజకీయ పార్టీలు ఒక బ్రహ్మాస్త్రంలా వాడుతున్నాయి. బీజేపీ రాజకీయాల్లో అందరికంటే రెండాకులు ఎక్కువ చదివింది కాబట్టి ఈ మహిళా బిల్లుతో పాటు వివాదాస్పదం అవుతుందని భావిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను కూడా తెలివిగా పూర్తి చేస్తోంది. గతంలో మహిళా బిల్లును ఆమోదించినప్పుడు నియోజకవర్గాల సంఖ్య పెంచిన తర్వాతనే ఇది అమలులోకి వస్తుందని నిబంధన పెట్టింది. ఇప్పుడు ఆ నిబంధనే ప్రభుత్వానికి ఒక కవచంలా మారింది. నియోజకవర్గాలు పెంచడానికి మహిళా బిల్లును అడ్డం పెట్టుకుని పని పూర్తిచేస్తోంది.
మహిళా రిజర్వేషన్లతో ఏం ఆశిస్తున్నారు!?
ఇప్పుడు మహిళా రిజర్వేషన్లతో రాజకీయ పార్టీలు ఏం సాధిస్తాయన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. చట్టం మహిళకు కుర్చీని ఇవ్వగలదు కానీ, ఆ కుర్చీలో కూర్చునే ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని సమాజం ఇవ్వాలి. రిజర్వేషన్లు అనేవి ఒక నిచ్చెన మాత్రమే.. ఆ నిచ్చెన ఎక్కి పైకి వెళ్లాల్సింది మాత్రం మహిళలే. మహిళా బిల్లుతో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నారు. ప్రతి ముగ్గురిలో ఒకరు మహిళ ఉంటారు. అలా ఉంటే.. మహిళా సాధికారిత.. మహిళా నాయకత్వం వచ్చేసినట్లేనా..? కానే కాదు. మహిళా రిజర్వేషన్ బిల్లు ద్వారా చట్టసభల్లో 33 శాతం స్థానాలను కేటాయించడం అనేది ఒక చారిత్రాత్మక అడుగుగా కనిపిస్తున్నా, అది కేవలం సంఖ్యాపరమైన మార్పునకే పరిమితమయ్యే ప్రమాదం ఉంది. పెరిగిన సీట్లతో దేశవ్యాప్తంగా దాదాపు 283 పైగా లోక్సభ స్థానాలు మహిళలకు కేటాయిస్తారు. ప్రతి ముగ్గురు చట్టసభ సభ్యుల్లో ఒకరు మహిళగా ఉండటం వల్ల మాత్రమే మహిళా నాయకత్వం పరిపూర్ణమవుతుందని భావించడం భ్రమ అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లు ఉన్నాయి. వాటి ఫలితాలు మాత్రం కనిపించడం లేదు.
దశాబ్దాలు గడుస్తున్నా స్థానిక సంస్థల నుంచి మహిళా నేతలు ఎదుగలేదు ఎందుకు?
భారతదేశంలో మహిళా రిజర్వేషన్లు కల్పించినప్పటి నుంచి వారి నాయకత్వంలో వచ్చిన మార్పులను తెలుసుకుంటే.. చట్టబద్ధమైన హక్కులకు , క్షేత్రస్థాయి వాస్తవాలకు మధ్య ఉన్న అగాధమేంటో స్పష్టమవుతుంది. 1992లో పీవీ నరసింహారావు ప్రభుత్వం తెచ్చిన 73, 74 రాజ్యాంగ సవరణలు స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించి ఒక విప్లవాత్మక మార్పుకు నాంది పలికాయి. ఆ తర్వాత కొన్ని రాష్ట్రాలు ఈ కోటాను 50 శాతానికి కూడా పెంచాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పంచాయతీరాజ్ వ్యవస్థలో దాదాపు 14.5 లక్షల మంది మహిళా ప్రతినిధులు ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. అయితే, ఈ సంఖ్య కేవలం రిజిస్టర్లలో మెరుస్తున్న అంకె మాత్రమే తప్ప, అధికారం నిజంగా మహిళల చేతుల్లో ఉందా అంటే సమాధానం శూన్యం. సర్పంచ్ పతి, ప్రధాన్ పతి అనే సంస్కృతి వేళ్లూనుకోవడంతో, మహిళా ప్రతినిధులు కేవలం సంతకాలకే పరిమితమై, తెరవెనుక పురుషుల పెత్తనం సాగుతోంది. స్థానిక సంస్థల అనుభవాన్ని పరిశీలిస్తే, రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని సామాజిక కట్టుబాట్లు ఏ విధంగా అణచివేస్తున్నాయో అర్థమవుతుంది. అనేక గ్రామాల్లో మహిళా సర్పంచులుగా ఎన్నికైన వారు కనీసం పంచాయతీ కార్యాలయానికి వెళ్లని పరిస్థితి ఉంది. వారి తరపున భర్తలే సమావేశాల్లో పాల్గొనడం, అధికారులపై ఒత్తిడి తేవడం వంటివి నిత్యకృత్యమయ్యాయి. కొన్ని రాష్ట్రాల్లో జరిపిన సర్వేల ప్రకారం, దాదాపు 70 శాతం మహిళా ప్రతినిధులు తమ సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని, ఆర్థిక లావాదేవీలన్నీ పురుష బంధువులే చూస్తున్నారని వెల్లడైంది. ఈ పరోక్ష పాలన వల్ల మహిళా రిజర్వేషన్ల లక్ష్యం నీరుగారిపోతోంది. ఇప్పుడు ఇదే తరహాలో లోక్సభ, అసెంబ్లీల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే, అక్కడ కూడా పొలిటికల్ వారసులైన భార్యలు, కుమార్తెలతో సభ నిండిపోకుండా ఉంటుందా?
మహిళల పేరుతో మగవాళ్లు చేసే పెత్తనంతో ఏం లాభం?
ప్రస్తుతం లోక్సభలో మహిళల ప్రాతినిధ్యం కేవలం 15 శాతం లోపే ఉంది. చట్టం ప్రకారం ఇది 33 శాతానికి చేరినప్పుడు పెరిగిన సీట్లలో దాదాపు 283 మంది మహిళా ఎంపీలు సభలో కనిపిస్తారు. కానీ, ఈ మార్పు గుణాత్మకమైనదా లేక కేవలం సంఖ్యాపరమైనదా అన్నదే అసలు ప్రశ్న. రాజకీయ పార్టీలు టిక్కెట్ల కేటాయింపులో విధేయతను, కుటుంబ నేపథ్యాన్ని చూస్తాయి తప్ప, నాయకత్వ లక్షణాలను కాదు. ఫలితంగా చట్టసభల్లో మహిళలు ఒక ఓట్ బ్యాంక్, డమ్మీ ప్రతినిధులుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. కేవలం రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల మహిళా సాధికారత వస్తుందనుకోవడం నిచ్చెన వేసి పైకి ఎక్కమన్నట్లు ఉంటుంది. కానీ ఆ నిచ్చెన ఎక్కే ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఇచ్చే సామాజిక వాతావరణం మాత్రం మన దగ్గర ఇంకా ఏర్పడలేదు. నిజమైన మహిళా నాయకత్వం అనేది రిజర్వేషన్ల కోటా నుంచి కాకుండా, సామాజిక స్థితిగతుల మార్పు ద్వారా రావాలి. మహిళలకు ఆర్థిక స్వతంత్రత, విద్య, రాజకీయ అవగాహన కల్పించనంత కాలం ఎన్ని రిజర్వేషన్లు ఇచ్చినా అవి ముసుగు పెత్తనానికే దారితీస్తాయి. రాజకీయాల్లోకి రావాలనుకునే మహిళలకు పార్టీలు అంతర్గతంగా ప్రాధాన్యత ఇవ్వాలి, వారిని స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహించాలి. అప్పుడే పార్లమెంటులో కూర్చున్న మహిళా ప్రతినిధులు తమ భర్తల లేదా తండ్రుల కబంధ హస్తాల నుంచి బయటకు వచ్చి, దేశ భవిష్యత్తును మార్చే గళాన్ని విప్పగలరు.
రిజర్వేషన్లు లేని దేశాల్లో దేశాధ్యక్షులుగా మహిళలు
ప్రపంచ రాజకీయాల్లో ఎంతో మంది మహిళా నేతలు తమదైన ముద్ర వేస్తున్నారు. ఇందిరాగాంధీ ఉక్కు మహిళగా దేశాన్ని నడిపించినప్పుడు మహిళా రిజర్వేషన్లు లేవు. ప్రపంచ మహిళా నేతల్ని చూస్తే వారు రిజర్వేషన్లతో ఎదగలేదన్న సత్యం కళ్ల ముందు ఉంటుంది. ప్రస్తుత నేతల్లో ఇటలీ ప్రస్తుత ప్రధాని జార్జియా మెలోని ఒక శక్తివంతమైన ఉదాహరణ. అక్కడ ప్రధానితో పాటు ప్రధాన ప్రతిపక్ష నేత ఎల్లీ షెల్లీన్ కూడా మహిళే . విచిత్రమేమిటంటే, ఇటలీలో మహిళలకు చట్టసభల్లో ఎలాంటి ప్రత్యేక రిజర్వేషన్లు లేవు. కేవలం తమ పోరాట పటిమతో, మేధస్సుతో పురుషాధిక్య రాజకీయ క్షేత్రంలో వారు అగ్రస్థానానికి చేరుకున్నారు. మహిళా నాయకత్వాన్ని అక్కడి సమాజం ఒక అద్భుతంలా కాకుండా, ప్రజాస్వామ్యంలో ఒక సహజమైన ప్రక్రియగా చూస్తుంది. బ్రిటన్ రాజకీయ చరిత్రను పరిశీలిస్తే మార్గరెట్ థాచర్ నుంచి థెరిసా మే, లిజ్ ట్రస్ వరకు అనేకమంది మహిళలు దేశాన్ని శాసించారు. అక్కడ కూడా రిజర్వేషన్ల ఊసే లేదు. కేవలం సామర్థ్యం ప్రాతిపదికన పార్టీలు వారిని అగ్రనేతలుగా గుర్తించాయి. అమెరికా వంటి అగ్రరాజ్యంలో ఇప్పటివరకు మహిళా అధ్యక్షురాలు లేకపోయినప్పటికీ, అక్కడ మహిళా రిజర్వేషన్ల కోసం ఉద్యమాలు జరగవు. హిల్లరీ క్లింటన్ వంటి వారు కేవలం రాజకీయ సమీకరణాల వల్ల తృటిలో అవకాశం కోల్పోయారు తప్ప, సామర్థ్యం ఉన్న మహిళలను ఆమోదించే విషయంలో అక్కడి సమాజానికి ఎలాంటి సంకోచాలు లేవు.
రిజర్వేషన్లు నిజమైన సాధికారితకు మార్గం కావాలి!
“ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన మహిళా నేతలు ఎవరూ రిజర్వేషన్ల దారిలో రాలేదు.. తమ ప్రతిభను అస్త్రంగా చేసుకుని వ్యవస్థలను ఎదిరించి నిలిచారు. మన దేశంలో కూడా రిజర్వేషన్లు ముసుగుగా కాకుండా, ప్రతిభకు మార్గదర్శకాలుగా మారాలి.” పశ్చిమ దేశాల్లో మెరిట్ కు ఇచ్చే ప్రాధాన్యతే మహిళల ఎదుగుదలకు సోపానంగా మారుతోంది. భారతదేశంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. మన దగ్గర మహిళను ఇంటికి దేవతగా, మాతృమూర్తిగా ఆరాధిస్తాం కానీ, ప్రజా ప్రతినిధిగా మనల్ని నడిపించే నాయకురాలిగా అంగీకరించడానికి సామాజిక మనస్తత్వం ఇంకా పూర్తిగా సిద్ధపడలేదు. అందుకే ఇక్కడ చట్టబద్ధమైన రిజర్వేషన్ల అవసరం ఏర్పడుతోంది. ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి చట్టాలు తెచ్చినప్పటికీ, రాజకీయ పార్టీలు టిక్కెట్ల కేటాయింపులో ఇప్పటికీ పురుషులకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో రిజర్వేషన్లు లేని చోట మహిళలు అద్భుతాలు సృష్టిస్తుంటే, మన దగ్గర చట్టాల అండ ఉన్నా నామమాత్రపు పదవులకే పరిమితం కావడం ఆలోచించాల్సిన విషయం. కానీ అలాంటి ఆలోచన చేయరు. ఎందుకంటే మహిళా బిల్లు తెలుస్తోంది వారి సాధికారిత కోసం కాదు. ఓటు బ్యాంకుగా మార్చుకోవడం కోసం. భారతదేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది ఇప్పుడు ఒక అనివార్య రాజకీయ అవసరంగా మారింది. ఏ పార్టీ కూడా ఈ బిల్లును బహిరంగంగా వ్యతిరేకించే సాహసం చేయదు. ఎందుకంటే దేశంలోని ఓటర్లలో సగం మంది మహిళలే. వారిని కాదని రాజకీయం చేయడం ఆత్మహత్య సదృశ్యమని అన్ని పార్టీలకు తెలుసు. అందుకే బీజేపీ ఈ బిల్లును ముందుకు తెస్తే, తాము మహిళా విరోధులుగా ముద్ర పడకూడదన్న భయంతో కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. అయితే, ఈ ఆమోదం వెనుక మహిళా సాధికారత పట్ల ఉన్న చిత్తశుద్ధి కంటే, ఓటు బ్యాంకు ను కొల్లగొట్టాలనే ఆశే ఎక్కువగా కనిపిస్తోంది.
స్వశక్తితో ఎదిగే అవకాశం కల్పించాలి!
అడవిలో వృక్షాలు బలంగా పెరగాలంటే కేవలం పైపైన నీళ్లు పోస్తే సరిపోదు, ఆ నేల సారవంతంగా ఉండాలి. అదేవిధంగా, చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం పెరగాలంటే కేవలం రిజర్వేషన్లనే నీరు అందిస్తే సరిపోదు, వారిని ప్రోత్సహించే సామాజిక వాతావరణం అనే నేల సారవంతం కావాలి. నాయకత్వం అనేది ఎవరో ఇస్తే వచ్చేది కాదు, అవకాశాలను అందిపుచ్చుకుని స్వశక్తితో ఎదిగినప్పుడు మాత్రమే దానికి సార్థకత చేకూరుతుంది. మహిళల్లో ఆత్మవిశ్వాసం, ఉన్నత విద్య, ఆర్థిక స్వతంత్రత వంటి పునాదులు బలంగా లేనంత కాలం, ఎన్ని చట్టాలు తెచ్చినా అవి కేవలం కాగితాలకే పరిమితమైన ఎన్నికల స్టంట్లుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుత రాజకీయాల్లో మహిళా రిజర్వేషన్లు అనేవి మగవారి పెత్తనానికి మరో బ్యాక్ డోర్ క్షేత్రస్థాయిలో మనం చూస్తున్న సర్పంచ్ పతి సంస్కృతి చట్టసభలకు పాకితే, అది మహిళా సాధికారతను అపహాస్యం చేయడమే అవుతుంది. నాయకత్వం కింది స్థాయి నుంచి సహజంగా ఉద్భవించాలి. మహిళలు కేవలం తమ కుటుంబంలోని పురుష నేతల వారసత్వాన్ని మోసే ప్రోక్సీలుగా కాకుండా, సొంత నిర్ణయాలు తీసుకోగలిగే శక్తివంతులుగా ఎదిగినప్పుడే అసలైన ప్రాతినిధ్యం దక్కుతుంది. నిజమైన మార్పు అనేది రిజర్వేషన్ల కోటాలో కాకుండా, మహిళలను సమాజంలో సమభాగస్వాములుగా చూసే దృక్పథంలో రావాలి. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని వంటి వారు ఎలాంటి రిజర్వేషన్లు లేకుండానే అగ్రస్థానానికి చేరుకున్నారంటే, అక్కడ వారి ప్రతిభను గుర్తించే సామాజిక స్పృహ ఉంది. మన దేశంలోనూ అలాంటి నాయకత్వం పుట్టుకురావాలంటే.. చదువు, ఉద్యోగం, ఆర్థిక స్వేచ్ఛ అనే మూడు సూత్రాలు మహిళల జీవితాల్లో వెలుగు నింపాలి. రాజకీయ పార్టీలు కేవలం ఓట్ల వేట కోసం కాకుండా, దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మహిళా నాయకత్వాన్ని స్వతంత్రంగా ఎదగనివ్వాలి.
అంతిమంగా, మహిళా రిజర్వేషన్ బిల్లు ఒక రాజకీయ ప్రహసనంలా మిగిలిపోకూడదంటే.. అది మహిళల కష్టాలను తీర్చే ఒక దివ్యౌషధంగా మారాలి. చట్టసభల్లో పెరిగే సంఖ్య కేవలం అలంకారప్రాయం కాకూడదు. నిర్ణయాధికారాల్లో మహిళల గొంతుక స్పష్టంగా వినిపించినప్పుడే, ఆ సీటుకు గౌరవం, ఆ చట్టానికి సార్థకత చేకూరుతాయి.
ఇవన్నీ రాజకీయ నేతలకు , అన్ని పార్టీలకూ తెలుసు. కానీ బయటకు చెప్పుకోలేరు. మహిళల్ని మోసం చేయడానికి వారి ఓట్లను పొందడానికి రిజర్వేషన్లు అనే ఆయుధాన్ని వదులుకోలేరు. అయితే ఈ నేతలు తెలుసుకోవాల్సింది.. దేశాభివృద్ధిలో మహిళలను భాగస్వాములను చేయడం అంటే వారికి ఒక సీటు ఇవ్వడం మాత్రమే కాదు, వారు స్వయంప్రతిభతో ఆ సీటును అధిరోహించేలా మార్గం సుగమం చేయడం. ఆ రోజు వచ్చినప్పుడే భారతదేశం నిజమైన ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచంలో వెలుగుతుంది.


