ఎడిటర్స్ కామెంట్ : ప్రజల్ని రోడ్డున పడేస్తున్న “పరిపాలనా రాజకీయం” !

రాజ్యం ఎంత ప్రశాంతంగా ఉంటే ప్రజలు అంత సుఖంగా జీవనం గడుపుతారు. రాజ్యమే అల్లకల్లోలంగా ఉంటే ప్రజలకు ఇక నిద్రాహారాలు ఉంటాయా? ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి చూస్తూంటే ప్రతి ఒక్క వర్గమూ ఏదో ఓ ఆందోళనలో ఇబ్బంది పడుతూనే ఉంది. ప్రభుత్వాలు వారి రాజకీయాలు వారు చేసుకుంటున్నారు కానీ.. ప్రజలపై.. ప్రజాసమస్యలపైనా దృష్టి పెట్టే ప్రయత్నమే చేయకపోవడం ఎవరికైనా ఆశ్చర్యకరంగా అనిపించవచ్చు. కానీ ఓటింగ్ ప్రయారిటీ ప్రజాసమస్యలు కాదని ఓ గట్టి అభిప్రాయానికి వచ్చిన అధికార పార్టీలు.. ప్రజల్నీ ఇప్పుడు వీలైనంత కష్టాలు పాలు చేసి.. ఎన్నికలకు వెళ్లే ముందు కావాల్సినంత సాయం చేస్తే చాలు ఓట్ల వరద వస్తుందని అనుకుంటున్నట్లుగా ఉన్నాయి. అందుకే ఇప్పుడు.. రెండు రాష్ట్రాల్లోనూ అన్ని వర్గాల ప్రజలకూ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బతకు భయంతో ఉన్నారు.

తెలంగాణ ఉద్యోగులదీ ఓ బాధ.. ఏపీ ఉద్యోగులది మరో బాధ !

తెలంగాణలో గత వారం రోజుల్లో ఏకంగా పది మంది ఉద్యోగులు చనిపోయారు. వారిలో ముగ్గురు ఆత్మహత్యలు చేసుకుంటే మిగిలిన వారు ఆందోళనతో గుండెపగిలి చనిపోయారు. దీనికి కారణం జీవో 317 . తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ మినహా తొమ్మిది ఉమ్మడి జిల్లాల ఉద్యోగులను 32 కొత్త జిల్లాలకు కేటాయింపులు చేయాల్సి ఉంది. ఇలా చేయడానికి ప్రభుత్వం జీవో 317ను విడుదల చేసింది. కొత్త జిల్లాల వారీగా కేటాయింపులు శాశ్వతం. అంటే సర్వీస్అంతా ఉద్యోగులకు కేటాయించిన జిల్లాల్లోనే పనిచేయాల్సి ఉంటుంది. స్థానికతను ప్రామాణికంగా తీసుకోకపోవడంతోనే సమస్య వచ్చింది. సీనియార్టీని బట్టి చేస్తూండటంతో శాశ్వతంగా కుటుంబాన్ని, పిల్లలకు దూరంగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.ఈ కారణంగా ఉద్యోగులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. రాజకీయ పార్టీలు రాజకీయం చేసుకుంటున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. ఇక.. ఏపీలో ఉద్యోగులు.. తమ జీతాలు తగ్గించమాకండి మహా ప్రభో అని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల నేతలు సీఎం జగన్ పీఆర్సీ ప్రకటించగానే చప్పట్లు కొట్టారు కానీ ఇప్పుడు ఆ పీఆర్సీతో జీవో జారీ చేయవద్దని ప్రభుత్వ పెద్దల్ని బతిమాలుతున్నారు. జీవో జారీ చేస్తే ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఫిట్‌మెంట్ తగ్గించినా చప్పట్లు కొట్టాం కానీ హెచ్‌ఆర్‌ఏ తగ్గిస్తే అన్యాయమైపోతామని అంటున్నారు. ఉద్యోగ నేతల్ని పడిగాపులు పడేలా చేస్తున్నారు కానీ పట్టించుకునే దిక్కు లేదు.. వారి బాధలు ఉంటే.. రెండేళ్లకే ప్రొబేషన్ ఇస్తామని ఉద్యోగాల్లోకి తీసుకున్న లక్షన్నర మంది గ్రామ, వార్డు సచివాలయఉద్యోగులకు భవిష్యక్ కనిపించడం లేదు. మార్చి పోతే సెప్టెంబర్ అన్నట్లుగా వారి ప్రొబేషన్ వాయిదా పడుతోది. వారూ రోడ్డెక్కుతున్నారు. ఓటీఎస్ ల‌క్ష్యాలతో మున్సిపల్ కమిషనర్లు ఆగమవుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఏ ఒక్క ఉద్యోగి ప్రశాంతంగా లేడు.

రైతుల గోసను పట్టించుకునేదెవ్వరు !?

రాష్ట్రం ఏదైనా రైతుల సమస్యలు రైతుల సమస్యలే. రాజకీయాలు రాజకీయాలే . తెలంగాణలో కొద్ది రోజుల రైతుల సమస్యలే ఎజెండాగా రాజకీయాలు నడిచాయి. ధాన్యం కొనుగోళ్ల మీద రాజకీయం చేశారు. కానీ సమస్య మాత్రం తీరలేదు. కొన్న అరకొర ధాన్యానికీ డబ్బులు పెండింగ్‌లో పెట్టారు. ఒక్క తెలంగాణలోనే రైతులకు రెండున్నరవేల కోట్ల చెల్లింపులు చేయాల్సి ఉంది. ఎప్పటికి చేస్తారో తెలియదు. కానీ రైతులు మాత్రం ఎదురు చూస్తూనే ఉన్నారు. రైతు బంధు పేరుతో ట్విట్టర్‌లో ట్రెండింగ్ అయిందంటూ పండగ చేసుకుంది తెలంగాణ ప్రభుత్వం. కానీ నిజమైన రైతులు ఎక్కడ సంతోషంగా ఉన్నారో నిఖార్సుగా ఆత్మపరిశీలన చేసుకోవాల్సి ఉంది. ఒకప్పుడు వరి రైతు అందరు రైతుల్లో రారాజు. ఇప్పుడా రారాజు ఎందుకూ కొరగాని స్థితికి నెట్టివేయబడ్డాడు. గతంలో ఆహార ధాన్యాల్లో వరి ధాన్యం పండించిన రైతుకు కనీసంగానైనా ధర గ్యారంటీ ఉండేది. ఇప్పుడటువంటి అనవాళ్లు మచ్చుకూ కనిపించవు. వడ్లు పండించిన రైతుకు కనీస భరోసా లేదనడానికి రైతులు ప్రస్తుతం పడుతున్న అష్ట కష్టాలే సజీవ సాక్ష్యాలు. ఏపీలోనూ అదే పరిస్థితి రైతు భరోసా కేంద్రాలని పెట్టారు కానీ అక్కడ కొనుగోళ్లు ఉండవు. మిల్లర్లపై ఆధారపడాల్సిందే. ఒక వేళ కొనుగోలు చేస్తే డబ్బులొస్తాయన్న గ్యారంటీ లేదు. ఎప్పుడొస్తాయి అని అడిగితే చెప్పుతో కొట్టేందుకు వెళ్లే ఎమ్మెల్యేలు… హత్యాయత్నం కేసులు పెట్టించే నేతలు ఉంటారు. వారు చెప్పినట్లుగా చేసే పోలీసులు ఉండనే ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులది అదే గోస. కానీ ప్రభుత్వానికి… ప్రతిపక్షాలకు మాత్రం ఆ సమస్యతో రాజకీయం మాత్రమే తెలుసు. పరిష్కారం రావాలని వారికి ఏ కోశానా ఉండదు.

నిత్యావసర వస్తువుల దరువు !

కరోనా లాక్‌డౌన్‌కు ముందు జనం ఆదాయానికి ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఇప్పుడు జనం ఆదాయానికి గండి పడింది . అప్పటితో పోలిస్తే ఇప్పుడు ధరలు రెట్టింపయ్యాయి. రెండేళ్లలో ఉప్పు దగ్గర్నుంచి పప్పు వరకూ అన్నింటి ధరలు రెట్టింపు అయ్యాయంటే అతిశయోక్తి కాదు. సామాన్యుడి బతుకు ఎంత భారం అయిందో సులువుగా అంచనా వేయగలిగే పరిస్థితి. పండక్కి నాలుగు పిండి వంటలు కాదు.. రోజువారీ కడుపు నిండా తినాలన్నా ..బాబోయ్‌ ఉప్పు, పప్పులతో పాటు మిగతా వస్తువుల ధరలు కూడా చుక్కలంటుతున్నాయి. దీనికితోడు వంటగ్యాస్‌, ఇంధనం, వస్త్రాలు అమాంతం పెరగడంతో ప్రజలు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే కరోనా కారణంగా ప్రజల్లో కొనుగోలు శక్తి క్షీణించింది. చేతిలో చిల్లిగవ్వ లేక రెండు పూటలా తిండి దొరకడం కొందరికి కష్టంగా మారింది. అన్ని వస్తువుల ధరలు చుక్కలను అంటడంతో మధ్యతరగతి ప్రజల పరిస్థితి మూలిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా తయారయ్యింది. వంట గ్యాస్‌ ధరలు వెయ్యికి చేరువ అయ్యాయి. గతంలో రేషన్‌ దుకాణాల్లో చింతపండు, పసుపు, పప్పులు, పామాయిల్‌ నూనె తదితర సరకులు ఇచ్చేవారు. ఇప్పుడు పామాయిల్‌ కూడా ఇవ్వడం లేదు. కొంత కాలంగా 14 రకాల సరుకుల పంపిణీ నిలిచిపోయింది. ధరలు పెరుగుతున్న వేళ పేదలను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి. ప్రజల ఆదాయం రోజువారి తిండి తిప్పలే సరిపోని పరిస్థితి ఏర్పడితే ఇక కనీస సౌకర్యాలకు ఎలా ఖర్చు పెట్టుకోగలరు. నిజానికి ఈ నిత్యావసర వస్తువుల ధరలను కంట్రోల్ చేయడం పూర్తిగా ప్రభుత్వాల చేతుల్లో ఉంటుంది. కానీ పట్టించుకోవడం అనేది ఎప్పుడో మానేశారు. ఫలితంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వారి ఇబ్బందులు ఏ రాజకీయ పార్టీకీ అవసరం లేదు.

అక్కడ సినిమా టిక్కెట్లతో కాలక్షేపం.. ఇక్కడ సవాళ్లతో టైం పాస్ !

ఏ సమస్యా లేనట్లుగా సినిమాటిక్కెట్ రేట్ల అంశాన్నినెత్తికెత్తుకున్న ఏపీ ప్రభుత్వం ప్రజలతో ఓ ఆటాడుకుటోంది. సినిమా చుట్టూ ఎంత సినిమా నడుస్తుందో ఈ మధ్య తెలుస్తోంది. రోజుకో కామెంటు. రోజుకో వార్త. రాజకీయాలను సినిమాగా తీసే రోజులు పోయి సినిమానే రాజకీయమైందని ఇప్పుడు చర్చ నడుస్తోంది. సినిమా టికెట్ల ధరలపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. అది కూడా సినిమా వల్లే రక్తి కడుతోంది. ప్రజల నిత్యావసరాల రేట్లు ముందు తగ్గించండి. తరువాత సినిమా రేట్లు తగ్గించొచ్చు అని ఒకరు. అసలు సినిమా కూడా నిత్యావసరమే అని ఒకరు. ఇలా వాదాలు ప్రతివాదాలు వినిపిస్తున్నాయి. కరోనా కోరల్లో పడ్డ రంగాల్లో సహజంగానే సినిమా ఉంది. అసలు కరోనాకు ముందు, కరోనా తరువాత అని చెప్పుకునే రోజులు వచ్చాయి. ఇంకా కరోనా మూడో దశ ఒమిక్రాన్‌ రూపంలో ఉండనే ఉంది. అది పోతూ పోతూ తన ప్రతాపాన్ని ఎలా చూపిస్తుందో అన్న భయం కూడా సినీ జనుల్లో ఉంది. దీంతోనే ప్రభుత్వం టైంపాస్ చేస్తోంది. మిగతా విషయాలన్నింటీని పక్కన పెట్టేసింది. తెలంగాణలో బీజేపీతో రాజకీయ సవాళ్లకు మాత్రమే సమయం కేటాయిస్తోంది. ఒకరు వచ్చి ఫ్రంట్ లేదు టెంట్ లేదు… కేసీఆర్‌ను జైలుకు పంపుడు ఖాయమంటారు. ఇంకొకరు వచ్చి… రైతుల కోసం కేసీఆర్ జైలుకైనా వెళ్లడానికి రెడీ అంటారు. ఎవరికి వారు.. తాము జనం కోసమే రాజకీయం చేస్తున్నామంటారు.. కానీ జనం ప్రయోజనాలు కాకుండా వారిని అడ్డం పెట్టుకుని తమ రాజకీయ ప్రయోజనాలు కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అక్కడే అసలు లోపం బయట పడుతోంది.

పార్టీలతో రాజకీయం చేయాలి.. ప్రజలతో కాదు !

అధికారంలోకి వచ్చే వరకూరాజకీయాలు చేయవచ్చు..కానీ అధికారంలోకి వచ్చాక మాత్రం పరిపాలన చేయాలి. పరిపాలననే రాజకీయం చేసుకుని మళ్లీ వచ్చే సారి ఎలా గెలవాలన్నది అధికారం చేపట్టినుండే రాజకీయం చేసుకుంటూ కూర్చుంటే ప్రజలు అన్యాయమైపోతారు. ప్రజల ఓటింగ్ ప్రయారిటీ మారిపోయిందని.. వాళ్ల బతుకుల్ని బాగు చేసినా చేయకపోయినా… కుల, మత, ప్రాంతాల పేరుతో రెచ్చగొడితే పవిత్రమైన ఓటు వేసేస్తారన్న అంచనాకు పార్టీలు రావడంతోనే ఈ సమస్యలు వస్తున్నాయి. అది నిజం కూడా. పరిపాలించే పార్టీ ఎన్ని గోసలు పెడుతున్నా.. నాలుగేళ్ల పాటు ఎన్నితిప్పలు పెట్టినా.. చివరిలో కాస్త డబ్బు పంపిణీ చేసి.. ఫలానా మాతనికి.. ఫలనా కులానికో వ్యతిరేకంగా సోషల్ మీడియా ప్రచారం చేస్తే చాలు.. పనైపోతుందనుకునే పరిస్థితి ఏర్పడింది. ఇది ఎవరి వల్ల వచ్చింది. ప్రజల వల్లే వచ్చింది. ప్రజలు ఇచ్చిన అలుసు వల్లే వచ్చింది. అధికార పార్టీలు రాజకీయాన్ని పార్టీతో చేసుకోవాలి కానీ ప్రజలతో చేయాలనుకున్నప్పుడే సమస్య వస్తుంది. ఆ సమస్య ప్రజల్ని కష్టాల్లోకి నెడుతుంది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కనిపిస్తోంది. ప్రజలు ఎప్పుడు చైతన్యవంతులవుతారో.. అప్పుడే ఈ పరిస్థితి నుంచి విముక్తి లభిస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close