మనకూ బుల్లెట్ రైలు…దేనికి?

ఈనాడు పేపరులో ‘మనకూ బుల్లెట్ రైలు’ అనే శీర్షికన ఈ రోజు (బుధవారం) ఒక వార్త ప్రచురించింది. ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం టియాంజిన్ నుంచి బీజింగ్ వరకు బుల్లెట్ రైలులో ప్రయాణించిన విషయం దానిలో తెలియజేసి ఆయన బృందం బుల్లెట్ రైలు పక్కన నిలబడి తీసుకొన్న ఫోటోని ప్రచురించింది. అది అంతవరకే పరిమితం అయితే ఎవరూ ఆక్షేపించే అవకాశమే ఉండేది కాదు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి విశాఖకి, అలాగే అమరావతి నుంచి హైదరాబాద్ కి బుల్లెట్ లేదా హైస్పీడ్ ట్రైన్స్ ప్రవేశపెట్టేందుకు అద్యయనం చేసేందుకే బుల్లెట్ రైలులో ప్రయాణించారని మరో ముక్క అదనంగా జోడించింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదట విజయవాడతో బాటు విశాఖ, తిరుపతిలో కూడా మెట్రో రైల్ నిర్మాణం చేయాలనుకొన్నారు. కానీ ఆ మూడు చోట్లా కూడా 20 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న కారణంగా అక్కడ మెట్రో లాభదాయకంకాదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పడమే కాకుండా వాటికి నిధులు ఇవ్వడానికి కూడా నిరాకరించింది. ఆ కారణంగానే విశాఖ, తిరుపతి మెట్రో ప్రాజెక్టులు అటకెక్కిపోయాయి. మెట్రో నిపుణుడు శ్రీధరన్ కూడా విజయవాడలో మెట్రో లాభదాయకం కాదనే చెపుతున్నారు. కానీ అమరావతి వస్తే జనాభా పెరుగుతుంది కనుక విజయవాడలో మెట్రో లాభాదాయకంగానే ఉంటుందనే ఉద్దేశ్యంతోనే చంద్రబాబు దానికి పూనుకొంటున్నారు. కేంద్రం దానికి నిధులు ఇవ్వకపోవడంతో జైకా అనే జపాన్ సంస్థ దానికి పెట్టుబడిపెడుతోంది.

మెట్రో రైలే లాభదాయకం కానప్పుడు, దానినే నిర్మించుకోవడానికి చేతిలో డబ్బు లేక నానా అవస్థలు పడుతున్నప్పుడు, బుల్లెట్ రైలు వేయడానికి అధ్యయనం చేయడం అంటే ఉట్టికి ఎగురలేనమ్మ స్వర్గానికి ఎగరాలని ప్రయత్నించినట్లే చెప్పవచ్చు. దేశంలో అత్యంత రద్దీ గల అహ్మదాబాద్-ముంబై మార్గంలో వేయబోయే బుల్లెట్ రైలు కూడా లాభదాయకం కాదని నిపుణులు చెపుతున్నారు. దానికి కేంద్రం కూడా పెట్టుబడి పెట్టలేని పరిస్థితిలో ఉనందున దానికీ జపాన్ సంస్థే పెట్టుబడి పెట్టవలసి వస్తోంది. ఈ నేపద్యంలో చూస్తే అమరావతి నుంచి బుల్లెట్ రైళ్ళు నడపాలనే ఆలోచనే ఎంత అసంబద్ధంగా ఉందో అర్ధమవుతుంది.

సాధ్యాసాధ్యాలు గమనించకుండానే లేదా తెలిసినా తెలియనట్లుగా ‘మనకూ బుల్లెట్ రైలు’ అని వ్రాయడం దేనికంటే బహుశః చంద్రబాబు నాయుడుని ప్రసన్నం చేసుకోవడానికేనని చెప్పక తప్పదు. ఆంధ్రాలో చంద్రబాబు నాయుడుని, తెలంగాణా కెసిఆర్ ని ప్రసన్నం చేసుకొని వ్యాపారాలు చేసుకోవాలనుకోవడం మంచిదే. కానీ దానికోసం ఈనాడు మీడియా ప్రజలని ఈవిధంగా తప్పు దారి పట్టించనవసరం లేదు. మీడియాకి ధైర్యం ఉంటే బుల్లెట్ రైలు విషయంలో ఈవిధంగా సాధ్యాసాధ్యాల గురించి చర్చిస్తే బాగుండేది. లేదా ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తే బాగుండేది. కానీ ముఖ్యమంత్రి బృందం బుల్లెట్ రైలులో ప్రయాణించి, దాని పక్కన నిలబడి ఫోటో దిగితే అది పట్టుకొని రాష్ట్రానికి బుల్లెట్ రైళ్ళు వేసేయబోతున్నట్లు కధనాలు వ్రాయడం సరికాదు. మెట్రో రైల్ నిర్మాణ పనులు మొదలుపెట్టడానికే రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆపసోపాలు పడుతున్నప్పుడు ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఆయన బుల్లెట్ రైలు గురించి ఆలోచిస్తున్నట్లు వ్రాయడం అంటే ఎగతాళి చేయడంగానే భావించాల్సి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com