భాజ‌పాతో వైకాపా, ప‌వ‌న్‌.. ఇదేనా ఆ మీడియా అజెండా..!

భాజ‌పా, వైకాపా, జ‌న‌సేన‌… ఈ మూడు పార్టీల‌నీ వ‌రుస‌గా ఒకే చోట చేర్చి, ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నాయని ప్రొజెక్ట్ చేయడం స‌రైందా..? ఈ మూడు పార్టీల అజెండాలు ఒకేలా క‌నిపిస్తున్నాయా..? ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై విమ‌ర్శ‌లు చేయ‌డం అనే ఒక్క పాయింట్ త‌ప్ప‌, ఈ మూడు ఒక‌టే అనే చెప్ప‌గ‌ల‌మా..? సాధ్యం కాదు క‌దా! కానీ, ఏపీలో ప్ర‌స్తుతం నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో మోడీకి మ‌ద్ద‌తుగా ప‌వ‌న్‌, జ‌గ‌న్ ఉన్నారు అనే అర్థం అంత‌ర్లీనంగా స్ఫురించేలా ఉంది నేటి ‘ఈనాడు’ ప్రెజెంటేషన్..!

శాస‌న మండ‌లిలో ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు మ‌రోసారి కేంద్రంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ప్ర‌తిప‌క్ష వైకాపా అనుస‌రిస్తున్న తీరుపై మండిప‌డ్డారు. టీడీపీపై అవినీతి ఆరోప‌ణ‌లు చేసిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మీద కూడా స్పందించారు. ఆంధ్ర‌ప్రదేశ్ అంటే మీకు లెక్క లేదా, విభ‌జ‌న హామీలు ఎందుకు నేర్చ‌వేర్చరు, ప్ర‌త్యేక హోదా ఎందుకు ఇవ్వ‌రంటూ భాజ‌పాని నిల‌దీశారు. అవిశ్వాసం అంటూ వైకాపా కూడా నాట‌కాలు ఆడుతోంద‌ని జ‌గ‌న్ మీద విమ‌ర్శించారు. ప‌వ‌న్ ఉన్న‌ట్టుండి యూ ట‌ర్న్ తీసుకున్నార‌నీ, నాలుగేళ్ల‌పాటు మంచివాడిగా క‌నిపించిన తాను, హ‌టాత్తుగా చెడ్డ‌వాడిని ఎలా అయ్యానంటూ ప‌వ‌న్ ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

వీట‌న్నింటినీ ఒకే గాట‌న క‌ట్టేసిట్టుగా ఈనాడు క‌థ‌నం క‌నిపిస్తోంది. ‘హెచ్చ‌రిస్తూ విప‌క్షాల తీరును సీఎం ఎండ‌గ‌ట్టార‌నీ, త‌న స‌హ‌జ స్వ‌భావానికి భిన్నంగా భాజ‌పా, వైకాపా, జ‌న‌సేన‌ల‌పై మండ‌లి వేదిక‌గా నిప్పులు చెరిగిన‌ట్టు పేర్కొన్నారు. మండ‌లి వేదికగా చంద్రబాబు ఈ ముగ్గురిపైనా మాట్లాడిన మాట నిజ‌మే. కానీ, ముగ్గుర్నీ ఒకటిగా చేసి మాట్లాడలేదు కదా. ఆ మీడియా క‌థ‌నం ప్రెజెంటేష‌న్ లో ప‌వ‌న్, జ‌గ‌న్ లు భాజ‌పాతో ఉన్న‌ట్టుగా అంత‌ర్లీనంగా చెప్పిన‌ట్టు ఉంది. ఈ అజెండాను ఈనాడు సెట్ చేస్తోందా అన్న‌ట్టుగా ఉంది. నిజానికి, ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఎవ‌రి వెన‌క ఎవ‌రున్నారో అనేది అర్థం కాని ప‌రిస్థితి. ఎలాగూ ఎన్డీయే నుంచి టీడీపీ బ‌య‌ట‌కి వ‌చ్చేసింది కాబ‌ట్టి… ఈ సంద‌ర్భంగా భాజ‌పాకి మ‌రింత ద‌గ్గ‌ర‌య్యే ప్ర‌య‌త్నాల్లో వైకాపా ఉన్న‌ట్టుగా ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి తీరు చూస్తే అర్థ‌మౌతుంది. ఆంధ్రాలో ఉనికి కోసం భాజ‌పా ప్ర‌య‌త్నిస్తోంది కాబ‌ట్టి, చంద్ర‌బాబుపైకి ప‌వ‌న్ ను ఎగ‌దోస్తూ రాష్ట్రంలో ప్ర‌వేశించాల‌నే ఉద్దేశం భాజ‌పాకి ఉన్న‌ట్టుగా క‌నిపిస్తోంది. ఈ ప‌రిస్థితుల మ‌ధ్య జ‌న‌సేన‌కు ప్ర‌స్తుతానికి త‌మ‌దంటూ ఒక సొంత అజెండా ఏదీ లేద‌న్న‌ట్టుగానే ఉంది. వైకాపా, భాజ‌పా, జ‌న‌సేన‌లు ఎవ‌రికివారు చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అంత‌మాత్రాన ఈ ముగ్గురూ క‌లిసి టీడీపీపై దాడి చేస్తున్నార‌ని చెప్ప‌లేం కదా. ఎవ‌రికివారు విడివిడిగా సొంతంగా వ్య‌వ‌హ‌రిస్తూ… త‌మ ప్ర‌యోజ‌నాల‌కు అనువైన వ్యూహాల‌తో ఉన్నారు. కానీ, ఈనాడు ప్రెజెంటేష‌న్ మాత్రం… భాజ‌పాతో ప‌వ‌న్‌, జ‌గ‌న్ ఉన్నార‌నట్టుగా క‌నిపిస్తోంది..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.