ఎన్నిక‌ల సంఘం… త‌న ప‌ని తాను చేసుకుని పోతోంది!

ఆ నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల‌తోనే తెలంగాణ ఎన్నిక‌లు ఉంటాయా..? తెలంగాణ విష‌యంలో ఎన్నిక‌ల సంఘం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో..? ముహూర్తాలు చూసుకుని ఎన్నిక‌లు నిర్వ‌హించ‌మంటే ఎలా అంటూ ఉన్నతాధికారుల చేసిన కామెంట్లు..? ఇవ‌న్నీ చూసుకుంటే… తెలంగాణలో అసెంబ్లీ ఎన్నిక‌ల విష‌య‌మై ఎన్నిక‌ల సంఘం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందా అనే ఒక‌ ర‌క‌మైన సందిగ్ద‌త క‌నిపించింది. కానీ, ఎన్నిక‌ల సంఘం మాత్రం తెలంగాణ విష‌యంలో త‌మ ప‌ని తాము చేసుకుని పోతోంది! ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి సోమ‌వారం ఢిల్లీకి వెళ్తున్నారు. ఇప్ప‌టికే ఓట‌రు జాబితా విష‌యంలో స‌వ‌ర‌ణ‌లు చేసిన అధికారులు, ఇత‌ర అంశాల‌పై కూడా ఢిల్లీ స‌మావేశంలో స్ప‌ష్ట‌త‌కు వస్తార‌ని తెలుస్తోంది. ఎన్నిక‌ల‌కు ఏర్పాట్లు చేసుకోవాలంటూ జిల్లా అధికారుల‌కు ఇప్ప‌టికే ఆదేశాలు వెళ్లిపోయాయి.

ఇక‌, మంగ‌ళ‌వారం నాడు ఢిల్లీ నుంచి కేంద్ర ఎన్నిక‌ల సంఘం తర‌ఫున ఒక బృందం రాబోతోంది. ఎన్నిక‌ల‌కు సంబంధించి గుర్తింపు పొందిన రాజ‌కీయ పార్టీల‌తో ముందుగా స‌మావేశం నిర్వ‌హించి, ఆ త‌రువాత అధికారుల‌తో మ‌రోసారి భేటీ అవుతారు. ఆ మ‌ర్నాడు, అంటే బుధ‌వారం నాడు క‌లెక్ట‌ర్లు, డీజీపీ వంటి ఉన్న‌తాధికారుల‌తో స‌మావేశాలుంటాయి. స‌మావేశాలు విషయం ఇలా ఉంటే… సోమవారం నుంచే తెలంగాణ‌కు ఈవీఎమ్ లు, వీవీ ప్యాట్ల స‌ర‌ఫ‌రా కూడా షురూ కానుందని సమచారం. కొమురంభీమ్ జిల్లాకు ముందుగా ఈ ప‌రిక‌రాలు రాబోతున్న‌ట్టు తెలుస్తోంది.

రాబోయే మూడు రోజుల్లో తెలంగాణ‌లో ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డానికి కావాల్సిన ప‌రిస్థితులు, ఉన్న స‌దుపాయాలు, క‌ల్పించాల్సిన సౌక‌ర్యాలు… ఇలాంటి కీల‌క అంశాల‌పై అధికారుల స్థాయిలో స్ప‌ష్ట‌త రానుంది. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు రాష్ట్ర అధికారుల నుంచి వ్య‌క్త‌మౌతున్న సంసిద్ధ‌త‌తోపాటు, కేంద్ర బృందం నుంచి కూడా అదే ర‌క‌మైన స్పంద‌న ఉంటుంద‌నేది తెలుస్తూనే ఉంది. ఓవ‌రాల్ గా చూసుకుంటే… తెలంగాణ‌లో వీలైనంత త్వర‌గా ఎన్నిక‌లు నిర్వ‌హించేద్దామ‌నే నిర్ణ‌యంతో కేంద్ర ఎన్నిక‌ల సంఘం కూడా ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. అందుకే, రాష్ట్రంలో త్వ‌ర‌త్వ‌ర‌గా ప‌నులు మొదలైపోతున్నాయి. రెండ్రోజులు కింద‌ట ఢిల్లీలో ఈసీ పెద్ద‌లు మాట‌లు విన్న‌ప్పుడు… ముంద‌స్తు ఎన్నిక‌లు కాస్త ఆల‌స్య‌మౌతాయేమో అనే అభిప్రాయం క‌లిగింది! కానీ, అధికారుల తాజా స్పంద‌న‌, చురుకుద‌నం చూస్తుంటే… కేసీఆర్ ఆశించినదానికంటే ముందుగానే ఎన్నిక‌లు నిర్వ‌హ‌ణ ఉంటుంద‌ని అనిపిస్తోంది. జ‌ర‌గాల్సిందేదో ఎంత త్వ‌ర‌గా జ‌రిగిపోతే అంతే మంచిది!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com