ఏదైనా ఎన్నిక లేదంటే.. ఏదైనా అంశంపై ప్రజానాడి తెలుసుకోవాలంటే రాజకీయ నేతలు ఈ మధ్య కాలంలో సర్వేలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అదే సమయంలో ఏదైనా ఎన్నికలు ఉంటే.. ఇక ఈ సర్వేయర్ల ను ఆపడం ఎవరి తరం కాదు. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడ్ని సంప్రదించడం.. సర్వేలను అమ్ముకోవడం కామన్ అయిపోతోంది. ఈ సర్వేయర్లకు నిజంగా సర్వే ఎలా చేయాలో కూడా తెలియదు. కేవలం మీడియాలో వచ్చే వార్తలు, సోషల్ మీడియాలో వచ్చే వార్తలు చూసి రిపోర్టులు తయారు చేస్తూంటారు. ఒకరిద్దరు గ్రాఫిక్ ఆర్టిస్టుల్ని పెట్టుకుని అందంగా ప్రజెంట్ చేస్తూంటారు. అంతకు మించి ఆ సర్వేల్లో నిజం ఉండదు.
అమ్మకానికి ఫేక్ సర్వేలు
నిత్యం ప్రజల్లో ఉండే రాజకీయ నేతలు ప్రజానాడిని సులువుగా పట్టుకోగలరు. కానీ వారిపై వారికి నమ్మకం ఉండదు. దాన్నే ఈ ఫ్రాడ్ సర్వేయర్లు ఆసరా చేసుకుంటున్నారు. రాజకీయ నేతలు తమకు ఉన్న పవర్ తో దందాలు చేసి డబ్బులు సంపాదించుకోవడంలో మాస్టర్లు కానీ.. సర్వేయర్లు వారిని కూడా దోపిడీ చేయగలరు. కాస్త విశ్వసనీయత ఉన్న వాళ్లు కోట్లలోనే వసూలు చేస్తారు. వారు నిజంగా సర్వే చేస్తారా అంటే.. అలాంటి నెట్ వర్క్ వారికి ఉండదు. కనీసం ఓ పది మంది ఓటర్లతో అయినా మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు.
సోషల్ మీడియా హైప్ కోసం పార్టీల కక్కుర్తి
ప్రస్తుతం జూబ్లిహిల్స్ ఉపఎన్నికలనే తీసుకుంటే రోజుకో సర్వే తెరపైకి వస్తోంది. ఒకడు చాణక్య అంటాడు.. మరొకడు టుడేస్ చాణక్య అంటాడు. మరొకడు లోక్ పాల్ అంటాడు.. మరొకరు నాగన్న సర్వే అంటారు. ఇలా రోజుకో సర్వే గ్రాఫిక్ ఫలితాన్ని ప్రకటిస్తోంది. ఇవన్నీ ఊరికనే రావు. ప్రతి దానికి విలువ ఉంటుంది. ఆ సర్వే ఎవరికి అనుకూలంగా వచ్చిందో ఆయా పార్టీల వారు ఖచ్చితంగా డబ్బులు చెల్లించి ఉంటారు. లేకపోతే వీరు తమ సర్వేలను ప్రకటించరు. ఎందుకంటే వారు ఎలాంటి సర్వేలు చేయరు కూడా. ఆత్మసాక్షి, ఆరా మస్తాన్, లాంటి సంస్థలకూ .. ఒకరిద్దరు ఎక్సెల్ షీట్లు పెట్టేవారు.. గ్రాఫిక్స్ తయారు చేసేవారు ఉంటారు కానీ ఫీల్డ్ లోకి వెళ్లి అభిప్రాయాలు సేకరించే వ్యవస్థే ఉండదు. కానీ వీరు మాత్రం.. ఏ పార్టీకి అయినా సంతృప్తికరమైన ఫలితాలతో సర్వే ప్రకటించాలంటే… ఖచ్చితంగా విలువ కడతారు.
అన్నీ తెలిసి మోసపోతున్న పార్టీలు, నేతలు
అసలు వీరికి ఏమీ తెలియదని తెలిసి కూడా.. రాజకీయ నేతలు ఎందుకు వీరిని నమ్మి కోట్లు ఇస్తారో చాలా మందికి అర్థం కాదు. గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వెబ్ సైట్లలో సర్వేలు అనుకూలంగా వేస్తే.. ఓ మాదిరి సైట్ కు పాతిక లక్షలు ఇచ్చారు. కానీ వారికి మిగిలిందేమిటి? . ఆ సర్వేల పేరుతో కొంత మంది ధనవంతులైపోయారు. రాజకీయ నేతలు నష్టపోయారు.అయితే వారు దోచుకున్నది ప్రజాధనమే కాబట్టి వారికి రిగ్రెట్ ఉండదు. ఇదేదో గిట్టుబాటు బాగుంటుందని.. ఎక్కువ మంది యూట్యూబర్లు, సోకాల్డ్ జర్నలిస్టులు ఈ సర్వేల బిజినెస్ లోకి దిగి నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నారు.


