బాబు చేతిలో ఓడడానికి ఎన్టీఆర్ బాలయ్య, హరికృష్ణల్లా కాదుగా

Chandrababu Balayya NTR Harikrishna
Chandrababu Balayya NTR Harikrishna

ఎన్టీఆర్ నుంచి ముఖ్యమంత్రి కుర్చీ లాక్కున్న సందర్భంలో దాదాపు నందమూరి వారసులందరినీ చేరదీశాడు చంద్రబాబు. ఇప్పుడు చంద్రబాబును విమర్శిస్తున్న పురంధేశ్శరితో సహా బాలయ్య, హరికృష్ణ…ఇలా అందరూ చంద్రబాబుకే సపోర్ట్ చేశారు. లక్ష్మీ పార్వతిని బూచీగా చూపించి చంద్రబాబు ఆడిన గేంలో పావులయ్యారు. సినిమాలలోనూ, రాజకీయాల్లోనూ దేశవ్యాప్తంగా తెలుగు జాతికి పేరు తెచ్చిపెట్టిన ఎన్టీఆర్‌కి ద్రోహం చేశారు. తెలుగువారికి గుర్తింపు తీసుకురావడంలో ఎన్టీఆర్ పాత్ర ఎనలేనిది అని చెప్పి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నాయకులందరూ ఒప్పుకుంటారు. అలాంటి ఎన్టీఆర్ శకం అతి త్వరగా ముగిసిపోవడానికి ప్రధాన కారణం నందమూరి వారసులు నారా చంద్రబాబుతో చేయి కలపడమే. ఒకసారి పార్టీ పగ్గాలు, ముఖ్యమంత్రి కుర్చీ తన చేతికి వచ్చిన వెంటనే సాయం చేసిన నందమూరి వారందరినీ సహాయ పాత్రల కింద మార్చేశాడు చంద్రబాబు. ఇప్పుడు బాలయ్య పాత్ర కూడా అంతవరకే పరిమితం అనడంలో సందేహం లేదు. పైగా అసమర్థులు అన్న ప్రచారాన్ని కూడా బలంగా చేయించాడు. అఫ్కోర్స్ పురంధేశ్వరిని పక్కన పెడితే మిగతా నందమూరి వారసుల వ్యవహారం కూడా అలానే ఉండేదనుకోండి. కాకపోతే ఇప్పుడు లోకేష్ విషయంలో కూడా అసమర్థుడు, నాయకత్వ లక్షణాలు లేనివాడు అని చెప్పి ఎన్నో విమర్శలు వస్తున్నాయి. లోకేష్ వ్యవహార శైలి కూడా అందుకు తగ్గట్టుగానే ఉంది. కానీ లోకేష్‌ని మాత్రం సమర్థుడిగా జనాల ముందు నిలబెట్టడానికి తన ప్రచార అనుభవం మొత్తం ఉపయోగిస్తున్నాడు చంద్రబాబు.

ఇక నందమూరి వంశంలో సినిమాల విషయంలోనూ, రాజకీయాల విషయంలోనూ అత్యంత సమర్థుడిగా పేరు తెచ్చుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. తాత నందమూరి తారక రామారావులాగే అద్భుతమైన నైపుణ్యం ఉన్న ప్రసంగ శైలి ఎన్టీఆర్ సొంతం. అందుకే 2009 ఎన్నికల్లో ప్రచారం చేసిన అందరు నాయకులు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ కంటే కూడా ఎన్టీఆరే మెరుగ్గా కనిపించాడు. అలాగే తనను తాను అప్డేట్ చేసుకునే విషయంలో, కష్టపడే విషయంలో కూడా ఆ ఎన్టీఆర్ లక్షణాలను పుణికిపుచ్చుకున్నాడు ఎన్టీఆర్. మూడు, నాలుగేళ్ళ క్రితం నుంచీ ఓవర్సీస్ ప్రేక్షకులు, క్లాస్ ప్రేక్షకుల సంఖ్య పెరగడం, మాస్ ప్రేక్షకులు కూడా రొటీన్ హీరోయిజం కాకుండా కొత్తగా కావాలని డిమాండ్ చేసే పరిస్థితులు వచ్చిన నేపథ్యంలో…ఊరమాస్ హీరో అయిన ఎన్టీఆర్…వంద కేజీల పైగా బరువున్న ఎన్టీఆర్…మిగతా హీరోలతో పోల్చుకుంటే కమర్షియల్‌గా వెనుకబడిపోయాడు. కానీ పట్టుదలగా శ్రమించి టెంపర్, నాన్నకు ప్రేమతో లాంటి సినిమాలతో బౌన్స్ బ్యాక్ అవడంతో పాటు…పూర్తిగా ఇమేజ్‌ని మార్చుకున్న విధానం అయితే కచ్చితంగా ఓ గొప్ప సక్సెస్ స్టోరీనే. ఈ లక్షణాలే చంద్రబాబును భయపెడుతూ ఉంటాయి. ఇలాంటి ఏ ఒక్క విషయంలో కూడా ఎన్టీఆర్‌కి లోకేష్‌కి పోలికే లేదు. ఇక పరిపాలన సంబంధమైన విషయాలు కూడా ఏమీ తెలియవని చెప్పి లోకేషే ప్రూవ్ చేసుకున్నాడు. మంత్రిగా పదవి చేపట్టిన వెంటనే వీసాల సమస్య గురించి ట్రంప్‌తో మాట్లాడతానని చెప్పి కామెడీ చేసి పడేశాడు లోకేష్.

2009లో చిరంజీవి స్టార్ ఢం, వైఎస్సార్ హవాల ముందు తట్టుకోవడం అసాధ్యం అని తెలుసుకున్న చంద్రబాబు ఎన్టీఆర్‌ని వాడుకున్నాడు. ఆ తర్వాత లోకేష్‌కి పోటీ అవుతాడన్న ఉద్ధేశ్యంతో ఎన్నో అపనిందలు వేసి ఒక వర్గానికి, టిడిపి కార్యకర్తలకు ఎన్టీఆర్‌ని పూర్తిగా దూరం చేయాలని కంకణం కట్టుకున్నాడు. తాత స్థాపించిన టిడిపిని ఎన్టీఆర్ ఎప్పటికీ వదిలే అవకాశమే లేదు. వివాదాలు వచ్చిన సందర్భంలో ఎన్టీఆర్ అదే విషయాన్ని మీడియాతోనూ, వ్యక్తిగతంగానూ జర్నలిస్టులకు, నాయకులకు చాలా స్పష్టంగా చెప్పాడు. కానీ చంద్రబాబు…ఆయన భజన మీడియా మాత్రం ఎన్టీఆర్‌ ఇమేజ్‌ని డ్యామేజ్ చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేసింది. ఆ నేపథ్యంలో ఇప్పుడు లోకేష్ ప్రమాణ స్వీకారం సందర్భంలో ఎన్టీఆర్ ఎందుకు హాజరుకాలేదు అన్న ప్రశ్నే వృథా. ఎన్టీఆర్ ఏదో తప్పు చేశాడు అనేలాగా వార్తలు రావడం మరీ అన్యాయంగా ఉంది. ఎన్టీఆర్ విషయంలో ఏం తప్పులు చేసినా చంద్రబాబే చేశాడు. ఇప్పుడు కూడా రాజకీయాలకు సంబంధించినంత వరకూ ఎన్టీఆర్‌తో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడు చంద్రబాబు. ఎన్టీఆర్ మాత్రం టైం వచ్చినప్పుడు చూసుకుందాం అనే తీరులోనే ఉన్నాడు. ఎందుకంటే ఇంకో పదేళ్ళ వరకూ ఎన్టీఆర్ ప్రాధాన్యం సినిమాలకే కాబట్టి. అంత వరకూ టిడిపికి ఎప్పుడు అవసరమైనా ఎన్టీఆర్ అందుబాటులో ఉంటాడనడంలో సందేహం లేదు. లోకేష్ పూర్తి స్థాయిలో నాయకుడిగా ఎదిగేవరకూ…ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే ముఖ్యమంత్రి అయ్యే వరకూ టిడిపిలో యాక్టివ్ రోల్ పోషించే అవకాశాన్ని మాత్రం చంద్రబాబు ఇవ్వడు. పార్టీ అధ్వాన్న పరిస్తితుల్లో ఉంటే తప్ప. ఇక ఇందులో ఎన్టీఆర్ వైపు నుంచి తప్పు పట్టడానికి ఏముంది?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com