టీఆర్ఎస్‌పై బీజేపీ నీడ పోతేనే “ఫెడరల్ ఫ్రంట్” సాధ్యం..!

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ కాంగ్రెస్సేతర, బీజేపీయేతర కూటమికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ఆలోచనలు దేశం ప్రకారం చూస్తే ఉన్నతంగా ఉన్నాయి. అందరూ అభినందిస్తున్నారు కూడా. ఇంత కాలం పరిపాలించిన కాంగ్రెస్, బీజేపీ ఏమీ చేయలేదా అన్న విషయాన్ని పక్కన పెడితే… 70 ఏళ్ల కాలంలో.. మౌలిక సదుపాయాలను.. ఇతర దేశాలతో పోలిస్తే… ఉన్నతంగా అభివృద్ధి చేయలేదన్నది మాత్రం నిజం. రైతుల బతుకుల్ని మార్చలేకపోయారన్నది మరింత పచ్చి నిజ.ం మరి కేసీఆర్ వీటితోనే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయగలరా..?

బీజేపీకి దగ్గర అనే ముద్ర చెరిపేసుకోలేరా..?

ఫెడరల్ ఫ్రంట్ అనేది రాజకీయం. అది దేశ సమస్యల ప్రాతిపదికగా ఏర్పాటు చేసే ప్రయత్నం చేసినా.. రాజకీయంగా అందరూ కలిసి రావాలి. అందరికీ.. దేశం పట్ల నిబద్ధత ఉంటుంది. అంత మాత్రాన.. రాజకీయ ప్రయోజనాలు.. రాజకీయాలు చూసుకోకుండా.. కేసీఆర్‌తో చేతులు కలపడానికి వచ్చేయరు కదా..?. అందుకే.. ముందుగా కేసీఆర్ ఈ విషయంలో మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంది. అదే .. ఫెడరల్ ఫ్రంట్ బీజేపీ కోసమే అన్న ముద్ర పోయేలా చూసుకోవడం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి కావడమో.. మరో కారణమో కానీ.. కేసీఆర్ బీజేపీకి ఒకింత సన్నిహితంగా వ్యవహరిస్తున్నారన్న ముద్ర పడిపోయింది. వచ్చే ఎన్నికల తర్వతా ఆయన బీజేపీకి మద్దతిచ్చేందుకు ఒప్పందం కుదిరిపోయిందన్న నమ్మకం ప్రజల్లో బలపడింది. దేశంలోని ఇతర రాజకీయ పార్టీల్లోనూ అదే ఉంది. ముందుగా కేసీఆర్ దీన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇతర పార్టీల నేతల్లో .. రెండు పార్టీలకు.. ఎట్టి పరిస్థితుల్లోనూ దూరంగా ఉంటామని.. నమ్మకం కలిగించగలగాలి.

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పడితే చరిత్ర సృష్టిస్తుందా..?

కేసీఆర్ ఇలాంటి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయగలిగితే.. కచ్చితంగా.. ఆ ఫ్రంట్ దేశ రాజకీయాల్ని శాసిస్తుంది. ఎందుకంటే..బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. కాంగ్రెస్‌ నాయకత్వానికి సిద్ధంగా లేని.. మమతా బెనర్జీ, మాయావతి, అఖిలేష్ యాదవ్, నవీన్ పట్నాయక్ లాంటి వారు బలమైన ప్రాంతీయ పార్టీలు. ఎలా చూసినా.. వీరందరికీ.. వంద లోక్ సభ సీట్లకుపైగానే వస్తాయి. కేసీఆర్‌కు మరో పదిహేను లోక్ సభ సీట్లు వస్తాయి. అంటే.. 125 సీట్లు వరకూ ఈ పార్టీలకు ఉంటాయి. అప్పుడు ఈ ఫెడరల్ ఫ్రంట్ కు జాతీయ పార్టీలు మద్దతివ్వడమో… లేదా.. ఈ ఫెడరల్ ఫ్రంట్ మద్దతిచ్చే పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేయడమో జరుగుతుంది.

అందరికీ బీజేపీకి శత్రువు..! మరి కేసీఆర్‌కు..?

ఆయితే.. కేసీఆర్ మినహా… మమతా బెనర్జీ, మాయావతి, అఖిలేష్ యాదవ్, నవీన్ పట్నాయక్ అందరూ.. కాంగ్రెస్ కంటే.. బీజేపీనే ఎక్కువ ప్రమాదకారిగా చూడటంతోనే అసలు సమస్య వస్తోంది. కానీ కేసీఆర్ మాత్రం కాంగ్రెస్‌నే ప్రధాన శత్రువుగా పరిగణిస్తున్నారు. అందుకే ఆయా పార్టీల నేతలు.. కేసీఆర్ పై నమ్మకం పెట్టుకోలేకపోతున్నారు. పైగా మమతా బెనర్జీ, మాయావతి, ములాయం సింగ్ లాంటి వాళ్లకు ప్రధాని పదవిపై ఆశలు ఉన్నాయి. ఇవన్నీ కేసీఆర్ కు ప్రతిబంధకాలు. ముందుగా తనపై బీజేపీ ముద్ర చెరిపేసుకుంటనే ఫెడరల్ ఫ్రంట్ అడుగు ముందుకు పడుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.