గంటా వెర్సెస్ అయ్యన్న.. వివాదాలకు స‌మ‌య‌మా ఇది..?

ఏపీ మంత్రులు గంటా శ్రీ‌నివాస‌రావు, చింత‌కాయల అయ‌న్న పాత్రుడు మ‌ధ్య విభేదాలు మ‌రోసారి తెర‌మీదికి వ‌చ్చాయి. విశాఖ జిల్లా ప‌శుగ‌ణాభివృద్ధి సంఘానికి చెందిన పాల‌క వ‌ర్గం ఎన్నిక‌లు మ‌రోసారి ఇద్ద‌రి మ‌ధ్య విభేదాలు బ‌య‌ట‌ప‌డేలా చేశాయి. పాత పాల‌క వ‌ర్గం ప‌ద‌వీ కాలం ఇటీవ‌లే పూర్త‌యింది. అయితే, గ‌డ‌చిన ప‌దేళ్లుగా కొన‌సాగుతూ ఉన్న పాత పాల‌క వ‌ర్గాన్నే మళ్లీ కొన‌సాగించాలంటూ మంత్రి అయ్య‌న్న పాత్రుడు గ‌త నెల 19న క‌లెక్ట‌ర్ కి లేఖ రాశారు. ఈ విష‌యం ప‌శుసంవ‌ర్థ‌క శాఖ వారికి తెలియ‌లేదు. దాంతో వారు ఎన్నిక‌లు నిర్వ‌హించాలంటూ 21న క‌లెక్ట‌ర్ కు లేఖ పంపారు. దీంతో ఎలా స్పందించాలో క‌లెక్ట‌ర్ కు అర్థ‌మైన‌ట్టు లేదు! మౌనంగా ఉండిపోయారు. ఇదిలా ఉంటే.. ప‌శు సంవ‌ర్థ‌క శాఖ ఎగ్జిక్యుటివ్ చొరవ తీసుకుని.. గ‌త నెల 27న 16 మంది క‌మిటీ స‌భ్యుల‌తో క‌మిటీ నియమించారు. దీన్లో గంటా వ‌ర్గీయుల‌కు కొంత ప్రాధాన్య‌త ల‌భించింది.

ఈ విష‌యం తెలియ‌గానే మంత్రి అయ్య‌న్న ఆగ్రహించారు. ఈ క‌మిటీలో మార్పులు చేయ‌క‌పోతే మంత్రి ప‌ద‌వి వ‌దిలేస్తా అంటూ జిల్లా ఇన్ ఛార్ మంత్రి చిన‌రాజ‌ప్ప ద‌గ్గ‌ర‌కి ఈ పంచాయితీ పెట్టారు. పంతం ప‌ట్టిన‌ట్టుగానే క‌మిటీ ర‌ద్దు చేయాల్సి వ‌చ్చి, చివ‌రికి క‌లెక్ట‌ర్ వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సి వ‌చ్చింది. నిజానికి, ఈ ఇద్ద‌రి మ‌ధ్యా విభేదాలు ఇవాళ్లేం కొత్త కాదు. గ‌త ఏడాది విశాఖ భూకుంభ‌కోణానికి సంబంధించిన ఆరోప‌ణ‌లు వెల్లువెత్తిన‌ప్పుడు కూడా మంత్రులిద్ద‌రూ ఇలానే పంతానికి పోయారు. భూ కుంభ‌కోణ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో గంటాపై అయ్య‌న్న విమ‌ర్శ‌లు చేయ‌డం, దానిపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేస్తే, గంటాకు సంబంధించిన వివ‌రాల‌ను సిట్ కు అయ్య‌న్న పాత్రుడు అందించార‌నే క‌థ‌నాలూ వ‌చ్చాయి. చివ‌రికి, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ద‌గ్గ‌ర‌కి ఈ పంచాయితీ చేరింది. ఆ త‌రువాత‌, ఇద్ద‌రూ మాట మార్చేసి… భూదందాపై స‌మ‌గ్ర ద‌ర్యాప్తు జ‌ర‌గాల‌న్న‌దే ఇద్ద‌రి అభిమ‌త‌మ‌నీ, వ్య‌క్తిగ‌తంగా త‌మ మ‌ధ్య ఎలాంటి విభేదాలు లేవంటూ మీడియా ముందు చెప్పారు.

నిజానికి, 2014 నుంచే ఈ ఇద్ద‌రి మ‌ధ్యా విశాఖ జిల్లాలో ఆధిప‌త్య పోరు మొద‌లైంది. అది ఇప్ప‌ట్లో చ‌ల్లారేది కాదని అర్థ‌మౌతోంది. కానీ, ప్ర‌స్తుతం రాష్ట్రం ఉన్న ప‌రిస్థితుల్లో ఇలాంటి వివాదాల‌కు మంత్రులే ప్రాధాన్య‌త ఇస్తుంటే విమ‌ర్శ‌లు త‌ప్ప‌వు. ఓప‌క్క కేంద్ర వెర్సెస్ రాష్ట్రం పోరాటం సాగుతోంది. రాష్ట్ర ప్రయోజ‌నాల సాధ‌న కోసం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఢిల్లీ వెళ్లారు. ఇలాంటి సంద‌ర్భంలో చిన్న‌చిన్న కమిటీల నియామ‌కాల పేరుతో మంత్రులే ఇలా రోడ్లెక్కడం స‌రైన ప‌ద్ధతి కాదు. రాష్ట్రం క్లిష్ట‌ ప‌రిస్థితుల్లో ఉన్న‌ప్పుడు కూడా వీరి ప్రాధాన్య‌తాంశాలు ఇవేనా అనిపిస్తోంది..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.