ఏపీ రాజధాని అమరావతి ప్రాంత మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అయిన కొమ్మినేని శ్రీనివాసరావుకు మంగళగిరి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు 14రోజులపాటు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం ఉత్తర్వుల అనంతరం కొమ్మినేని శ్రీనివాసరావును గుంటూరు జిల్లా జైలుకు పోలీసులు తరలించారు.
అమరావతి ప్రాంత మహిళలను వేశ్యలుగా చిత్రీకరించిన కృష్ణంరాజు వ్యాఖ్యలను ఖండించకుండా, వాటిని ప్రోత్సహించేలా వ్యవహరించారని కొమ్మినేనిపై ఏపీ వ్యాప్తంగా మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ , ఐటీ చట్టం కింద నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కొమ్మినేని శ్రీనివాస రావు, కృష్ణంరాజు, సాక్షి యాజమాన్యంపై కేసులు నమోదు అయ్యాయి.
దీంతో జూన్ 9న హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలో తన నివాసంలో ఏపీ పోలీసులు కొమ్మినేనిని అరెస్ట్ చేశారు. మంగళవారం ఉదయం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మంగళగిరి కోర్టులో కొమ్మినేనిని హాజరు పరిచారు. దీంతో కోర్టు ఆయనకు 14రోజుల రిమాండ్ విధించింది.