దేవుడి పాలనలో పత్రికా స్వేచ్ఛ…పాకిస్తాన్ స్థాయికి పడిపోయింది ఎందుకో?

పత్రికా స్వేచ్ఛ అనగానే అదేదో జర్నలిస్టులకు సంబంధించిన వ్యవహారంగా చూడడం పరిపాటి అయింది కానీ నిజానికి ఫ్రీడం ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అన్నది అసలు అర్థం. తమ భావాలను వ్యక్తపరిచే స్వాతంత్ర్యం ప్రజలకు ఏ స్థాయిలో ఉంది అనేది ప్రమాణికం. మునిగిపోబోతున్న వంద కోట్ల పైబడిన భారతీయులను కాపాడడానికి పుట్టుకొచ్చిన కలియుగ దైవం మోడీ పాలనలో పత్రికా స్వేచ్ఛ విషయంలో ఇండియా పరిస్థితి ఏంటి అంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లకు ఏ మాత్రం తీసిపోని స్థానంలో ఉందట. రిపోర్టర్స్ శాన్స్ ఫ్రాంటియర్స్ అనే సంస్థ ఈ విషయాన్ని బయటపెట్టింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్‌లాంటి దేశాలలో ఉన్న ప్రజల గురించి, వ్యవస్థల గురించి భారతీయుల, ప్రపంచ ప్రజల అభిప్రాయాలు ఏంటో ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. కానీ ఇండియా కూడా ఇప్పుడు పత్రికా స్వేఛ్చ విషయంలో ఆయా దేశాల స్థాయికి దిగజారుతోంది.

స్వాతంత్ర్యం వచ్చిన కొత్తల్లో జాతిపిత గాంధీతో సహా నెహ్రూలాంటి వాళ్ళు ఫ్రీడం ఆఫ్ స్పీచ్ గురించి చాలా గొప్పగా చెప్పారు. స్వతహాగా వాళ్ళు కూడా జర్నలిస్టులు కావడం, స్వతంత్ర భావాలు ఉన్నవాళ్ళు కావడంతో ఫ్రీడం ఆఫ్ ఎక్స్‌ప్రెషన్‌కి చాలా ప్రాధాన్యతనిచ్చారు. కానీ ఇందిరాగాంధీ టైం నుంచి మాత్రం పూర్తిగా పరిస్థితులు మారిపోయాయి. ఇక ఇప్పటి పరిస్థితుల గురించి చెప్పుకోవడం కూడా వేస్ట్. మీడియాలో కూడా చాలా మార్పులు వచ్చాయి. అంతా కూడా వ్యాపారం అయిపోయింది. అరుపులు, గోలలు, బ్రేకింగ్ న్యూస్‌ని క్యాష్ చేసుకోవడాలు తప్పితే స్వతంత్ర భావాలు ఉన్నవాళ్ళు, ఎన్ని కష్టాలు ఎదురైనా నిబద్ధతో ఆ భావాలకు కట్టుబడి ఉండేవాళ్ళు ఎంత మంది ఉన్నారు అంటే చెప్పడం కష్టమే. గతంలో ఎన్నడూ లేనట్టుగా ఇప్పుడు మీడియా జనాలకు వ్యాపార సామ్రాజ్యాలే ఉన్నాయి. ముఖ్యమంత్రి స్థాయి పదవుల్లో ఎవరుండాలో కూడా నిర్ణయించే స్థాయిలో ఉన్న మీడియా మొఘల్స్ ఉన్నారు. కానీ ఎక్కువమంది రాజకీయ నాయకులకు అమ్ముడుపోయినవాళ్ళే. ఏదో ఒక పార్టీకి భజన బృందంగా మారిపోయినవాళ్ళే. అందుకే ఫ్రీడం ఆఫ్ స్పీచ్ గురించి, జర్నలిస్టులపై దాడుల గురించి ఆ మీడియా అధినేతలు స్పందించే విధానం కూడా అధికారంలో ఎవరున్నారు అనే విషయంపై ఆధారపడి ఉంటోంది.

ఇక రెండు తెలుగు రాష్ట్రాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇద్దరూ ముఖ్యమంత్రులూ కూడా అధికార పీఠం ఎక్కిన వెంటనే మీడియాను మేనేజ్ చేయడం ఎలా అనే విషయం గురించే ఎక్కువ ఆలోచించారేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఒకాయనేమో భయపెట్టి మరీ దారిలోకి తెచ్చుకున్నాడు. ఇంకొకాయన మాత్రం తన భజన మీడియా తప్ప ఇక వేరే ఏ మీడియా కూడా ప్రజలకు వినిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నాడు.

నాయకులు పొద్దస్తమానం చెప్పుకుంటూ ఉన్నట్టుగా నిజాయితీగా ప్రజల అభివృద్ధి కోసమే పనిచేస్తూ ఉంటే మాత్రం ప్రజా గొంతుక వినిపించకుండా చేయాలన్న ప్రయత్నం అస్సలు చెయ్యరు. అలాగే విమర్శలకు కూడా భయపడరు. మన పాలకులు ఏ కోవకు చెందిన వాళ్ళో ప్రజలే ఆలోచించుకోవాలి. అత్యంత దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఇండియాలో ఫ్రీడం ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ స్థాయి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్‌లతో సమానంగా ఉంది అని అని ఒక అంతర్జాతీయ సంస్థ తేల్చిచెప్పినప్పటికీ మన ప్రధాన మీడియా మాత్రం కనీస మాత్రంగా కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళ భజన బృందంలో వీళ్ళు ప్రధాన సభ్యులు మరి. ఇంకేం మాట్లాడతారు?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com