ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పార్టీని భవిష్యత్తు తరాలకు మరింత దగ్గర చేసే దిశగా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. సహజంగానే జనసేన పార్టీకి యువతలో విపరీతమైన క్రేజ్ , మద్దతు ఉంది. అయితే, ప్రస్తుత డిజిటల్ యుగంలో కేవలం పాత తరం రాజకీయ వ్యూహాలు సరిపోవని గుర్తించిన పవన్.. సరికొత్తగా జెన్-జీ , జెన్-ఆల్ఫా తరాలను టార్గెట్ చేస్తూ ప్రత్యేక కార్యాచరణను ఖరారు చేశారు. ఇందులో భాగంగానే పార్టీలో సరికొత్త ఊపు తెచ్చేందుకు సేవాదళం అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్తున్నారు.
ఈ సరికొత్త తరం 24 గంటలూ సోషల్ మీడియాతోనే ఎక్కువగా కనెక్ట్ అయి ఉంటుంది. వీరికి సాంప్రదాయ రాజకీయ ప్రసంగాలు, సుదీర్ఘమైన ఉపన్యాసాల కంటే క్రిస్పీగా, లాజికల్‌గా ఉండే కంటెంట్ పట్ల ఆసక్తి ఎక్కువ. ఈ విషయాన్ని గమనించిన జనసేన సోర్సెస్ ప్రకారం.. పవన్ కల్యాణ్ సేవాదళం ద్వారా ఈ తరం యువతను కేవలం ఓటర్లుగానే కాకుండా, జనసేన సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యేలా సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ఇన్ఫ్లుయెన్సర్ ఆర్మీని రంగంలోకి దించుతున్నారు. రీల్స్, షార్ట్స్, మీమ్స్ , ఇన్ఫోగ్రాఫిక్స్ ద్వారా పార్టీ భావజాలాన్ని సరికొత్త పంథాలో ఈ తరం బుర్రల్లోకి తీసుకెళ్లడమే దీని ప్రధాన ఉద్దేశం.
కేవలం డిజిటల్ ప్రచారానికే పరిమితం కాకుండా, సేవాదళం విభాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా భాగస్వామ్యం చేయాలని పవన్ భావిస్తున్నారు. విపత్తుల సమయాల్లో సహాయక చర్యలు, స్థానిక సమస్యలపై తక్షణ స్పందన, పర్యావరణ పరిరక్షణ వంటి కార్యక్రమాల ద్వారా ప్రాక్టికల్‌గా ఉండేందుకు ఇష్టపడే జెన్-జీ యువతను ఆకట్టుకోవాలని జనసేన ప్లాన్ చేస్తోంది. సమాజంలో మార్పు కోసం మేం కూడా భాగస్వామ్యమయ్యాం అనే భావనను ఈ యువతలో నింపడం ద్వారా వారిని పార్టీకి శాశ్వత క్యాడర్‌గా మార్చుకోవచ్చనేది పవన్ కల్యాణ్ యోచన.
రాబోయే కాలంలో ఈ రెండు తరాలే రాజకీయాల్లో అత్యంత కీలకమైన పాత్ర పోషించబోతున్నాయి. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన పవన్ కల్యాణ్, మిగతా రాజకీయ పార్టీల కంటే ఒక అడుగు ముందే ఉండి ఈ సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఎన్నికల సమయం లోనే కాకుండా, నిరంతరం యువతతో టచ్‌లో ఉండేలా రూపొందించిన ఈ కార్యాచరణ జనసేన గ్రాఫ్‌ను మరింత పెంచే అవకాశం ఉంది.
