ఈశ్వ‌రి ప్ర‌సంగంలో మార్పు గ‌మ‌నించారా..?

రాజ‌కీయాల్లో మాత్ర‌మే చూడ‌గ‌లిగే విచిత్రం ఇది! నిన్న‌మొన్న‌టి వ‌ర‌కూ ప్ర‌తిప‌క్షంలో ఉంటూ అధికార పార్టీపై విమ‌ర్శ‌లు గుప్పించే నాయ‌కులు… ఒక్క‌సారి కండువా కలర్ మార‌గానే వెంట‌నే మారిపోతారు. వారి బాణీ వాణీ అన్నీ ఒకేసారి మార్పు చెందుతాయి. ప్ర‌తిప‌క్ష వైయస్సార్ సీపీ కి తాజాగా గుడ్ బై చెప్పిన నాయ‌కురాలు పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వ‌రి. గ‌డ‌చిన నాలుగైదు రోజుల్లోనే ప‌రిణామాల‌న్నీ చ‌క‌చ‌కా చోటు చేసుకున్నాయి. ఈశ్వ‌రి పార్టీకి గుడ్ బై చెప్పేసి, టీడీపీలో చేరారు. చేరిన వెంట‌నే య‌థాప్ర‌కారం జ‌గ‌న్ తీరుపైనా, వైకాపాలో త‌న‌కు జ‌రుగుతున్న అన్యాయంపైనా పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేశారు. ఇక‌, అసెంబ్లీలోకి వ‌చ్చిన ఈశ్వ‌రి టీడీపీ నాయ‌కురాలి పాత్ర పోషించారు!

ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి గిరిజ‌న కుటుంబాల‌కు ఎంత‌గానో ఉప‌యోప‌డుతుంద‌నీ, స్థాయికి మించిన స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి ఇది ఎంతో స‌హాయ‌ప‌డుతోంద‌నీ గిడ్డి ఈశ్వరి అసెంబ్లీలో అన్నారు. పాడేరు, అరుకు ప్రాంతాల్లో ఏ చిన్న ఆరోగ్య స‌మ‌స్య‌ వచ్చినా విశాఖకు ప‌రుగులు తీయాల్సి వ‌స్తోంద‌నీ, త‌మ‌కు అందుబాటులో ఉండేట్టుగా ఒక వైద్య‌శాల‌నూ ఒక సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఏర్పాటు చేయాల‌ని సీఎంను కోరారు. బాక్సైట్ త‌వ్వ‌కాల‌కు వ్య‌తిరేకంగా, నాటి జీవోను ర‌ద్దు చేశారనీ, గిరిజనుల మ‌నోభావాల‌ను గుర్తించినందుకు ముఖ్య‌మంత్రికి ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నాను అన్నారు. ఇప్ప‌టికే ర‌హ‌దారులు, ఇత‌ర సౌక‌ర్యాల అభివృద్ధి కోసం చాలా చేస్తున్నార‌నీ, త‌మ గిరిజ‌న ప్రాంతాల్లో మ‌రిన్ని రోడ్ల నిర్మాణాలు చేప‌ట్టాల‌ని కూడా ఆమె కోరారు.

ప‌నిలోనిగా అసెంబ్లీకి విప‌క్షం గైర్హాజ‌రు కావ‌డంపై కూడా ప‌రోక్షంగా గిడ్డి ఈశ్వ‌రి చుర‌క‌లు వేయ‌డం విశేషం! పిల్ల‌ల‌కు రోజూ పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు పాఠ‌శాల‌కు వెళ్ల‌క‌పోతే ఎంత నేర‌మో, ప్ర‌జ‌లు ఎన్నుకున్నాక నాయ‌కులు చ‌ట్ట‌స‌భ‌ల‌కు వెళ్ల‌క‌పోవ‌డం కూడా అంతే నేర‌మ‌న్నారు. త‌న‌కు ఇలాంటి గొప్ప అవ‌కాశం ఇచ్చినందుకు ముఖ్య‌మంత్రికి ధ‌న్య‌వాదాలు చెప్పారు. అంతేకాదు, తాను గిరిజ‌న బిడ్డ‌న‌నీ, క‌ష్ట‌ప‌డి ప‌నిచేసే తత్వం ఉన్న నాయ‌కురాలిన‌నీ, గిరిజ‌న ప్రాంతాల‌ను అభివృద్ధి చేస్తున్న గొప్ప మ‌న‌సున్న ముఖ్య‌మంత్రికి పూర్తిగా మ‌ద్ద‌తు ఇస్తున్నాన‌ని చెప్పారు. వారు చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌ను గ్రామ‌గ్రామానికీ వెళ్లి, ఇంటింటికీ వెళ్లి వివ‌రిస్తాను అన్నారు. చంద్ర‌బాబు నాయుడు ఆశ‌య సాధ‌న కోసం కృషి చేస్తాన‌న్నారు. చూశారా.. కండువా మార‌గానే వాయిస్ ఎలా మారిపోయిందో..? ఒక్క‌రోజులో ఆమె ప్ర‌సంగంలో ఎంత అనూహ్య‌మైన మార్పో క‌దా! ఇదంతా ఫిరాయింపు రాజ‌కీయాల మ‌హ‌త్తు. ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌కుండానే పార్టీ మారిపోవ‌డం.. ఆ పార్టీలో చేర‌గానే పాల‌న అద్భుతం, నాయ‌కత్వం సూప‌ర్ అంటూ మాట్లాడ‌టం.. క్యా బాత్ హై!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.