రివ్యూ: ఆక్సిజ‌న్‌

Oxygen review, Gopichand Oxygen rating

తెలుగు360.కామ్ రేటింగ్ : 2/5

తాడు దొరికింది క‌దా అని బొంగ‌రం,
టైరు ఉంది క‌దా అని కారూ కొన‌కూడ‌దు.

ట్విస్టు ఉంది క‌దా అని క‌థ‌లూ అల్లేయ‌కూడ‌దు. కాక‌పోతే ఇలాంటి ప్ర‌మాదాలే జ‌రుగుతున్నాయిప్పుడు. ఓ ట్విస్టు అనుకోవ‌డం… దానికి ముందూ వెనుక క‌థ రాసేసుకోవ‌డం.. టాలీవుడ్‌లో ఇదే తంతు న‌డుస్తోంది. దాంతో ట్విస్టు బాగున్నా… మిగిలిన క‌థ తేలిపోవ‌డంతో సినిమా మునిగిపోతోంది. ఇంచుమించుగా ‘ఆక్సిజ‌న్‌’ క‌థ కూడా అంతే. వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు గోపీచంద్‌. జ్యోతి కృష్ణ కూడా స‌రైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ ద‌శ‌లో ఇద్ద‌రికీ ‘ఆక్సిజ‌న్‌’ అందాల్సిందే. మ‌రి.. అలాంటి ఫ‌లితాన్ని ఈ సినిమా అందించిందా?? ఇందులోని ట్విస్టు మాటేంటి? అటూ ఇటూ ఉన్న క‌థ ఎలా సాగింది?? తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

క‌థ‌

రాజ‌మండ్రికి పెద్ద మ‌నిషి…. ర‌ఘుప‌తి (జ‌గ‌ప‌తిబాబు). వీర‌భ‌ద్రం (షాయాజీ షిండే) ప్ర‌ధాన‌మైన శ‌త్రువు. త‌న నుంచి ర‌ఘుప‌తి కుటుంబానికి ముప్పు ఏర్ప‌డుతుంది. ఈలోగా మ‌రో అప‌రిచిత శ‌త్రువు త‌యార‌వుతాడు. ఎక్క‌డ ఉన్నాడో తెలీదు… కానీ ర‌ఘుప‌తి కుటుంబాన్ని టార్గెట్ చేస్తాడు. త‌న కుటుంబాన్ని కాపాడుకోవ‌డానికి శ‌త‌విధాలాప్ర‌య‌త్నిస్తుంటాడు ర‌ఘుప‌తి. క‌నీసం కూతురు శ్రుతి (రాశీఖ‌న్నా) జీవితం అయినా బాగుండాల‌ని ఆశ ప‌డ‌తాడు. అమెరికా సంబంధం అయితే… పెళ్లి చేసుకొని, అక్క‌డ‌కు వెళ్లి సుఖంగా ఉంటుంద‌న్న ఆలోచ‌న‌తో ఓ సంబంధం సెట్ చేస్తాడు. శ్రుతి పెళ్లి చేసుకోవ‌డానికి అమెరికా నుంచి వ‌స్తాడు కృష్ణ ప్ర‌సాద్ (గోపీచంద్‌). తెలుగు సంప్ర‌దాయాలంటే చాలా ఇష్టం. శ్రుతిని కూడా ఇష్ట‌ప‌డ‌తాడు. కానీ శ్రుతికి మాత్రం ఈ సంబంధం ఏదోలా వ‌దిలించుకోవాల‌ని శ‌త విధాలా ప్ర‌య‌త్నిస్తుంటుంది. కానీ.. ఇంట్లో వాళ్లు శ్రుతి – ప్ర‌సాద్‌ల‌కు పెళ్లి చేయాల‌ని నిర్ణ‌యించుకుంటారు. మ‌రోవైపు ర‌ఘుప‌తి కుటుంబంపై దాడులు పెరుగుతుంటాయి. ఇవ‌న్నీ ఎవ‌రు చేస్తున్నారు? వాటిని శివ ప్ర‌సాద్ ఎలా ఎదుర్కున్నాడు అనేదే క‌థ‌.

విశ్లేష‌ణ‌

ఓ క‌థ సాగుతూ…. సాగుతూ…. మ‌ధ్య‌లో ఓ ట్విస్టు రావ‌డం.. అక్క‌డ్నుంచి క‌థ మ‌రో దారిలో ప‌య‌నించ‌డం ఈమ‌ధ్య కొన్ని సినిమాల్లో చూశాం. ఆక్సిజ‌న్ దీ అదే దారి. ఇంట్ర‌వెల్ కి ముందు సో.. సో గా సాగిన ఈ క‌థ‌.. స‌రిగ్గా ఇంట్ర‌వెల్ పాయింట్ ద‌గ్గ‌ర దిమ్మ‌తిరిగే షాక్ ఇస్తాడు. నిజానికి ఈ ట్విస్టు ఎవ్వ‌రూ ఊహించ‌నిదే. సెకండాఫ్‌లో క‌థ మ‌రో దిశ‌గా సాగ‌బోతోందని చెప్ప‌డానికి ఈ ట్విస్ట్ ఉప‌యోగ‌ప‌డింది. ఈ ట్విస్టు కోస‌మే ఈ క‌థ మొత్తం రాసుకొన్నా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. అమెరికా నుంచి హీరో దిగ‌డం, ఇక్క‌డ ప‌ల్లెటూరి వాతావ‌ర‌ణానికి ఫ్లాట్ అవ్వ‌డం, అతి మంచోడుగా ముద్ర‌వేసుకోవ‌డం ఈ స‌న్నివేశాలు ‘సాగి’న‌ట్టు అనిపిస్తాయి. అలీ కామెడీ కూడా అంత‌గా వ‌ర్క‌వుట్ కాలేదు. ‘ఏంట్రా బాబూ.. ఈ న‌స‌’ అని ఇంట్ర‌వెల్ కోసం ఎదురుచూస్తున్న‌ప్పుడు ఇచ్చిన ట్విస్ట్ థ్రిల్‌కి గురి చేస్తుంది. ద్వితీయార్థంలో ఓ సోష‌ల్ కాజ్ ని ప‌ట్టుకొని న‌డిపించారు. అయితే ఆ ‘కార‌ణం’ బ‌లంగా లేక‌పోవ‌డం నిరాశ ప‌రుస్తుంది. సిగ‌రెట్ తాగ‌డం ఆరోగ్యానికి హానిక‌రం అనే ముఖేష్ యాడ్‌లా… మ‌న స‌హ‌నానికి కాస్త ప‌రీక్ష పెట్టేలా ఉంటుంది ద్వితీయార్థం. అంద‌రికీ క‌నెక్ట్ అయ్యే పాయింట్‌ని, ఇంకా బ‌ల‌మైన అంశాన్ని ఎంచుకొంటే బాగుండేది. ఒకొక్క‌రి ఎకౌంట్‌లోకి 5వేలు వేయ‌డం, సీసీ కెమెరాల‌న్ని వాడుకొని విల‌న్‌ని ప‌ట్టుకోవ‌డం లాంటి స‌న్నివేశాలు క‌ట్టుదిట్టంగా రాసుకోవాల్సింది. ద్వితీయార్థం పూర్తిగా సీరియెస్ మోడ్‌లో సాగ‌డంతో ఎక్క‌డా రిలీఫ్‌కి ఛాన్స్ దొర‌క‌లేదు. అలాంట‌ప్పుడు స్క్రీన్ ప్లేని మ‌రింత బిగించాల్సింది. ఐటెమ్ పాట‌ని బ‌ల‌వంతంగా ఇరికించి స‌హ‌నానికి మ‌రింత ప‌రీక్ష పెట్టాడు ద‌ర్శ‌కుడు. చివ‌ర్లో ఈ క‌థ‌ని విషాదాంతంగా మ‌లిచి.. అంత‌లోనే భార‌తీయుడు టైపు క్లైమాక్స్ జోడించి – ‘ఇంత అవ‌స‌ర‌మా’ అనిపించేలా చేశాడు. బ‌ల‌మైన విల‌న్ లేక‌పోవ‌డం, ఉన్నా క్లైమాక్స్ వ‌ర‌కూ దాచేయ‌డం మ‌రో ప్ర‌ధాన‌మైన లోపం.

లాజిక్‌కి అంద‌ని స‌న్నివేశాలు చాలా ఉన్నాయి సినిమాలో. కొత్త బండి కొన‌డానికి షో రూమ్‌లోకి వెళ్లిన‌ప్పుడు.. కావ‌ల్సిన నెంబ‌ర్ ఇచ్చి.. అప్ప‌టి క‌ప్పుడు ఎవ్వ‌రూ బండి అమ్మ‌రు. ఇంత చిన్న లాజిక్‌నే మిస్స‌యిన ద‌ర్శ‌కుడు.. సినిమాని ఎలా తీసుంటాడో ఊహించుకోవ‌చ్చు. మొత్తానికి ట్విస్టు త‌ప్ప ఈ సినిమాలో ఏం మిగ‌ల్లేదు. సెకండాఫ్‌లో చెప్పిన పాయింట్ కూడా జ‌నానికి రీచ్ అయ్యేలా క‌నిపించ‌డం లేదు.

న‌టీన‌టులు

గోపీచంద్ రెండు షేడ్స్ ఉన్న పాత్ర‌లో క‌నిపిస్తాడు. తొలిస‌గంలో గోపీ న‌ట‌న కాస్త ఆర్టిఫిషియ‌ల్‌గా సాగింది. సెకండాఫ్‌లో, త‌న దైన యాక్ష‌న్‌, ఎమోష‌న్ పండించే చోట‌… త‌న మార్క్ చూపించాడు. డైలాగ్ డెలివ‌రీలో ఎలాంటి మార్పూలేదు. గోపీచంద్ పాత సినిమాల్ని చూసిన‌ట్టే ఉంది. అల్ల‌రి అమ్మాయిగా రాశీఖన్నా ఆక‌ట్టుకొంటుంది. అయితే గ్లామ‌ర్ ప‌రంగా మెరుపుల్లేవు. అను ఇమ్మానియేల్‌ది చిన్న పాత్రే. ఇదే త‌న తొలి సినిమా. ఎప్పుడో మొద‌లై…. ఆల‌స్యంగా విడుద‌ల కావ‌డం వ‌ల్ల అను ఇమ్మానియేల్ రూపు రేఖ‌ల్లో చాలా మార్పు క‌నిపిస్తుంది. జ‌గ‌ప‌తిబాబు పంచెక‌ట్టులో హుందాగా క‌నిపించాడు. అర‌చి డైలాగులు చెప్పే అవ‌కాశం రాలేదు. షాయాజీని వాడుకోలేదు. అభిమన్యు సింగ్ స్టామినా స‌రిపోలేదు. కిక్ శ్యామ్‌దీ వేస్ట్ కార్డ్ అయిపోయింది. అలీ కాస్త ఉప‌శ‌మ‌నం అందించాడు.

సాంకేతిక‌త‌

క‌థ‌లో ట్విస్టు మిన‌హాయిస్తే… మిగిలిన అంశాలన్నీ సో..సోగానే ఉన్నాయి. మిల‌ట‌రీ నేప‌థ్యం, సిగ‌రెట్ మాఫియా, దేశ‌భ‌క్తి, ఇలా సినిమా అంతా ర‌క‌ర‌కాలుగా సాగింది. మ‌ధ్య‌లో ఓసారి ‘తుపాకీ’ ఫార్ములానీ వాడేశాడు ద‌ర్శ‌కుడు. గ్రాఫిక్స్ పేల‌వంగా ఉన్నాయి. దానికోస‌మే ఈ సినిమా ఆల‌స్యం అయ్యింద‌ని చెప్పుకోవ‌డం ఓ జోక్‌లా అనిపిస్తుందంతే. యువ‌న్ సంగీతంలో మెరుపుల్లేవు. నేప‌ధ్య సంగీతం మాత్రం త‌న స్థాయిలో వినిపించింది. నిర్మాణ విలువ‌లు భారీగానే క‌నిపించాయి.

తీర్పు

ఆక్సిజ‌న్ అనే పేరు పెట్టి, దానికి జ‌స్టిఫికేష‌న్ చేసేలా సెకండాఫ్ రాసుకున్నా, దానికి త‌గ్గ‌ట్టుగా ఖ‌ర్చు పెట్టినా ఫ‌లితం లేకుండా పోయింది. ట్విస్టు బాగుంటే చాలదు… అదో దారం మాత్ర‌మే అని చెప్ప‌డానికి ఈ సినిమాని ఓ ఉదాహ‌ర‌ణ‌గా చూపించొచ్చు.

ఫైన‌ల్ ట‌చ్‌

రెండున్న‌ర గంట‌ల ‘ముఖేష్ యాడ్‌’

తెలుగు360.కామ్ రేటింగ్ : 2/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

భీమవరం రివ్యూ : రౌడీ రాజకీయానికి గడ్డు కాలమే !

ఏపీలో వీఐపీ నియోజకవర్గాల్లో భీమవరం ఒకటి. పవన్ కల్యాణ్ ఇప్పుడు అక్కడ పోటీ చేయకపోయినా అంది దృష్టి ఈ నియోజకవర్గంపై ఉంది. తాను నామినేషన్ వేసినా పవనే అభ్యర్థి అని ...

కాంగ్రెస్‌తో కాదు రేవంత్ తోనే బీజేపీ, బీఆర్ఎస్ పోటీ !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ తో కాకుండా రేవంత్ తో పోటీ పడుతున్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏమీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close