క‌లిస్తే సినిమా చేసేసిన‌ట్టేనా?

రాజ‌మౌళితో రామ్ చ‌ర‌ణ్‌…
సోష‌ల్ మీడియాలో వేగంగా చ‌క్క‌ర్లు కొడుతున్న వార్త ఇది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ రాజ‌మౌళి మెగా కాంపౌండ్ లోని హీరోతో, అదీ చ‌ర‌ణ్‌తో సినిమా అంటే.. క‌నీసం న‌మ్మ‌లేని స్థితి. క‌నీసం మాట వ‌ర‌స‌కు కూడా ఎవ్వ‌రూ అనుకోని కాంబినేష‌న్‌. అలాంటిది ఈ రెండు రోజుల్లో ఎలా సెట్ట‌య్యింది? ఆ మ‌ర్మం ఏమిటి?

చిరు 151వ సినిమా సైరా మోష‌న్ పోస్ట‌ర్ ఫంక్ష‌న్‌కి ముఖ్య అతిథిగా రాజ‌మౌళి వ‌చ్చాడు. దాంతో.. గాసిప్ రాయుళ్ల‌కు తాడు దొరికేసింది. ఈ ఫంక్ష‌న్‌కి రాజ‌మౌళి వ‌చ్చాడు కాబ‌ట్టి… వేదిక‌పై రామ్ చ‌ర‌ణ్ ఆహా రాజ‌మౌళి, ఓహో బాహుబ‌లి అని పొగిడాడు కాబ‌ట్టి – చ‌ర‌ణ్ తో రాజ‌మౌళికి అంతా సెట్ట‌యిపోయింద‌నుకొంటున్నారు. రాజ‌మౌళి త‌దుప‌రి సినిమా చ‌ర‌ణ్‌తోనే అని దాదాపుగా ఫిక్స‌యిపోయారు. అయితే ఇక్క‌డే ఓ లాజిక్ మిస్స‌వుతున్నారు. చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం సుకుమార్‌తో సినిమా చేస్తున్నాడు అది పూర్త‌య్యే స‌రికి డిసెంబ‌రు వ‌చ్చేస్తుంది. ఆ త‌ర‌వాత కొర‌టాల శివ సినిమా ప‌ట్టాలెక్కిస్తాడు. దానికో యేడాది పూర్త‌వుతుంది. అంటే చ‌ర‌ణ్ ఖాళీ అయ్యేది 2019 లోనే. రాజ‌మౌళి త‌న త‌దుప‌రి సినిమానే ఎవ‌రితో చేయాలి అనేది డిసైడ్ అవ్వ‌లేన‌ప్పుడు 2019లో ఎవ‌రితో సినిమా చేస్తాడో అప్పుడే ఎలా చెప్ప‌గ‌ల‌డు. అయితే ఒక్క‌టి మాత్రం నిజం.. మెగా కాంపౌండ్‌కీ, జ‌క్క‌న్న కు దూరం రాను రాను త‌గ్గుతోంది. అయితే ఎప్పుడు క‌లుస్తారో ఇప్పుడే చెప్ప‌డం క‌ష్టం. చ‌ర‌ణ్ – రాజ‌మౌళి సినిమా ఇప్ప‌ట్లో లేన‌ట్టే… ఇది మాత్రం పక్కా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com