ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికతతో 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని లోకేష్ స్పష్టం చేశారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ఇందుకోసం యువతకు నైపుణ్యం అందించేందుకు ప్రత్యేకంగా నైపుణ్యం పోర్టల్ ను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించారు. శ్రీసిటీలో క్యారియర్ ఏసీ యూనిట్ల పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. శ్రీసిటీ పారిశ్రామికవాడ 31 దేశాలకు చెందిన 250 కంపెనీలతో మేక్ ఇన్ ఇండియా కు రోల్ మోడల్‌గా నిలిచిందని లోకేష్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే భారతదేశపు కూల్ క్యాపిటల్‌గా గుర్తింపు పొందిందని మంత్రి ప్రకటించారు. క్యారియర్ వంటి అంతర్జాతీయ సంస్థ రూ.1000 కోట్ల పెట్టుబడితో రావడం శుభపరిణామన్నారు. 2027 నాటికి దేశీయ ఏసీ ఉత్పత్తిలో 60 శాతం, 2028 నాటికి 80 శాతం వాటా ఏపీ నుంచే ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేవలం డేటా సెంటర్ల ఏర్పాటుకే పరిమితం కాకుండా, వాటికి కావాల్సిన కూలింగ్ సిస్టమ్స్ వంటి పరికరాల తయారీలో ఏపీని గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దుతామని వివరించారు. ఫార్మా రంగంలో భారత్ ఏవిధంగా అగ్రగామిగా ఉందో, డేటా సెంటర్ కాంపోనెంట్స్ తయారీలో కూడా అదే స్థాయి నాయకత్వాన్ని సాధించగలమని లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖను గ్లోబల్ ఏఐ హబ్‌గా మార్చే ప్రక్రియలో ఇదొక కీలక అడుగు అని పేర్కొన్నారు. క్యారియర్ సంస్థ ఇక్కడ ప్లాంట్‌తో పాటు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయాలని ఆయన ఈ సందర్భంగా ప్రతిపాదించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం మోదీ – చంద్రబాబు కలయికతో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ వేగంతో పాలన సాగుతోందని మంత్రి అభివర్ణించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తమ ప్రభుత్వ ప్రత్యేకతని, ఒక్క జూమ్ కాల్తోనే భారీ పరిశ్రమలను రాష్ట్రానికి రప్పించగలుగుతున్నామని చెప్పారు. పారిశ్రామికవేత్తలకు ఏ అవసరం వచ్చినా ప్రభుత్వం కేవలం ఒక వాట్సాప్ మెసేజ్ దూరంలో అందుబాటులో ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
