ప్రేక్ష‌కుడి ‘న‌డ్డి’ విరిచేస్తున్నారు క‌దయ్యా!

సినిమా అతి చ‌వ‌కైన వినోద సాధ‌నం అని గ‌ర్వంగా చెప్పుకొనే రోజులు పోయాయి. ఇప్పుడు సినిమా కూడా అత్యంత ఖ‌రీదైన విలాస వ‌స్తువుగా మారిపోయింది. జీఎస్‌టి దెబ్బ తో సినిమా రేట్లు ఇప్పుడు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇది వ‌ర‌కు మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్‌లో రూ.150 ల‌కు టికెట్ దొరికేది. ఇప్పుడ‌ది రూ.200 అయిపోయింది. సింగిల్ స్క్రీన్‌ల‌లో సినిమా సినిమా రేటు.. ఘాటెక్కేసింది. నేల‌, బెంచిల వైపు చూసే సామాన్య ప్రేక్ష‌కుడు కూడా టికెట్ రేట్లు చూసి బావురు మంటున్నాడు. వారాంతంలో ఓ కుటుంబం సినిమాకి వెళ్లాలంటే…. క‌చ్చితంగా రూ.1000 వ‌దిలించుకోవాల్సింది. అదే భారం అనుకొంటుంటే.. దానికి తోడు టికెట్ రేట్లు పెంచేశారు. ఇప్పుడు వాతారంత వినోదం మ‌రింత భార‌మైపోయింది.

టికెట్ రేట్ల‌తోనే స‌రా అంటే.. థియేట‌ర్ యాజ‌మాన్య దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. పాప్ కార్న్ నుంచి శీత‌ల పానియాల వ‌ర‌కూ అన్నీ డ‌బుల్ రేట్లే. మంచి నీళ్ల బాటిల్ కొనుక్కోవాల‌న్నా రూ.50 చ‌దివించుకోవాల్సిందే. ఇంత ఖ‌ర్చు పెట్టినా సౌక‌ర్యాలు స‌రిగా ఉంటాయా అంటే అదీ లేదు. ఏసీ థియేట‌ర్లో.. ఏసీ ప‌నిచేయ‌దు. సిట్టింగ్ సిస్ట‌మ్ స‌రిగ్గా ఉండ‌దు. టికెట్ల ద‌గ్గ‌ర తోపులాట మామూలే. ఆఖ‌రికి టాయ్‌లెట్లు క్లీన్‌గా ఉండ‌వు. మంచి నీటి స‌దుపాయం ఉండ‌దు. పార్కింగ్ ద‌గ్గ‌రా బాదుడే. ఏదైనా జ‌ర‌క్కూడ‌ని ప్ర‌మాదం జ‌రిగితే.. సంర‌క్ష‌ణ చ‌ర్య‌లు ఉండ‌వు. ప్రేక్ష‌కుడి నుంచి డ‌బ్బులు ఎలా గుంజాలా అని చూస్తారు త‌ప్ప‌, వాళ్ల‌కు అందాల్సిన క‌నీస సౌక‌ర్యాలు అందుతున్నాయా, లేదా? అనే విషయాన్ని ఎవ్వ‌రూ ఆలోచించ‌రు.

జీఎస్‌టీ రేటు త‌గ్గించాల‌ని చిన్న నిర్మాత‌లంతా గోల పెడుతున్నారు. అయితే పెంచిన టికెట్ల ధ‌ర‌ల గురించి ఏ నిర్మాతా మాట్లాడ‌డు. కార‌ణం.. టికెట్ రేటు పెరిగితే లాభం త‌మ‌కే! ఇంతా చేసి స్వ‌చ్చ‌మైన వినోదాన్ని అందిస్తున్నా అంటే అదీ లేదు. ఎప్పుడూ రొడ్డ‌కొట్టుడు సినిమాలే. ఇప్ప‌టికే సినిమాల‌పై ఓక‌ర‌మైన ఏవ‌గింపు వ‌చ్చేసింది జ‌నాల‌కు. అందుకే 70 శాతం మంది ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రావ‌డ‌మే మానేశారు. `ఆ సినిమా ఏదో టీవీల్లో వ‌చ్చిన‌ప్పుడు చూసుకొందాంలే` అనుకొంటున్నారు. అందులో చాలామంది పైర‌సీని ఆశ్ర‌యిస్తున్నారు. సినిమా బాగుందంటే. అప్పుడు థియేట‌ర్‌కి వెళ్తాంలే అన్న‌ది వాళ్ల ఆలోచ‌న‌. అలాంటి ప్రేక్ష‌కుల్ని థియేట‌ర్‌కి ర‌ప్పించే ప్ర‌య‌త్నాలు చేయాలే త‌ప్ప‌… ఇలా టికెట్ రేట్లు పెంచేసి.. ముంద‌రి కాళ్ల‌కు బంధ‌నాలు వేయ‌కూడ‌దు. అదే జ‌రిగితే.. థియేట‌ర్ల‌ని క‌ల్యాణ మండ‌పాలుగా మార్చుకోవ‌డం మిన‌హా మ‌రో మార్గం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.