కేసీఆర్ చెప్పినట్లు చేస్తా.. అసంతృప్తి లేదు: హరీష్ రావు

మంత్రివర్గంలో అవకాశం కల్పించకపోవడంతో.. తాను తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు .. తన వర్గంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వస్తున్న వార్తలను.. హరీష్ రావు తోసి పుచ్చారు. తాను నిబద్ధత కలిగిన టీఆర్ఎస్ సైనికుడ్నని.. కేసీఆర్ ఏ బాధ్యత అప్పగించినా.. సామాన్య కార్యకర్తలా నెరవేరుస్తానని… ప్రకటించారు. మంత్రి వర్గంలోకి తీసుకోలేదన్న బాధ లేదని స్పష్టం చేసారు. మంత్రుల ప్రమాణస్వీకారానికి హరీష్ రావు హాజరయ్యారు. టీఆర్ఎస్ నేతలందరితో కలివిడిగా వ్యవహరించారు. అందర్నీ ఆప్యాయంగా పలకరించారు. సామాజిక సమీకరణాలను చూసుకుని కేసీఆర్.. మంత్రి పదవులు ఇచ్చారని.. సమర్థించారు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తలన్నీ అసత్యాలన్నీ స్పష్టం చేశారు.

పది మందికి మంత్రి పదవి ఇచ్చి.. పార్టీలో మొదటి నుంచి ఉన్న హరీష్‌కు మొండి చేయి చూపడంపై… సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది. అసలు మంత్రి వర్గ విస్తరణను ఆలస్యం చేయడానికి కారణం.. హరీష్ రావుకు.. పదవి ఇవ్వడం లేదన్న విషయాన్ని మెల్లగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికేనన్న విశ్లేషణలు వస్తున్నాయి. అంతే తప్ప… ప్రత్యేకమైన కారణాలు ఏవీ లేవని చెబుతున్నారు. కారణం ఏదైనా కానీ.. ఉద్యమం నుంచి తనతో పాటు ఉన్న హరీష్ రావు కన్నా… కేసీఆర్ ఇటీవలి కాలంలో తన కుమారుడు కేటీఆర్‌నే ప్రమోట్ చేస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చి… టీఆర్ఎస్ పై మొత్తం పెత్తనం అప్పగించేశారు. హరీష్‌రావుకు కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. దాంతో సహజంగానే.. హరీష్ రావు అసంతృప్తి అంటూ ప్రచారం బయటకు వచ్చింది.

ప్రస్తుతం టీఆర్ఎస్‌లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా.. హరీష్‌రావును.. కనీసం .. నేరుగా పలకరించడానికి కూడా టీఆర్ఎస్ నేతలు సంకోచిస్తున్నారు. హరీష్‌రావుతో సన్నిహిత సంబంధాలున్నాయన్న ప్రచారం జరిగితే.. ఎక్కడ తమకు పార్టీలో భవిష్యత్ లేకుండా పోతుందోనన్న ఆందోళన టీఆర్ఎస్ నేతల్లో కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితి చూస్తూంటే.. హరీష్ రావు… టీఆర్ఎస్‌లో ఇక నామమాత్రంగా ఉండాల్సిందేనన్న విశ్లేషణలు వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com