పోలవరం = కాళేశ్వరం,

పరుగులు పెడ్తున్న హరీశ్‌

తెలంగాణ ఇరిగేషన్‌ మంత్రి హరీశ్‌ రావు అహౌరాత్రాలు నిద్రాహారాలు మాని ప్రాజెక్టుల పూర్తికి కృషి చేస్తున్నట్టు మీడియా వార్తలు చెబుతున్నాయి. తనిఖీల కోసం ఆయన స్కూటర్‌పై వెళ్లే పోటో విపరీతంగా ప్రచారమైంది. ఇంతగా ఎందుకు శ్రమ పడుతున్నారంటే రాజకీయ వర్గాలు రకరకాల కారణాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి కెసిఆర్‌ వెంటబడుతున్నారట.ఈ ఎన్నికల లోగా కాళేశ్వరం పూర్తి చేసి చూపించకపోతే కష్టమని టిఆర్‌ఎస్‌ భావిస్తున్నదట. మిగిలిన చాలా ప్రాజెక్టుల పనులు పూర్తయ్యే సూచనలు లేవు గనక ఇదొక్కదానిపైనే దృష్టి కేంద్రీకరించి మిడ్‌ మానేరు వరకూ నీళ్లు పారిందచగలిగితే తెలంగాణ ఓటర్ల ముందుకు వెళ్లవచ్చని అనుకుంటున్నారట. ఇదేగాక తను ఉపేక్షిస్తే కెసిఆర్‌ స్వయంగా ఈ పని చేసేందుకు బయిలుదేరతారని కూడా హరీశ్‌కు తెలుసు. ఇప్పటికే తనిఖీలు చర్చలలో ఆయన ముఖ్యపాత్ర వహిస్తున్నారు. ఇక నిరంతర పర్యవేక్షణ కూడా ఆయనకే వదిలేస్తే తనకు వున్న ఒక్క ప్రాధాన్యత పోతుందని హరీశ్‌ ఆలోచన. ఎపిలో పోలవరం గురించి మాట్లాడుతున్నట్టే తెలంగాణలో కాళేశ్వరం అంటున్నారు. అక్కడ ముందే పట్టిసీమ పూర్తి చేసినట్టే మిడ్‌ మానేరు వరకూ నీళ్లు తీసుకొచ్చి పోస్తే సరిపోతుందని ఒక అంచనా. అయితే పట్టిసీమకు అవసరమైన కాలువల తవ్వకం వైఎస్‌ హయాంలోనే జరగ్గా తర్వాత నీళ్లివ్వడంతేలికైంది. కాని మిడ్‌ మానేరుకు కాల్వలు ఏర్పాటు చేయాల్సి వుంటుంది గనక ఈ పోలిక సరికాదని ఒక టిఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధి ఒకరు అన్నారు.ఏమైనా హరీశ్‌ బాధ్యత తనది కాబట్టి కష్టపడుతున్నారనేది ఆయన సమర్థన. కాకుంటే ఈ పర్యటన మధ్యలో హరీశ్‌ ప్రాజెక్టులతో జన్మ ధన్యమైందనీ ఇక ఏ పదవులు కోరుకోరని చెప్పడం కూడా అందరినీ ఆకర్షించింది.గతంలో కావాలని వెంటపడి మరీ ఒక టీవీ ఛానల్‌లో కెటిఆర్‌ను ముఖ్యమంత్రిని చేసినా తనకు అభ్యంతరం లేదని చెప్పించారనేది ఎప్పుడూ చెప్పుకుంటున్న మాట. కాని ఇప్పుడు బయిట తనకు తాను హరీశ్‌ అలా అన్నారంటే వ్యూహాత్మకమా ఒత్తిళ్ల ఆదేశాల ఫలితమా అని రాజకీయ వర్గాలు తర్కించుకుంటున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.