హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ నిఘా వ్యవస్థ ఐఎస్ఐ ఏజెంట్ గా పని చేస్తున్నారని గుర్తించిన పోలీసులు జ్యోతితోపాటు మరో ఆరుగురుని అదుపులోకి తీసుకున్నారు.
భారత్ సైనిక సమాచారాన్ని దాయాది దేశానికి జ్యోతి చేరవేసినట్లు గుర్తించారు పోలీసులు. ట్రావెల్ వీసాపై పాక్ లో పర్యటించి ఇండియా ఆర్మీకి సంబంధించిన కీలక సమాచారాన్ని పాక్ కు చేరవేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. దేశద్రోహా చర్యలకు పాల్పడిన జ్యోతికి కోర్టు ఐదు రోజుల కస్టడీ విధించింది.భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల వేళ ఈ పరిణామం కలకలం రేపుతోంది. ఆమెతోపాటు ఇంకా ఎవరెవరు పాకిస్తాన్ కు గూడచర్యం చేస్తున్నారని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ట్రావెల్ బ్లాగర్ , యూట్యూబర్ గా చెలామణి అవుతూ పలుమార్లు పాక్ లో పర్యటించిన జ్యోతి… వాట్సప్, టెలిగ్రాం , స్నాప్ చాట్ ద్వారా భారత ఆర్మీకి సంబంధించి కీలక సమాచారం పాక్ కు చేరవేసినట్లు తెలుస్తోంది. పాక్ ఆర్మీకి చెందిన వారి పేర్లను ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ఉండేలా మారుపేర్లతో సేవ్ చేశానని ఆమె అంగీకరించిందని తెలుస్తోంది.