ప్రధాని మోదీని పొగిడారని తనికెళ్ల భరణిపై సోషల్ మీడియాలో చాలా మమంది ద్వేషం చూపిస్తున్నారు. ఆయనను నానా మాటలంటున్నారు. ఇలాంటి వారు ఎవరు అని చూస్తే.. వారంతా మోదీని వ్యక్తిగతంగా వ్యతిరేకించేవాళ్లు. అంటే తమకు ఇష్టం లేని వారిని పొగిడారని వారంతా తనికెళ్ల భరణిని నిందిస్తున్నారు. తనకు పద్మశ్రీ కోసమే ఆయన ఇలా చేస్తున్నారని తీర్మానించేస్తున్నారు. నిజానికి తనికెళ్ల భరణి వ్యక్తిత్వం తెలిసిన వాళ్లు ఎవరూ ఆయనను ఇలా నిందించరు.
అభిప్రాయ స్వేచ్ఛపై అసహనం
తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే కాకుండా, ఆధునిక తెలుగు సాహిత్య రంగంలోనూ తనదైన ముద్ర వేసిన అరుదైన బహుముఖ ప్రజ్ఞాశాలి తనికెళ్ల భరణి. నటుడిగా, రచయితడిగా, దర్శకుడిగా, అన్నింటికీ మించి శతాబ్దాల తెలుగు సంస్కృతీ సాంప్రదాయాలను తన సాహిత్యం ద్వారా భావితరాలకు అందిస్తున్న సంస్కారధనుడు. అలాంటి ఒక సృజనకారుడిపై, కేవలం ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించారనే ఏకైక నెపంతో సోషల్ మీడియా వేదికగా కొందరు సాగిస్తున్న ద్వేషపూరిత ప్రచారం మంచిది కాదు. రాజకీయ ప్రాధాన్యతలు, వ్యక్తిగత ఇష్టాయిష్టాల ఆధారంగా ఒక నిరపేక్ష కళాకారుడి ఐడెంటిటీని, దశాబ్దాల శ్రమను తక్కువ చేసి మాట్లాడటం సమాజంలో పెరుగుతున్న అసహనానికి అద్దం పడుతోంది.
మోదీని పొగడటమే తప్పా?
ఒక కళాకారుడికి ఏ రాజకీయ భావజాలంతోనైనా విభేదించే హక్కు ఉంటుంది, అలాగే నచ్చిన వ్యక్తిని శ్లాఘించే స్వేచ్ఛా ఉంటుంది. ప్రధాని మోదీని చూసినప్పుడు తనకు కలిగిన అనుభూతిని భరణి నిష్కపటంగా పంచుకున్నారు. అయితే, మోదీని రాజకీయంగా వ్యతిరేకించే ఒక వర్గం.. భరణి చేసిన ఈ వ్యాఖ్యలను అడ్డం పెట్టుకుని ఆయనపై వ్యక్తిగత దాడికి దిగడం సమర్థనీయం కాదు. విమర్శిస్తున్న వారికి రాహుల్ గాంధీనో, లేక ప్రాంతీయ నాయకులో గొప్పగా అనిపించవచ్చు; ప్రజాస్వామ్యంలో ఆ హక్కు అందరికీ సమానమే. కానీ, ఎదుటివారి అభిప్రాయాన్ని గౌరవించకుండా, వారి ప్రతిభను నిందిస్తూ బురదజల్లడం కేవలం మూర్ఖత్వమే అవుతుంది.
పద్మశ్రీ కి భరణి అర్హుడు కారా?
ఈ వివాదంలో అత్యంత దురదృష్టకరమైన అంశం ఏమిటంటే.. భరణి కేవలం పద్మశ్రీ అవార్డు కోసమే ఈ విధమైన ప్రశంసలు కురిపిస్తున్నారంటూ కొందరు తీర్మానించేయడం. తనికెళ్ల భరణి చేసిన సాహిత్య సేవ సినిమాలకు, అవార్డులకు అతీతమైనది. శభాష్ రా శంకరా వంటి తాత్విక పద్యాల నుంచి ఎన్నో ఆధ్యాత్మిక, సాహిత్య రచనల ద్వారా ఆయన తెలుగు భాషకు చేసిన సేవ అమోఘం. ఆయన అర్హతకు ఎప్పుడో దక్కాల్సిన పురస్కారం అది. రేపు ఒకవేళ ఆయన ప్రతిభను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాన్ని ప్రకటిస్తే, దాన్ని కూడా మోదీ భజన వల్లే వచ్చిందంటూ తక్కువ చేయడానికి ఈ అసహన శ్రేణులు ఇప్పటి నుంచే పునాదులు వేసుకోవడం వారి సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం.
అసలైన ప్రతిభావంతులకే పద్మ అవార్డులు
నిజానికి, 2014 తర్వాత దేశంలో పద్మ అవార్డుల ఎంపిక ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు వచ్చాయనే విషయాన్ని మేధావులు సైతం అంగీకరిస్తారు. గతంలో లాగా సిఫారసులు, రాజకీయ పీఠాల చుట్టూ తిరిగే ప్రదక్షిణలకు కాలం చెల్లింది. సమాజంలో ఎక్కడో మారుమూల ఉంటూ నిశ్శబ్దంగా సేవ చేసే అన్సంగ్ హీరోస్ ను వెలికితీసి పద్మ అవార్డులు ఇస్తున్న తీరును ఈ విమర్శకులు బహుశా గమనించనట్లున్నారు. దశాబ్దాల సాహిత్య తపస్సు ఉన్న భరణి లాంటి వ్యక్తికి అవార్డు కోసం ప్రశంసలు గుప్పించాల్సిన అవసరం లేదు, ఆయన అర్హతే ఆయనకు శ్రీరామరక్ష.
భరణిని తక్కువ చేయలేరు!
కళను, కళాకారుడిని రాజకీయ చట్రంలో ఇరికించి చూడటం వల్ల సమాజం ఒక గొప్ప మేధోసంపత్తిని కోల్పోయే ప్రమాదం ఉంది. భావ ప్రకటనా స్వేచ్ఛ గురించి లెక్చర్లు ఇచ్చే వారే, తమకు నచ్చని అభిప్రాయం ఎదుటివారి నుంచి వ్యక్తమైనప్పుడు ఇంతలా హద్దులు మీరడం ద్వంద్వ నీతికి పరాకాష్ట. తనికెళ్ల భరణి లాంటి నిష్కల్మష హృదయుడైన సాహిత్య సేవకుడిని ఇలాంటి విమర్శలు కించపరచలేవు. సోషల్ మీడియా ట్రోలింగ్స్ తాత్కాలికం, కానీ ఆయన సృష్టించిన అక్షర రూపాలు, పంచిన సృజనాత్మకత శాశ్వతం. మేధో వలసల కాలంలో మాతృభాషను బ్రతికించుకునేందుకు అక్షరాయుధాన్ని పట్టిన భరణి లాంటి సాహితీమూర్తులకు పక్షపాత రాజకీయాలకు అతీతంగా గౌరవం ఇవ్వడమే విజ్ఞుల లక్షణం.
