సంఘ‌ర్ష‌ణ‌లో సుప్రీందే పైచేయి: జ‌స్టిస్ క‌ర్ణ‌న్‌కు జైలు

సుప్రీం కోర్టుకూ.. ఓ హైకోర్టు న్యాయ‌మూర్తికీ మ‌ధ్య పోరాటం తారాస్థాయికి చేరుకుంది. ద‌ళిత కార్డును ఉప‌యోగించి, త‌ప్పించుకోజూసిన ఆయ‌న ఆట‌ల్ని క‌ట్టించేందుకే అత్యున్న‌త న్యాయ‌స్థానం మొగ్గుచూపింది. కోర్టు ఉత్త‌ర్వుల ధిక్క‌ర‌ణ కింద జ‌స్టిస్ సిఎస్ క‌ర్ణ‌న్‌కు ఆరు నెల‌ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ జెఎస్ ఖేహార్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయ‌మూర్తుల ధ‌ర్మాస‌నం ఈ ఆదేశాన్నిచ్చింది. న్యాయ‌స్థానాన్ని గానీ, న్యాయ ప్ర‌క్రియ‌ను గానీ జ‌స్టిస్ క‌ర్ణ‌న్ గౌర‌వించ‌డంలేద‌ని అభిప్రాయ‌ప‌డింది. క‌ర్ణ‌న్ వెంట‌నే అదుపులోకి తీసుకోవాల‌ని ధ‌ర్మాస‌నం ప‌శ్చిమ బంగ డీజీపీని ఆదేశించింది. మ‌ద్రాసు హైకోర్టులో స‌హ న్యాయ‌మూర్తుల‌పై అవినీతి ఆరోప‌ణ‌లు చేసి, త‌న స్వార్థం కోసం ద‌ళిత కార్డును వాడుతున్నార‌ని పేర్కొంది. ధ‌ర్మాస‌నంతో అడిష‌న‌ల్ సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్‌, సీనియ‌ర్ అడ్వొకేట్లు ఏకీభ‌వించారు. కోర్టు ఉత్త‌ర్వుల‌ను ధిక్క‌రించిన క‌ర్ణ‌న్‌ను శిక్షించాల్సిందేన‌న్నారు. సిట్టింగ్ జ‌డ్జిని జైలుకు పంపిస్తే, అది న్యాయ చ‌రిత్ర‌లో మ‌చ్చ‌గా మిగిలిపోతుంద‌ని పేర్కొంటూ, క‌ర్ణ‌న్ ప‌ద‌వీ విర‌మ‌ణ చేసేవ‌ర‌కూ అత్యున్న‌త న్యాయ‌స్థానం వేచి ఉండ‌గ‌ల‌దా అని కెకె వేణుగోపాల్ అనే న్యాయ‌వాది ప్ర‌శ్నించారు. ధిక్క‌ర‌ణ నేరంలో కోర్టు అది చేసిందెవ‌ర‌నేది చూడ‌ద‌ని ధ‌ర్మాస‌నం స్ప‌ష్టంచేసింది. ఇలాంటి నేరం ఎవ‌రు చేసినా శిక్షించాల్సిందేన‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు చెప్పింది. జ‌స్టిస్ క‌ర్ణ‌న్ గ‌తంలో విచ‌క్ష‌ణ కోల్పోయి ఇచ్చిన తీర్పుల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని తీర్పు చెప్పినట్లు పేర్కొంది. జ‌స్టిస్ క‌ర్ణ‌న్ చేసే వ్యాఖ్య‌ల‌ను మీడియా ప్ర‌చురించ‌కూడ‌ద‌నీ, ప్ర‌సారం చేయ‌కూడ‌ద‌నీ బెంచ్ ఆదేశించింది. దీనికి ముందు సోమ‌వారం నాడు జ‌స్టిస్ క‌ర్ణ‌న్ ఒక్క‌డుగు ముందుకేసి, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ‌మూర్తి ఖేహార్ స‌హా, ఏడుగురు జ‌డ్జిల‌కు ఐదేళ్ళ జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. కోర్టు ఉత్త‌ర్వుల ధిక్క‌ర‌ణ మాత్ర‌మే కాక ఈ న్యాయ‌మూర్తులు కుల విచ‌క్ష‌ణ‌ను క‌న‌బ‌రుస్తున్నార‌ని కూడా ఆయ‌న త‌న తీర్పులో పేర్కొన్నారు. ఈ ప‌రిణామంతో అత్యున్న‌త న్యాయ‌స్థానం అంత‌వ‌ర‌కూ వ‌హించిన స‌హ‌నాన్ని కోల్పోయింది. సుప్రీంకు ఏదో ఒక‌టి చేయ‌క త‌ప్ప‌ని పరిస్థితి ఏర్ప‌డింది. తీవ్ర‌మైన నిర్ణ‌యానికి వ‌చ్చింది. జ‌స్టిస్ క‌ర్ణ‌న్‌కు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.

ఈ ఉదంతం న్యాయ స్థానం అత్యున్న‌త స్థాయిని చాటి చెప్పింది. ఈ తీర్పును క‌ర్ణ‌న్ శిర‌సావ‌హిస్తారా లేదా అనేదే ప్ర‌స్తుత ప్ర‌శ్న‌.

-సుబ్ర‌హ్మ‌ణ్యం విఎస్ కూచిమంచి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.