విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ కోసం కేటాయించిన భూములపై వైసీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం, రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే సమయంలో ఇలాంటి అడ్డంకులు సృష్టించడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. గూగుల్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి రావడం వల్ల యువతకు ఉపాధి లభిస్తుందని, అటువంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను వివాదాల్లోకి నెట్టడం సరికాదని కోర్టు వ్యాఖ్యానించింది.
పిటిషనర్ లేవనెత్తిన సాంకేతిక అంశాలపై కోర్టు ప్రశ్నించింది. భూ కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని చెప్పడానికి సరైన ఆధారాలు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించింది. కేవలం రాజకీయ విమర్శల ఆధారంగా , అనుమానాలతో అభివృద్ధి పనులను అడ్డుకోలేమని కోర్టు స్పష్టం చేసినట్లు సమాచారం. విశాఖను ఐటీ హబ్‌గా మార్చే ప్రక్రియలో భాగంగా జరుగుతున్న ఈ భూ కేటాయింపులు నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదించగా, కోర్టు ఆ వాదనలతో ఏకీభవిస్తూ పిటిషనర్ వైఖరిని తప్పుపట్టింది. ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకునేందుకు తాము ఇక్కడ లేమని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఈ పరిణామం వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ప్రాజెక్టుల వల్ల కలిగే ప్రయోజనాలను చూడకుండా కేవలం అడ్డంకులు సృష్టించడమే లక్ష్యంగా పిటిషన్లు వేయడంపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఓ వైపు డేటా సెంటర్ మేమే తెచ్చామంటారు..మరో వైపు భూములు ఇవ్వొద్దని కోర్టుకెళ్తారు.వైసీపీ తీరుపై ప్రజల్లోనూ అసహనం వ్యక్తమవుతోంది.
