కోడి పందాల‌పై హైకోర్టు మ‌ళ్లీ అలా చెప్పింది..!

ప్ర‌తీయేటా సంక్రాంతి పండుగ‌కు కొద్దిరోజుల ముందు నుంచీ కోడి పందాల రాయుళ్ల‌కు ఇదే టెన్ష‌న్‌..! కోర్టు ఏం చెబుతుందా.? పోలీసులు ఏం చేస్తారా..? తేడా కొడితే పందాల మీద ఎన్నో ఆశ‌లు పెట్టి, బాగా ఖర్చుపెట్టి పెంచుకున్న పుంజుల ప‌రిస్థితేంటీ..? ఇలా చాలా అనుమానాలు ఉంటాయి. కానీ, ఈసారి పందాల‌కు బాగా జరుగుతాయ‌న్న వాతావ‌ర‌ణం కొన్ని రోజుల కింద‌టి నుంచే ఉంది. పైగా, కొంతమంది నేత‌లే సంప్ర‌దాయబ‌ద్ధంగా కోడి పందాలు ఉంటాయ‌ని భ‌రోసా ఇచ్చే ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం కూడా చూశాం. కానీ, చిట్ట చివ‌ర‌కు ఏమైందీ… మ‌రోసారి హైకోర్టు స్పందించింది. గ‌త ఏడాది మాదిరిగానే… ఈ ఏడాది కూడా ప్ర‌భుత్వానికి హుకుం జారీ చేసింది…!

సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా ఎక్క‌డా కోడి పందాలు జ‌ర‌క్కుండా క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి హైకోర్టు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇచ్చింది. పండుగ సంద‌ర్భంగా కోడి పందాల‌తో పాటు, కొన్ని అసాంఘిక కార్య‌క్ర‌మాల‌కు ఆస్కారం ఎక్కువౌతోందంటూ రామ‌చంద్ర‌రాజు అనే వ్య‌క్తి న్యాయ‌స్థానంలో పిటీష‌న్ వేశారు. దీనిపై కోర్టు స్పందిస్తూ తాజాగా ఈ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, గ‌త ఏడాది హైకోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను కూడా పెడ‌చెవిన పెట్టారంటూ తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేసింది. ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, డీజీపీ, 49 మంది స్టేష‌న్ హౌస్ అధికారులు, 43 మంది తాహ‌శీల్దారుల‌కు కూడా నోటీసులు జారీ చేయాలంటూ స‌ర్కారును కోర్టు ఆదేశించింది. ఈ ఏడాది పండుగ సంద‌ర్భంగా ఎక్క‌డా కోడి పందాలు జరక్కుండా క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకోవాలంటూ స్ప‌ష్టం చేసింది.

గ‌త ఏడాది కూడా కోర్టు ఇలానే ఆదేశాలు ఇచ్చింది. కానీ, య‌థావిధిగా కోడి పందాలు జ‌రిగాయి. ముఖ్యంగా గోదావ‌రి జిల్లాల్లో ఈ హ‌డావుడి బాగా ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. నిజానికి, పండుగ‌కు ఇంకా వారంపైనే స‌మ‌యం ఉన్నా… ఇప్ప‌టికే కొన్ని చోట్ల పందాలు జ‌రుగుతున్న‌ట్టు కూడా కొన్ని క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ప్ర‌తీయేటా పండుగ ముందు ఇలా ఆదేశాలు రావ‌డం అనేది ఒక రొటీన్ వ్య‌వ‌హారంగా మిగ‌ల‌కుండా ఉండాలంటే… క‌నీసం ఈసారైనా పందాలు జ‌ర‌గ‌కుండా ప్ర‌భుత్వం అడ్డుకోవాలి. కానీ, అది సాధ్య‌మా..? పందాలు అరిక‌ట్టాలంటే.. ఇలా సంక్రాంతికి వారం ముందు ఏవో చ‌ర్య‌లంటూ ప్ర‌భుత్వాలు రంగంలోకి దిగితే ఏం ఉప‌యోగం ఉంటుంది..? ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంచాలి. పందాలు ఎందుకు వ‌ద్దంటున్నార‌నేది వివరంగా చెప్పాలి. ఇంకోప‌క్క మీడియా కూడా కొంత బాధ్య‌త తీసుకోవాలి! పండుగ వ‌స్తోందంటే చాలు.. పందాలకు సిద్ధ‌మౌతున్న కోళ్ల లైఫ్ స్టైల్ మీద స్టోరీలు, వాటిని పందాల‌కు సిద్ధం చేస్తున్నవారి ఇంట‌ర్వ్యూలు లాంటివి త‌గ్గించాలి. ఇదేదో న్యాయం స్థానం బాధ్య‌త అనో, లేదా ప్ర‌భుత్వాలు మాత్ర‌మే స్పందిస్తే త‌ప్ప ప‌రిస్థితిలో మార్పు రాద‌నో.. లాంటి అభిప్రాయాల‌ను ప‌క్క‌న‌పెట్టాలి. రాజకీయ నాయకులు కూడా ఈ దిశ‌గా కృషి చేయాలి. పందాలు ఎక్క‌డ జ‌ర‌క్కుండా చూడాలంటే.. చాలా పెద్ద ప్ర‌యాసే అన‌డంలో ఏమాత్రం సందేహం లేదు. మ‌రి, కోర్టు ఆదేశించిన‌ట్టుగా.. ప్ర‌భుత్వం ఏమేర‌కు స్పందిస్తుందో చూద్దాం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.