తెలంగాణలో భూముల మార్కెట్ విలువల పెంపునకు ప్రభుత్వం సిద్ధమవ్వడంతో రియల్ ఎస్టేట్ రంగంలో ఒక్కసారిగా కదలిక వచ్చింది. జూన్ 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ధరలు అమల్లోకి రానున్నందున అదనపు ఆర్థిక భారాన్ని తప్పించుకోవడానికి కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా అభివృద్ధికి చిరునామాగా మారిన వరంగల్ హైవే పరిసర ప్రాంతాల్లో ఈ సందడి స్పష్టంగా కనిపిస్తోంది. గత రెండు రోజుల్లోనే యాదగిరిగుట్ట, ఆలేరు, ఘటకేసర్ వంటి కీలక ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య సాధారణం కంటే 40 శాతం మేర పెరిగాయి.
వరంగల్ జాతీయ రహదారి పొడవునా వెలిసిన వందలాది వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు, ప్రభుత్వ నిర్ణయంతో అప్రమత్తమయ్యారు. జూన్ నుంచి రిజిస్ట్రేషన్ విలువల పెంపు 100 శాతం నుంచి 300 శాతం వరకు ఉండే అవకాశం ఉందన్న ప్రచారంతో, మధ్యతరగతి ఇన్వెస్టర్లు లక్షలాది రూపాయల భారాన్ని తగ్గించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఘటకేసర్ వంటి ఐటీ కారిడార్‌కు సమీపంలో ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే స్లాట్లు దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉదయం నుంచి రాత్రి వరకు కిటకిటలాడుతున్నాయి.
ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందిన యాదగిరిగుట్ట పరిసరాల్లో రియల్ ఎస్టేట్ గ్రాఫ్ నిలకడగా ఉన్నప్పటికీ, ఈ తాజా నిర్ణయంతో అక్కడ క్రయవిక్రయాలు ఊపందుకున్నాయి. యాదగిరిగుట్ట రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గత రెండు రోజులుగా దస్తావేజుల సంఖ్య భారీగా పెరిగింది. అలాగే ఆలేరు ప్రాంతంలో కూడా ఇన్వెస్టర్లు తమ ప్లాట్లను రిజిస్టర్ చేయించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. జూన్ తర్వాత రిజిస్ట్రేషన్ ఛార్జీల భారం పెరగడమే కాకుండా, మార్కెట్ విలువల పెంపు వల్ల స్టాంప్ డ్యూటీ కూడా గణనీయంగా పెరుగుతుందన్న అంచనాలే ఈ రద్దీకి ప్రధాన కారణం.
పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకుని స్టాంపులు , రిజిస్ట్రేషన్ల శాఖ కూడా ప్రత్యేక చర్యలు చేపట్టింది. స్లాట్ల సంఖ్యను పెంచడంతో పాటు, సెలవు దినాల్లో కూడా కార్యాలయాలు పనిచేసేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. అయినప్పటికీ, గడువు దగ్గర పడుతుండటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. వరంగల్ హైవేపై ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా తమ కస్టమర్లకు ఫోన్లు చేసి జూన్ లోపు రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నాయి. మొత్తానికి ప్రభుత్వ నిర్ణయం రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఒకేసారి భారీగా లావాదేవీలు పెరగడానికి దారితీసింది.


