ప‌వ‌న్ వ్యాఖ్య‌ల్ని ఎలా అర్థం చేసుకోవాలి..?

‘ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మూడు చెబుతుంటే.. దాన్లో ఆరు అబ‌ద్ధాలు క‌నిపిస్తున్నాయి. సింగ‌పూర్ త‌ర‌హా రాజ‌ధాని అని ముఖ్య‌మంత్రి అంటారు, కానీ దానికంటే ముందు సింగ‌పూర్ త‌ర‌హా పాల‌న తెలుసుకోవాలి. ఈరోజున మీ అబ్బాయి స్వ‌యంగా చేస్తున్న అవినీతి మీకు తెలుసా’… జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌లో ప‌వ‌న్ కల్యాణ్ చేసి వ్యాఖ్య‌లు ఇవి. ఇక‌, శ‌నివారం నాడు విజ‌య‌వాడ పార్టీ కార్యాల‌యంలో ప‌వ‌న్ మాట్లాడుతూ… చంద్ర‌బాబు నాయుడు అంటే త‌న‌కు ఇప్ప‌టికీ గౌర‌వం ఉంద‌న్నారు. స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావాల‌ని మాత్ర‌మే తాను ఆలోచిస్తాన‌నీ, రాజ‌కీయాలు చేయాల‌ని అనుకోన‌ని ప‌వ‌న్ స్ప‌ష్టం చేశారు. అప్పుడేమో నిరాధార వ్య‌క్తిగ‌త ఆరోప‌ణ‌లు చేశారు, ఇప్పుడేమో వ్య‌క్తిగ‌తంగా గౌర‌వం అంటున్నారు.

‘అమ‌రావ‌తి నిర్మాణానికి 2000 ఎక‌రాలు చాల‌న్నారు. ఇప్పుడు ల‌క్ష‌ల ఎక‌రాల‌కు ఎందుకు విస్త‌రించారు..? అభివృద్ధి రాజ‌ధాని చుట్టూ ఉంటే.. ఉత్త‌రాంధ్ర‌, రాయ‌ల‌సీమ ఏం కావాలి..? అభివృద్ధి కొద్దిమందికే ప‌రిమిత‌మైతే తెలంగాణ‌లా మ‌రో ఉద్య‌మం వ‌స్తుంది’.. ఇదీ ఆవిర్భావ స‌భ‌లో ప‌వ‌న్ ఆవేశం..! ఇక‌, ఇప్పుడు సావ‌ధానంగా ఏన్నారంటే… రాజ‌ధాని భూములూ ఇత‌ర‌త్రా అంశాల‌లో హ‌ఠాత్తుగా యూ ట‌ర్న్ తీసుకోలేద‌న్నారు. ముందుగా కొంత భూమి తీసుకుని, దాన్ని అభివృద్ధి చేసి, రాజ‌ధాని అంటే ఇలా ఉంటుంద‌ని ప్ర‌జ‌ల‌కు చూపించాక.. ఆ త‌రువాత ఎంతైనా విస్త‌రించుకుంటూ వెళ్లొచ్చు క‌దా అన్నారు.

గత ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుకి మ‌ద్ద‌తు ఇవ్వ‌డానికి ఆయ‌న అనుభ‌వం కార‌ణ‌మ‌ని మొన్న‌నే అన్నారు. ఏపీ పున‌ర్నిర్మాణానికి నాడు టీడీపీతో క‌లిసి ప‌నిచేశాను అన్నారు. ఇప్పుడేమో.. 2019 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన స్వ‌తంత్రంగా పోటీ చేస్తుంద‌ంటున్నారు. ఆవిర్భావ స‌భ‌లో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ప్ర‌స్థావ‌నే ప‌వ‌న్ ప్ర‌సంగంలో లేదు. కానీ, ప్ర‌ధానికి వ్య‌తిరేకంగా తాను ఎప్ప‌ట్నుంచో మాట్లాడుతున్నాన‌ని తాజాగా అన్నారు. గుంటూరు స‌భ‌లో ఉత్త‌రాది, ద‌క్షిణాది టాపిక్ మాట్లాడ‌లేదు. కానీ, ఇప్పుడేమో ఉత్త‌రాధి ఆధిప‌త్య‌మే తెలుగు రాష్ట్రాల విభ‌జ‌నకు కార‌ణ‌మంటున్నారు..! ఇంత‌కీ, ప‌వ‌న్ వ్యాఖ్య‌ల్లో వేటిని ప్రామాణికంగా తీసుకోవాలి..? ఆవిర్భావ స‌భ‌లో మంత్రి లోకేష్ అవినీతి చేస్తున్నార‌న్నారు. అంద‌రూ అన్నారు కాబ‌ట్టి తానూ అనాల్సి వ‌చ్చింద‌ని త‌రువాత చెప్పారు. అక్క‌డ చంద్ర‌బాబును విమ‌ర్శించారు.. ఇక్క‌డ గౌర‌వం అంటున్నారు. అక్క‌డ రాజ‌ధానికి ల‌క్ష ఎక‌రాల అవ‌స‌ర‌మా అన్నారు.. ఇక్క‌డ ఒక మోడ‌ల్ ప్ర‌జ‌ల‌కి చూపించాక ఎంత విస్త‌రించినా ఫ‌ర్వాలేదంటారు..! గుంటూరు స‌భ త‌రువాత ‘ప‌వ‌న్ ఇలా అర్థం చేసుకోవ‌చ్చు’… అని ఒక స్థిర‌మైన అభిప్రాయం ప్ర‌జ‌ల్లో క‌లిగేలోపు మ‌ళ్లీ ఇదిగో ఇలా స్పందిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.