స‌భ్య‌స‌మాజానికి ఏం మెసేజ్ ఇద్దామ‌నుకొన్నావ్‌?!

కొంత‌మంది ద‌ర్శ‌కుల‌ది `హీరో` స్థాయి క్రేజ్‌. రాజ‌మౌళి క‌నిపిస్తే చాలు… జ‌నం గుమిగూడిపోతారు. ఫొటోలు, సెల్ఫీలూ… అంటూ ర‌చ్చ ర‌చ్చ చేస్తారు. ఆయ‌న‌కున్న క్రేజ్‌లో ఏమాత్రం త‌ప్పులేదు. ఇంకొంత‌మంది ద‌ర్శ‌కులు క్రేజ్‌ని `సృష్టించుకొనే` ప‌నిలో ఉంటారు. సాధార‌ణంగా రిలీజ్ రోజున థియేట‌ర్ల ద‌గ్గ‌ర హీరోల క‌టౌట్లు క‌నిపిస్తుంటాయి. వాటి ప‌క్క‌న త‌మ క‌టౌట్ కూడా చూసుకొని మురిసిపోవాల‌న్న ఆశ‌.. ఆకాంక్ష వాళ్ల‌ది. హ‌రీష్ శంక‌ర్ కూడా అలానే క‌ల‌లు క‌న్నాడేమో..! త‌న క‌టౌట్ ఒక‌టి ప్ర‌తిష్టించేలా చేశాడు. సినిమా వాళ్ల జంక్ష‌న్‌గా చెప్పుకొనే.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని మెయిన్ థియేట‌ర్లో `డీజే` ఆడుతోంది. అక్క‌డ య‌ధావిధిగా నిలువెత్తు అల్లు అర్జున్ క‌టౌట్ క‌నిపించింది. దాని ప‌క్క‌నే… అంతే ఎత్తులో హ‌రీష్ శంక‌ర్ బొమ్మ కూడా ద‌ర్శ‌న‌మిచ్చింది. ఈ క‌టౌట్ చూసి బ‌న్నీ ఫ్యాన్స్ సైతం ఆశ్చ‌ర్య‌పోతున్నారు. `మ‌న హీరో అంత క‌టౌటా?` అంటూ నోరెళ్ల‌బెడుతున్నారు. ఈ క‌టౌట్ తో స‌భ్య స‌మాజానికి ఏం మెసేజ్ ఇద్దామ‌ని?? అంటూ డీజే డైలాగ్‌నే మార్చి చెబుతున్నారు.

గ‌బ్బ‌ర్ సింగ్ మిన‌హాయిస్తే.. హ‌రీష్ శంక‌ర్ ఖాతాలో హిట్ లేదు. మిర‌ప‌కాయ్ ఓకే అనిపించిందంతే. షాక్‌, రామ‌య్యా వ‌స్తావ‌య్యా సినిమాలు అట్ట‌ర్‌ఫ్లాప్ అయ్యాయి. సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్ ఓ మాదిరిగా ఆడిందంతే. పెద్ద హీరోతో సినిమా చేస్తే.. స్టార్ ద‌ర్శ‌కుడు అయిపోయిన‌ట్టు కాదు. స్టార్ లేక‌పోయినా, సినిమా మొత్తాన్ని న‌డిపించ‌గ‌లిగే ద‌మ్ము ఆ ద‌ర్శ‌కుడికి ఉంటేనే స్టార్ డైరెక్ట‌ర్ అయిన‌ట్టు. పోస్ట‌ర్‌పై ద‌ర్శ‌కుడి పేరు చూసి, హీరో ఎవ‌రున్నా ప‌ట్టించుకోకుండా సినిమా కెళ్తే.. అప్పుడు స్టార్ డ‌మ్ వ‌చ్చిన‌ట్టు. ఇవి త‌న‌కు ఉన్నాయా?? అనేది హ‌రీష్ శంక‌ర్ ఆలోచించుకోవాలి. లేదంటే స‌భ్య స‌మాజానికి రాంగ్ మెసేజీలు వెళ్తాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com