ఐబొమ్మ రవి కేసు మలుపులు తిరుగుతోంది. కోర్టు మూడు రోజుల కస్టడీకి ఇస్తే సరిపోదని నాలుగు కేసులు ఉన్నాయని పన్నెండు రోజుల పాటు ప్రశ్నించాల్సిందేనని పోలీసులు కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకున్నారు. ఆ పన్నెండు రోజులు ముగిసిన తర్వాత ముగ్గురు ఫ్రెండ్స్ ఐడీ కార్డుల దొంగతనాలు చేశాడని తేల్చారు. అందులో ఒక ఫ్రెండ్ ను పిలిచి స్టేట్మెంట్ తీసుకున్నారు. మిగతా ఇద్దరివీ తీసుకుంటామని చెబుతున్నారు. ఈ కేసులో ఏదైనా బ్రేక్ త్రూ లభించి ఉంటే ఇంకా పెద్ద స్తాయిలో లీకులు వచ్చేవి. కానీ హడావుడి లేదు. అదే సమయంలో ఓ టీవీ చానల్ తో రవి చేసిన వ్యాఖ్యలే వైరల్ అయ్యాయి.
పైరసీ కేసు..దొంగతనం కేసు
ఐ బొమ్మ రవి గురించి ఎప్పుడూప్రచారంలోకి వచ్చిన విషయాలనే మళ్లీ పోలీసులు లీక్ చేశారు. అతను ప్రహ్లాద్ కుమార్ అనే పేడతో ఐడీకార్డులు తీసుకున్నాడని మొదటి రోజే బయటకు వచ్చింది. అయితే అవి ఫేక్ కాదు. ప్రహ్లాద్ కుమార్ వే. అతను రవి మిత్రుడే. అతన్ని పిలిపించిన పోలీసులు..తన ఐడీ కార్డులు వాడుకున్నాడని తనకేం సంబంధం లేదని చెప్పారు. కానీ దొంగతనం చేశాడని కేసు పెట్టలేదు. పోలీసులే చెబుతున్నారు. మరో ఇద్దరి సర్టిఫికెట్లను కూడా దొంగతనం చేశారని పోలీసులు అంటున్నారు. కానీ వారిని ఇంకా పిలిపించలేదు.
ఇరవై రోజులకుపైగా కస్టడీ – అసాధారణమే
ఇమంది రవిని పోలీసులు అరెస్టు చేసినప్పటి నుండి ఇరవై రోజులకుపైగా కస్టడీకి తీసుకున్నారు. పోలీసులు కస్టడీకి తీసుకుని రవిని ఏ మాత్రం భయపెట్టలేకపోయారు. కోర్టులో హాజరు పరిచి తీసుకెళ్తున్న సమయంలో ఆయన ఓ టీవీ చానల్ తో మాట్లాడారు. ఆయన మాటల్లో ఎక్కడా భయం లేదు. ఆయన మాటల్లో పొగరు కనిపించింది. అంటే తాను ఏమీ చేయలేదని.. పోలీసులు ఏమీ నిరూపించలేరని ధీమా కావొచ్చు. ఆయన మీడియాతో మాట్లాడిన బైట్ చూసి.. సోషల్ మీడియాలో ఆయనకు లభించిన సపోర్ట్ మరింత పెరుగుతుంది.
సవాల్ చేయడంతో పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు కానీ.. !
పోలీసుల్నే సవాల్ చేయడంతో సీరియస్ గా తీసుకుని ఆయనను అరెస్టు చేశారు కానీ.., పైరసీ మీద పదిశాతం కూడా ఇంపాక్ట్ పడలేదు. పైరసీలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఐ బొమ్మను మాత్రం ఆపగలిగారు. అంత పెద్ద పైరసీ నెట్ వర్క్ నడుపుతున్నారని తేల్చినప్పుడు…. ఆయన ఒక్కడే నడుపుతున్నారని పోలీసులు తేల్చడం మరో అంగీకరించలేని విషయం. ఇతరులెవరో తెలుసుకోలేకపోవడం వల్ల అలా చెబుతున్నట్లుగా అర్థం చేసుకోవాలేమో. పోలీసులు కేవలం ఇమంది రవిపై కోపంతోనే కేసును ఇన్వెస్టిగేట్ చేయడం వల్ల సరైన దిశలో సాగనట్లుగా కనిపిస్తోంది. సాంకేతిక ఆధారాలతో ఆయన నేరాన్ని నిరూపించడం పోలీసులకు తలకు మించిన భారమేనని తాజా పరిణామాలతో స్పష్టమవుతోందని సైబర్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.


