ఛాంపియ‌న్స్ ట్రోఫీకి ఊపొచ్చింది

ఇది వ‌ర‌కెప్పుడూ లేనంత నీరసంగా మొద‌లైంది ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ. మ్యాచ్‌ల‌న్నీ ఏక ప‌క్షంగా సాగ‌డం, వ‌ర్షం.. ఈ ట్రోఫీపై ఆస‌క్తిని చంపేశాయి. దానికి తోడు… ఇండియా – పాక్ మ్యాచ్‌కీ కిక్ రాలేదు. టీ ట్వంటీ బాదుడు అల‌వాటు ప‌డిపోయిన క్రికెట్ ప్రేమికులు వ‌న్డే మ్యాచ్‌లోని అస‌లు సిస‌లైన మజా ఆస్వాదించ‌లేక‌పోతున్నారు. దాంతో ఛాంపియ‌న్స్ ట్రోఫీ క‌ళ త‌ప్పిన‌ట్టైంది. అయితే… ఇప్పుడు సంచ‌ల‌న విజ‌యాల‌తో ఛాంపియ‌న్స్ ట్రోఫీకి ప్రాణం వ‌చ్చేసింది. సౌతాఫ్రికాపై పాకిస్థాన్ గెలుస్తుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. ఇండియా – శ్రీ‌లంక మ్యాచ్ రిజ‌ల్ట్ కూడా ఎవ్వ‌రూ ఊహించ‌లేనిదే. కొత్త కుర్రాళ్ల‌తో నిండిపోయిన లంక‌…. ఇండియాకు గ‌ట్టిషాకే ఇచ్చింది. ఇప్పుడు బంగ్లాదేశ్ వంతు వ‌చ్చింది. ప‌టిష్ట‌మైన న్యూజిలాండ్‌ని మ‌ట్టిక‌రిపించి… ఛాంపియ‌న్స్ ట్రోఫీలోనే పెను సంచ‌ల‌నం న‌మోదు చేసింది. ఈ అనూహ్య విజ‌యాల‌తో ఒక్క‌సారిగా.. ఛాంపియ‌న్స్ ట్రోఫీకి మ‌ళ్లీ కొత్త క‌ళ వ‌చ్చింది. సెమీస్‌లో ఎవ‌రు అడుగు పెడ‌తారా? అనే ఉత్కంఠ‌త‌ క్రికెట్ ప్రేమికుల్లో క‌ల్పించింది. రాబోతున్న మ్యాచ్‌ల‌న్నీ.. కీల‌క‌మే. ఎవ‌రైనా సెమీస్ చేరుకోవొచ్చు. ఎంత గొప్ప జ‌ట్ట‌యినా… ప్ర‌త్య‌ర్థికి తేలిగ్గా తీసుకోవ‌డానికి వీల్లేద‌ని బంగ్లా, శ్రీ‌లంక రుజువు చేశాయి. ఇంగ్లండ్ లో ఇప్పుడు ఫేవ‌రెట్లు ఎవ‌రూ లేరు. ఏ రోజు ఏ జ‌ట్టు బాగా ఆడితే ఆ జ‌ట్టుదే విజ‌యం.

ఇంగ్లండ్‌లో బౌల‌ర్లు హ‌వా చూపిస్తార‌ని అంతా ఆశించారు. అక్క‌డ ప‌రిస్థితులు, వాతావ‌ర‌ణం సీమ్స్ బౌల‌ర్ల‌కు అనుకూలంగా ఉంటాయి. విచిత్రం ఏంటంటే.. అలాంటి చోట కూడా… ఫాస్ట్ బౌల‌ర్లు ఏమాత్రం ప్ర‌భావితం చూపించ‌లేక‌పోతున్నారు. బంతి పాత‌బ‌డిన కొద్దీ… ప‌ట్టు జారిపోతోంది. దాంతో ఛేజింగు సుల‌భం అవుతోంది. టాస్ గెలిచిన జ‌ట్టు ఫీల్డింగ్ ఎంచుకోవ‌డానికే మొగ్గు చూపుతోంది. డ‌క్ వ‌ర్త్ లూయిస్ ప‌ద్ధ‌తి కూడా… రెండో బ్యాటింగ్ జ‌ట్టుకే మ‌ద్దతు ఇస్తోంది. దాంతో… టాస్ గెలిస్తే.. మ్యాచ్ గెలిచిన‌ట్టే. గ‌త రెండు మ్యాచుల్లోనూ విరాట్ కొహ్లి టాస్ ఓడిపోయాడు. ఆదివారం సౌతాఫ్రికాతో కీల‌క‌పోరు జ‌ర‌గ‌బోతోంది. ఈ మ్యాచ్ విజేత‌నూ టాస్ నిర్ణ‌యిస్తే.. ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com