అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను మార్చి 31లోపు అభిశంసించేందుకు ప్రయత్నిస్తున్నారు. అది అంత తేలిక కాకపోయినా ట్రంప్ వ్యవహారంతో రిపబ్లికన్లు కూడా అసహనంగా ఉండటంతో తోసిపుచ్చలేమన్న చర్చ ప్రారంఎభమయింది. ప్రస్తుతం అమెరికా ప్రతినిధుల సభలో డెమోక్రాట్లు ట్రంప్‌పై మరోసారి అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అల్ గ్రీన్ వంటి నేతలు ఇప్పటికే ఇందుకు సంబంధించిన పని చేస్తున్నారు. అయితే, మార్చి 31 నాటికి ఇది సాధ్యమవుతుందా అనేది ఉత్కంఠగా మారింది. రిపబ్లికన్ల ఆధిపత్యం ఉన్న సభలో డెమోక్రాట్లకు సొంతంగా మెజారిటీ లేకపోవడంతో, కొంతమంది రిపబ్లికన్ల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ట్రంప్‌పై పెరుగుతున్న వ్యతిరేకతకు కారణాలేంటి?
రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు తీవ్ర వ్యతిరేకతకు దారితీస్తున్నాయి. అమెరికాలో అక్రమ వలసదారులను ఏరివేసే క్రమంలో దళాలు చేపట్టిన చర్యలు, ముఖ్యంగా మిన్నెసోటాలో జరిగిన కాల్పుల ఘటన రాజకీయ దుమారం రేపింది. హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ వైఫల్యంపై అసహనంతో ఉన్న డెమోక్రాట్లు, నేరుగా ట్రంప్‌నే టార్గెట్ చేస్తున్నారు ట్రంప్ విధిస్తున్న సుంకాల వల్ల ధరలు పెరుగుతున్నాయని చిన్న వ్యాపారులు, సామాన్యుల్లో అసంతృప్తి నెలకొంది. రాజ్యాంగం ప్రకారం రెండు సార్లు మాత్రమే అవకాశం ఉన్నా, ఆయన మూడవసారి కూడా పదవిలో ఉండటంపై చేస్తున్న వ్యాఖ్యలు అప్రజాస్వామికమని విమర్శలు వస్తున్నాయి.
మధ్యంతర ఎన్నికల టార్గెట్
డెమోక్రాట్లు ఈ అభిశంసన అస్త్రాన్ని ఈ ఏడాది జరగనున్న మధ్యంతర ఎన్నికల వ్యూహంగా వాడుకుంటున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ తన అధికారాన్ని ఉపయోగించి 2026 ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయవచ్చని, అందుకే ముందే ఆయనను కట్టడి చేయాలని డెమోక్రాట్లు భావిస్తున్నారు. మరోవైపు, ట్రంప్ సైతం ఒకవేళ రిపబ్లికన్లు 2026లో మెజారిటీ కోల్పోతే డెమోక్రాట్లు నన్ను అభిశంసిస్తారు అని తన క్యాడర్‌ను హెచ్చరిస్తూ అప్రమత్తం చేస్తున్నారు.
అంతిమంగా ఏం జరగవచ్చు?
అమెరికా చట్టాల ప్రకారం ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం నెగ్గినా, అది సెనెట్‌లో కూడా ఆమోదం పొందాల్సి ఉంటుంది. ప్రస్తుతం సెనెట్‌లో రిపబ్లికన్ల బలం ఎక్కువగా ఉండటంతో, ట్రంప్ పదవి నుంచి తప్పుకునే అవకాశం తక్కువే. కానీ, ఈ లోపు జరిగే రాజకీయ రచ్చ ట్రంప్ ఇమేజ్ను దెబ్బతీయడానికి లేదా రిపబ్లికన్ పార్టీలో చీలిక తేవడానికి డెమోక్రాట్లు ప్రయత్నిస్తున్నారు. మార్చి 31 డెడ్‌లైన్ అనేది కేవలం ఒక రాజకీయ వత్తిడి పెంచే ఎత్తుగడగానే కనిపిస్తోంది. కానీ ట్రంప్ ను అభిశంసించడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా వదిలేందుకు సొంత పార్టీలోని ట్రంప్ వ్యతిరేకులు కూడా సిద్ధంగా లేరు.
