కాయ్ రాజా కాయ్… బీహార్లో బీజేపీపై బుకీల పందేలు

క్రికెట్ టోర్నీ జరిగినా, ఎన్నికల వచ్చినా అందరికంటే ముందు ఆట మొదలు పెట్టేది బుకీలు. కోట్ల రూపాయల్లో బెట్టింగు దందా నడిపేది వీళ్లే. బీహార్ ఎన్నికల నేపథ్యంలో అప్పుడు బెట్టింగ్ దందా మొదలైందని తెలుస్తోంది. మొన్నటి వరకూ బీజేపీ, జేడీయూ కూటమికి చెరో 110 సీట్లు వస్తాయని బుకీలు అంచనా వేశారు. ఇప్పుడు సీన్ మారింది. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేకు కనీసం 135సీట్లు వస్తాయని పందెం కాస్తున్నారు. జేడీయూకు 40 నుంచి 42, ఆర్జేడీకి 33 నుంచి 35, కాంగ్రెస్ కు సింగిల్ డిజిట్ లో సీట్లు వస్తాయని బెట్టింగ్ నిర్వహిస్తున్నారు.

రాజకీయ పరిశీకుల విశ్లేషణలోనూ బీజేపీకే మొగ్గు కనిపిస్తోంది. దీనికి ముఖ్యకారణం, నితీష్ తో లాలు చేతులు కలపడమే అంటున్నారు పరిశీలకులు. నిజానికి నితీష్ పై అవినీతి ఆరోపణలు లేవు. కానీ లాలుతో చేతులు కలిపి చేజేతులా విజయావకాశాలను దెబ్బతీసుకున్నారని పరిశీలకులు చెప్తున్నారు. మొదటి నుంచీ బీహార్ రాజకీయాల్లో యాదవులదే డామినేషన్. ఈ డామినేషన్ ను 55 ఆర్థికంగా వెనకబడిన బీసీ కులాలు వ్యతిరేకిస్తుంటాయి. వీటిని పచ్ పనియా అని పిలుస్తారు. ఇంత కాలం ఈ వర్గ ప్రజలు లాలుకు, యాదవులకు వ్యతిరేకంగా నితీష్ కు మద్దతిచ్చారు. ఇప్పుడు నితీషే లాలుతో చేతులు కలపడంతో 55 కులాల వారు బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నారు. ఇది కమలనాథులకు కలిసి వచ్చే అంశం. ఎందుకంటే, లాలుతో దోస్తీ వల్ల నితీష్ కు కలిసివచ్చే యాదవ ఓటు బ్యాంక్ కంటే 55 కులాల ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువ.

వామపక్షాలు కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. దీని వల్ల ఎన్డీయే వ్యతిరేక ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది. ఇది కూడా బీజేపీకి కలిసి వచ్చే విషయం. వామపక్షాలకు గత ఎన్నికల్లో 2.5 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే, బహుముఖ పోటీలో, హోరాహోరీ పోరులో స్వల్ప తేడాతో ఫలితం తారుమారు కావచ్చు. మరోవైపు, జనతా పరివార్ కు గుడ్ బై చెప్పిన సమాజ్ వాదీ పార్టీ ఒంటరి పోరుకు సిద్ధమవుతోంది. కలిసి వచ్చే పార్టీలతో కూటమి కట్టే ప్రయత్నంలో ఉంది. దాని వల్ల కూడా బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలవచ్చు. ముఖ్యంగా మైనారిటీ ఓట్లు చీలే అవకాశాలు ఎక్కువ. ఇది పరోక్షంగా బీజేపీకి ప్రయోజనం కలిగించవచ్చు.

ఎన్డీయేలోనూ అంతా సాఫీగా ఏమీ లేదు. పాశ్వాన్, మాంజీలకు పొసగడం లేదు. అయితే వీరిద్దరి పార్టీలకూ సొంత బలం అంతంతే. బీజేపీని ధిక్కరించి ఒంటరిగా పోటీ చేసే సాహసం చేయకపోవచ్చు. అందుకే, ఎక్కువ సీట్ల కోసం పట్టుబట్టినా బీజేపీని కాదని ఎన్డీయే నుంచి బయటకు వెళ్లే అవకాశాలు లేవు. ప్రధాని మోడీ ప్రకటించిన భారీ ప్యాకేజీ కొంత ప్రభావం చూపుతుందని, ఆయన పూర్తి స్థాయిలో ప్రచారంలోకి దిగితే పరిస్థితి ఎన్డీయేకు అనుకూలంగా మారుతుందని ఆ కూటమి నేతల అభిప్రాయం. పాశ్వాన్, మాంజీలకు ఈ విషయం తెలుసు. అది బీజేపీకి ప్లస్ పాయింట్.

మొత్తం మీద బీజేపీకి మిత్ర పక్షాలను బుజ్జగించడంలో కొంత తలనొప్పి తప్పక పోయినా, మొత్తం మీద జేడీయూ, ఆర్జేడీకంటే మెరుగ్గా ఉందంటున్నారు పరిశీలకులు. బుకీల బెట్టింగ్ సీన్ లోనూ ఇదే అంచనా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com