అంతర్జాతీయ రాజకీయాల్లో అగ్రరాజ్యాలు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి ఈగో ను ప్రదర్శిస్తుంటాయి. ప్రస్తుతం యుద్ధం పరిస్థితుల్లో ఇదే కనిపిస్తోంది. కానీ మోదీ నాయకత్వంలోని భారత్ మాత్రం దేశ ప్రయోజనాలే పరమావధి అనే సూత్రాన్ని నమ్ముకుంది. మనం పెద్ద తురుంఖాన్ అని డబ్బా కొట్టుకోకుండా, క్షేత్రస్థాయిలో వాస్తవాలను గమనిస్తూ అడుగులు వేస్తోంది. అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూనే, రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం, అటు ఇరాన్ వంటి దేశాలతోనూ సత్సంబంధాలను కొనసాగించడం ఒక విలక్షణమైన బ్యాలెన్సింగ్ యాక్ట్. ఇది కేవలం దౌత్యం మాత్రమే కాదు, దేశ ఆర్థిక భద్రతను కాపాడే ఒక రక్షణ కవచం.
ఇరాన్ – గల్ఫ్ – అమెరికా— మధ్యేమార్గం
ప్రస్తుతం ఇరాన్, గల్ఫ్ దేశాల మధ్య, అలాగే అమెరికాతో ఇరాన్ మధ్య ముదురుతున్న ఉద్రిక్తతల విషయంలో భారత్ అత్యంత సున్నితంగా వ్యవహరిస్తోంది. మీ కష్టాలు మీరు పడండి.. కానీ మా మీద పడకండి అని నేరుగా చెప్పకపోయినా, తన చర్యల ద్వారా అదే సంకేతాన్ని పంపిస్తోంది. ఎవరికీ బేషరతు మద్దతు ప్రకటించకుండానే, అందరితోనూ చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించడం ద్వారా భారత్ ఒక తటస్థ మధ్యవర్తిగా తన విలువను పెంచుకుంది. దీనివల్ల ఇంధన సరఫరాలో ఆటంకాలు కలగకుండా మన దేశాన్ని సురక్షిత తీరానికి చేర్చగలిగారు.
56 అంగుళాల ఛాతీ – ప్రదర్శన కాదు, రక్షణ
సాధారణంగా మోదీ 56 అంగుళాల ఛాతీ గురించి విమర్శకులు వెటకారంగా మాట్లాడవచ్చు. కానీ, నిజమైన ధైర్యం అంటే యుద్ధానికి కత్తులు దూయడం కాదు, యుద్ధ మేఘాల మధ్య కూడా తన దేశాన్ని, ప్రజలను ప్రశాంతంగా ఉండగలగడం. ప్రపంచంలోని బలమైన దేశాలన్నీ ద్రవ్యోల్బణం, ఇంధన సంక్షోభం, ఆహార కొరతతో అల్లాడుతుంటే, భారత్ మాత్రం స్థిరమైన వృద్ధి రేటును నమోదు చేస్తోంది. ఈ ప్రశాంతత వెనుక ప్రధాని మోదీ పక్కాగా అమలు చేస్తున్న రిస్క్ మేనేజ్మెంట్ వ్యూహం ఉంది. దూకుడుగా కాకుండా, వ్యూహాత్మకమైన మౌనం మరియు అవసరమైన చోట దృఢమైన గళం వినిపించడం ఆయన శైలి.
దేశం కోసం.. ప్రజల కోసం
మోదీ విధానాల్లో ఎక్కడా వ్యక్తిగత కీర్తి కంటే దేశ శ్రేయస్సే ఎక్కువగా కనిపిస్తుంది. మనం ఎవరి పక్షాన యుద్ధం చేయడం లేదు కానీ, ప్రపంచ శాంతిని కోరుకుంటున్నామని చేతల్లో చూపిస్తున్నాం. దీనివల్ల భారతీయులు విదేశాల్లోనూ గౌరవం పొందుతున్నారు, స్వదేశంలోనూ సురక్షితంగా ఉన్నారు. రాజకీయ స్వలాభం కంటే నేషన్ ఫస్ట్ అనే నినాదమే మోదీని నడిపిస్తోందని చెప్పడానికి ప్రస్తుత అంతర్జాతీయ స్థితిగతులే సాక్ష్యం.
సముద్రం అల్లకల్లోలంగా ఉన్నప్పుడు పడవను సురక్షితంగా ఒడ్డుకు చేర్చే కెప్టెన్ నైపుణ్యం ముఖ్యం. ఇప్పుడు ప్రపంచ రాజకీయాలు కూడా అలాగే ఉన్నాయి. ఈ గందరగోళంలో భారత్ ఇరుక్కుపోకుండా, ప్రజలపై ఆర్థిక భారం పడకుండా మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఆయనకు రాజకీయంగా మరింత బలాన్ని ఇస్తున్నాయి. ఎవరికీ లొంగకుండా, ఎవరినీ నొప్పించకుండా తన పని తాను చేసుకుపోవడమే మోదీ సక్సెస్ మంత్రం . ఫలితంగా, ప్రపంచం వణుకుతున్న వేళ భారత్ మాత్రం ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తోంది.


