గత రాష్ట్రపతులు- నేర్పిన పాఠాలు

రా​‍ష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ స్థానంలో ఎవరు ఎన్నికవుతారన్నది ఇప్పుడు దేశం ముందున్న కీలక చర్చ. దాదాపు పాతికేళ్ల తర్వాత కేంద్రంలో పూర్తి మెజార్టితో మోడీ నాయకత్వాన ఎన్‌డిఎ ప్రభుత్వం ఏర్పడింది.ి యుపి ఎన్నికల విజయాల తర్వాత ఆయన కోరుకున్న వారే రాష్ట్రపతి కావడానికి పూర్తిగా మార్గం ఏర్పడింది. అయితే అత్యున్నతమైన ఆ రాజ్యాంగ పదవిని కేవలం రాజకీయ బలాబలాలతో చూసి బిజెపికి నచ్చిన వారిని కూచోబెట్టేబదులు అందరికీ ఆమోదయోగ్యమైన, ఈ దేశ లౌకిక ప్రజాస్వామ్య విలువలను కాపాడగలిగిన వారు రాష్ట్రపతి భవన్‌లో వుంటేనే న్యాయం జరుగుతుందనేది గతానుభవం.భారత రాష్ట్రపతి రాజ్యాధినేత. ప్రధాన మంత్రి ప్రభుత్వాధినేత. ప్రధానిని నియమించే బాధ్యత కూడా రాష్ట్రపతిదే. సర్వసైన్యాధ్యక్ష బాధ్యత, సుప్రీం కోర్టు న్యాయమూర్తుల నియామకం, చట్టసభలు ఆమోదించిన బిల్లులకు ఆమోదం, వాటిని రద్దు చేసే అధికారం,రాష్ట్రపతి పాలన విధింపు, గవర్నర్ల నియామకం తదితర అనేక విషయాలు రాష్ట్రపతి పేరు మీదనే జరుగుతాయి. భారత దేశం పార్లమెంటరీ తరహా క్యాబినెట్‌ విధానాన్ని అనుసరిస్తున్నది గనక ప్రభుత్వ సూచన మేరకే వ్యవహరించవలసి వున్నా- సంక్షోభ సమయాలలో తన నిర్ణయం కీలకమవుతుంది. ఎవరికీ ఆధిక్యత లేనప్పుడు ఎవరిని ఆహ్వానించాలన్నది కూడా తన విచక్షణపై ఆధారపడి వుంటుంది. భారత రాష్ట్రపతిని స్థూలంగా బ్రిటిష్‌ రాణితో పోలుస్తుంటారు గాని వాస్తవంలో అంతకంటే కూడా ఆచరణీయ అంశాలు అనేకం ముడి పడి వుంటాయి. భిన్న మతాలు విశ్వాసాలు సంసృతులు గల ఈ దేశ వైవిధ్యానికి ప్రతినిధిగా లౌకిక ప్రజాస్వామ్య విలువల పరిరక్షకుుడుగా రాష్ట్రపతి వుంటేనే న్యాయం జరుగుతుంది.

1967 ఎన్నికల్లో తొమ్మిది రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ఓడిపోయి ప్రతిపక్ష ప్రభుత్వాలేర్పడటంతో గుత్తాధిపత్యానికి గండిపడింది. 1969లో రాష్ట్రపతి జాకీర్‌ హుస్సేన్‌ మరణంతో ఉపరాష్ట్రపతి వివిగిరి తాత్కాలికంగా ఆ పదవి చేపట్టారు. అప్పుడే కొత్త పాత కాంగ్రెస్‌ల రాజకీయ ఘర్షణ మొదలైంది. ప్రధాని ఇందిరాగాంధీని వ్యతిరేకించే పాతకాపులంతా కలసి నీలం సంజీవరెడ్డిని రాష్ప్రపతిగా నిర్ణయించారు.ఆయనకు వ్యతిరేకంగా వామపక్షాలు మరికొన్ని పార్టీల మద్దతుతో వివిగిరి పోటీ చేశారు.ఆయనకు ఇందిరాగాంధీ అండదండదలుండటంతో నీలం ను ఓడించి విజయం సాధించారు. ఉత్తరోత్తరా కాంగ్రెస్‌ రెండు ముక్కలు కావడానికి ఆ ఎన్నిక దారి తీసింది. అప్పట్లో ప్రగతిశీల నినాదాలతో మురిపించిన ఇందిర 1974 రాష్ట్రపతి ఎన్నిక నాటికి తన కీలుబొమ్మను ఎన్నిక చేయించుకోవాలని ఫకృద్దీన్‌ అలీ అహ్మద్‌ను ఎంపిక చేస్తే వామపక్షాలు ఆయనపై రాజకీయ పోటీగా ఆర్‌ఎస్‌పి నేత త్రిదిబ్‌ చౌదరిని నిలబెట్టాయి.ఫకృద్దీన్‌ ఎమర్జన్సీకి ఆమోద ముద్ర వేయడమే గాక ఆమె ఏమంటే అది చేస్తూ ప్రజాస్వామ్యానికి ప్రమాదం తెచ్చిపెట్టారు. 1977 ఎన్నికల్లో ఎమర్జన్సీని ఓడించిన తర్వాత మరోసారి సంజీవరెడ్డి ప్రజాస్వామ్య అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. అప్పటికి ఇప్పటికి ఇదొక్కటే నూటికి నూరు పాళ్లుఏకగ్రీవ ఎన్నిక. (అప్పటి ప్రధాని మొరార్జి దేశాయి ప్రముఖ నర్తకి రుక్మిణి అరండేల్‌ పేరు ముందుకు తెచ్చినా ఈ దేశానికి రాజకీయేతర రాష్ట్రపతి వుండటం సరికాదని గట్టిగా భావించి ఎవరూ ఆమోదించలేదు.

ఇందిర 1982లో మరోసారి తనకు వీర విధేయుడైన జ్ఞానీ జైల్‌సింగ్‌ను ఎంపిక చేయగా ఆమె ఆజ్ఞాపిస్తే పార్లమెంటును చీపురుతో వూడ్చడానికి కూడా సిద్ధమేనని ప్రకటించారు. ఆయనపై ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ప్రధాన న్యాయమూర్తి హెచ్‌ ఆర్‌ ఖన్నాను నిలబెట్టాయి. పంజాబ్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన జైల్‌ సింగ్‌ అక్కడ ముఠా తగాదాలతో సిక్కు ఉగ్రవాదానికి పరోక్ష తోడ్పాటు నిచ్చారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆ ఉగ్రవాద ప్రభావానికి గురైన అంగరక్షకుని చేతిలో ప్రధాని ఇందిర హత్యకు గురైన తర్వాత ఆయన క్షణాల మీద ఏకపక్షంగా రాజీవ్‌ గాంధీతోప్రమాణస్వీకారం చేయించారు. అదే వ్యక్తి తన సంబంధాలు దెబ్బతిన్న తర్వాత ా ప్రధానిని బర్తరప్‌ చేసే అధికారాలు తనకున్నాయని చెబుతూ రాజకీయ ఉద్రిక్తత పెంచారు. జైల్‌సింగ్‌ అనంతరం ఆర్‌వెంకట్రామన్‌ను రాజీవ్‌ గాంధీ ఎంపిక చేశారు.1989 ఎన్నికల తర్వాత ముగ్గురు ప్రధానమంత్రులు విపిసింగ్‌, చంద్రశేఖర్‌, పివి.నరసింహారావులతో ప్రమాణస్వీకారం చేయించిన వ్యక్తి ఆయన. ఈ మధ్యలో రెండు సార్లు కూడా తన చొరవతో జాతీయ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని రాజ్యాంగంలో లేని అధికారాన్ని చలాయించడానికి ప్రయత్నించారు.

1992లో పివిహయాంలో పాలకపక్ష అభ్యర్థి శంకర్‌ దయాళ్‌ శర్మకు విస్త్రతమైన మద్దతు లభించింది. బిజెపి టిడిపి లు స్వెల్‌ ను పోటీ పెట్టినావామఫక్షాలు శర్మకు మద్దతు నిచ్చి గెలిపించాయి. అయోధ్యలో బాబరీ మసీదు విధ్వంసం విషయంలో పివి ఉదాసీనంగా వుంటే తానే ముందు ఖండించి ప్రధానిని పిలిపించి శర్మ కొత్త చరిత్ర సృష్టించారు. 1996లో మెజార్టి లేకున్నా వాజ్‌పేయికి అవకాశం ఇవ్వడం విమర్శకు గురైనా 13 రోజుల్లోనే దిగిపోయారు. శర్మ హయాంలోనూ వాజ్‌పేయి దేవగౌడ, ఐకెగుజ్రాల్‌ మళ్లీ వాజ్‌పేయి ఇలా నాలుగు సార్లు ఫ్రధాని ప్రమాణ స్వీకారాలు జరిగాయి. ఒక అవగాహనతో అంతకు ముందు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన తొలి దళిత అభ్యర్థి నారాయణన్‌ను శివసేన తప్ప అన్ని పార్టీలు ఏకగ్రీవంగా బలపర్చాయి. 95 శాతం ఓట్లతో ఎన్నికైన నారాయణన్‌ వాజ్‌పేయి ప్రభుత్వం రాజ్యాంగాన్నితిరగదోడే పని పెట్టుకున్నప్పుడు గట్టిగా వ్యతిరేకించారు. సామాజిక న్యాయం లౌకిక విలువలకు సంకేతమైనారు.

మెజార్టిలేని వాజ్‌పేయి వ్యూహాత్మకంగా క్షిపణిశాస్త్రజ్ఞుడైన అబుల్‌ కలాం ఆజాద్‌ పేరును తీసుకొచ్చినప్పుడు ప్రతిపక్ష కాంగ్రెస్‌ కూడా బలపర్చింది.వామపక్షాలు కొన్ని ఇతర పార్టీలు మాత్రం క్లిష్టసమయంలో రాజకీయేతర వ్యక్తిని రాష్ట్రపతిని చేయడం సరికాదని కెప్టెన్‌ లక్ష్మీ సైగల్‌ను పోటీ నిలిపాయి. గుజరాత్‌ మారణహౌమం జరిగినపుడు కలాం ఎంతో నిర్లిప్తంగా వున్న తీరు అంతకు ముందు శర్మ బాబరీ మసీదు విషయంలో వ్యవహరించిన తీరుకు పూర్తి భిన్నం. కలాం తర్వాత మహిళగా ఏకగ్రీవంగా ప్రతిభాపాటిల్‌ పేరు ప్రతిపాదించారు. అయితే బిజెప కూటమిి తమ పార్టీ మాజీ ముఖ్యమంత్రి, ఉపరాష్ట్రపతి బైరాన్‌ సింగ్‌ షెకావత్‌ను పోటీ పెట్టింది. వ్యక్తిగతంగా ప్రతిభా పాటిల్‌ పని తీరు ఆశించిన రీతిలో లేదని విమర్శకు గురైనారు. ఆమె తర్వాత యుపిఎ హయాంలో 2012లో ప్రణబ్‌ ముఖర్జీ ఎన్నికైనారు. బిజెపి కూటమి ఆయనపై పి.ఎ.సంగ్మాను పోటీపెట్టినా 70 శాతం ఓట్లతో గెలుపొందారు. ఆయన హయాంలోనే మోడీ అధికారంలోకి వచ్చినా సత్సంబంధాలు కొనసాగించారు. భావ ప్రకటనా స్వేచ్చపై దాడి , విశ్వ విద్యాలయాల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ వంటి విషయాలు ఆయన మాట్లాడితే పాలక పార్టీకి నచ్చలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.