ఎడిటర్స్ కామెంట్ : తాకట్టులో భారతదేశం !

” నీ తెలివి తక్కువ తనంతో పోలిస్తే నాదెంత ? .. నీ చేతకాని తనంతో పోలిస్తే నాదెంత ?” అని ఓ సినిమాలో ఎప్పుడూ పనికి మాలిన వేషాలేసి దొరికిపోయే కోట శ్రీనివాసరావు క్యారెక్టర్ కామెడీ చేస్తుంది. ఇది సినిమాలో క్యారెక్టర్ కావొచ్చు కానీ మన నిత్య జీవితంలో ఎక్కడో చోట కనిపిస్తూనే ఉంటుంది. అది మనుషుల్లోనే కాదు ప్రభుత్వాల్లో కూడా. ఇప్పుడు అప్పుల విషయంలో రాష్ట్రాలు, కేంద్రం మధ్య నడుస్తున్న పంచాయతీ చూస్తే ఇదే నిజమనిపించక మానదు. మీరు అప్పులు ఎక్కువ చేశారంటే.. మీరు అప్పులు ఎక్కువ చేశారని రాష్ట్రాలు ఒకరిపై ఒకరు నిందలేసుకుంటున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎలాగూ నోరు తెరువవు. తెరిచేంత స్వేచ్చ ఉండదు. ఒక వేళ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏమైనా తేడాలంటే కేంద్రం బయట పెట్టదు. కానీ బీజేపీయేతర ప్రభుత్వాలున్న చోట మాత్రం లెక్కలన్నీ బయటకు వస్తాయి. అక్కడా కొన్ని ” పొలిటికల్ ప్రివిలేజెస్” పొందే రాష్ట్రాలున్నా… కేంద్రం మాత్రం లీకుల ద్వారా అయినా బయటకు చెబుతోంది.

భారత్ ప్రజలను మేల్కొలిపిన శ్రీలంక !

అప్పుల ఊబిలో కూరుకుపోయిన శ్రీలంక ఎలా కుప్పకూలిపోయిందో కళ్ల ముందే కనిపిస్తోంది. అదే మన దేశ ప్రజల్ని కూడా మేల్కొలిపింది. అందుకే అప్పులపై చర్చ ప్రారంభమయింది. అత్యధికంగా అప్పులు చేస్తున్న రాష్ట్రాలంటూ అటు కేంద్రం.. ఇటు ఆర్బీఐ కొన్ని రాష్ట్రాల వివరాలను వెలుగులోకి తెచ్చింది. అందులో ప్రధానంగా బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలున్నాయి. ఈ రాజకీయాన్ని పక్కన పెడితే ఆయా రాష్ట్రాలు పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయాయనన్నది సత్యం. ఆదాయాన్ని మించి అప్పులు చేశారు. ఇప్పుడు అప్పులు.. వడ్డీలు తిరిగి కట్టడానికి మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అదే సమయంలో కేంద్రం చేస్తున్న అప్పులపైనా చర్చ ప్రారంభమయింది. అటు రాష్ట్రాలు.. ఇటు కేంద్రం ఎవరి వాదన వారు వినిపిస్తూ.. ఎవరు ఎక్కువ అప్పులు చేశారో లెక్కలు బయట పెడుతున్నారు. దీంతో ప్రజల్లో మరింత చర్చ జరుగుతోంది.

రాష్ట్రాలు శ్రీలంకలుగా మారొద్దని కేంద్రం హెచ్చరికలు !

పార్లమెంట్లో కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రాలు విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నాయని, శ్రీలంకను గుణపాఠంగా తీసుకోవాలని సూచించింది. ఈ ఏడాది దేశంలోని అన్ని రాష్ట్రాలు రూ. 8.57 లక్షల కోట్లు రుణ పరిమితిగా నిర్ణయించింది. ఈ అప్పు ఆ రాష్ట్రాల స్థూల జాతీయోత్పత్తిలో 3.5 శాతం మించి ఉండకూడదు. ఇది నిబంధన. ద్రవ్య బాధ్యత-బడ్జెట్‌ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బిఎం) నిబంధన ప్రకారం కేంద్రం ఈ పరిమితి విధిస్తుంది. దీనికి లోబడి ప్రతి రాష్ట్రం రుణాలు సేకరిస్తాయి. ఈ రుణాలను రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, చిన్న పొదుపు మొత్తాల నుండి, మార్కెట్‌లో బాండ్లను అమ్మడం తదితరాల ద్వారా సేకరిస్తాయి. ఈ అప్పులు బడ్జెట్‌ పత్రాల్లో చూపించాలి. ప్రతి ఏడాది అప్పులపై అసలు, వడ్డీలకు ఎంత చెల్లిస్తున్నారో కూడా బడ్జెట్‌లో ముందుగానే పేర్కొంటారు. అయితే రాష్ట్రాలు ఆదాయం.. అప్పులకు మించి ఖర్చు చేస్తూ… అదనపు అప్పుల కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇవి తమ ఆస్తులను తనఖా పెట్టడం , కార్పొరేషన్ల పేరుతో ఆదాయాన్ని చూపి బ్యాంకుల ద్వారా, బాండ్ల ద్వారా రుణాలు సేకరించుకుంటున్నాయి. వీటినే బడ్జెట్‌యేతర అప్పులు అంటారు. వీటికి కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదు. ఈ బడ్జెట్‌యేతర రుణాలు అన్ని రాష్ట్రాలకు కలిపి రూ. 7.9 లక్షల కోట్లు ఉందని, ఈ తరహా అప్పులు పెరిగిపోతున్నాయని, ద్రవ్యలోటు 3.5 శాతం నిబంధనను దాటిపోతుందని అంతిమంగా రాష్ట్రాల రెవిన్యూ వ్యయం పెరుగుదలకు తీవ్ర ప్రభావం పడుతున్నదని కేంద్రం అంటోంది. రాష్ట్రాల స్థూల జాతీయోత్పత్తిలో మొత్తం అప్పుల శాతం కూడా కొన్ని రాష్ట్రాల్లో 50 శాతం దాటిందని, ఇది రాష్ట్రాల అభివృద్ధిని దెబ్బతీస్తుందని కేంద్రం ఆందోళన చెందుతోంది.

కేంద్రం అప్పుల గురించి ఎదురు ప్రశ్నిస్తున్న రాష్ట్రాలు !

కేంద్ర ప్రభుత్వ రుణాలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. అయితే తమ అప్పుల గురించి ప్రశ్నించనంత వరకూ రాష్ట్రాలు కూడా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడిప్పుడే కేంద్రంపై విరుచుకుపడుతున్నాయి. దేశ స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుండి ఎప్పుడూ పెరగనంత అప్పులు బిజెపి పరిపాలనలో పెరిగింది. 2014 నుండి నేటివరకు దేశీయ అప్పు రెట్టింపయ్యింది. 2022 మార్చి నాటికి మన దేశానికి రూ.155 లక్షల కోట్లు అప్పు ఉందని ప్రభుత్వం ప్రకటించింది. ఇది దేశ స్థూల జాతీయోత్పత్తిలో 60 శాతానికిపైగా ఉందని లెక్కలు చెబుతున్నాయి. కేంద్రానికి విస్తృతంగా ఆదాయ వనరులున్నాయి. రాష్ట్రాలకు వాటా ఇవ్వకుండా కేంద్రం జమేసుకునే వనరులు చాలా వున్నాయి. వివిధ పన్నులమీద విధించే సర్‌ఛార్జీలు, సెస్‌లు, ప్రభుత్వరంగ సంస్థలు చెల్లించే డివిడెండ్లు, ఈ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, సంస్థల అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయాలు పూర్తిగా కేంద్రమే వినియోగించుకుంటుంది. రిజర్వుబ్యాంకు మిగులు నిధులను ప్రతి ఏడాది లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వమే వినియోగించుకుంటుంది. వీటిల్లో ఒక్క రూపాయి కూడా రాష్ట్రాలకు ఇవ్వదు కేంద్రం దేశంలో చేసే అప్పులే గాక విదేశాల నుండి వివిధ రూపాల్లో అప్పులు సేకరించి వాడుకుంటున్నది. ఈ విదేశీ అప్పు నేడు జిడిపిలో 20 శాతానికి దాటిపోయిందని చెబుతున్నారు. ఇప్పుడు విదేశీ బాండ్ల రూపంలో విదేశాల నుండి అప్పులు సేకరించాలని నిర్ణయించింది. దీనికి తోడు పడిపోతున్న రూపాయి మారకపు విలువ, అడుగంటుతున్న విదేశీ మారక నిల్వలు, పైపైకి ఎగబాకుతున్న వాణిజ్య లోటు, బుసలు కొడుతున్న ద్రవ్యోల్బణం ఇవన్నీ ఆర్థికవ్యవస్థ సంక్షోభానికి సంకేతాలు. అన్ని వనరులు ఉండి కూడా జిడిపిలో 60 శాతం దాకా అప్పులు చేసింది మోడీ ప్రభుత్వం. ఇదే అంశాన్ని రాష్ట్రాలు ప్రశ్నిస్తున్నాయి. కేంద్రానికి పట్టని నిబంధనలు రాష్ట్రానికి ఎందుకని అంటున్నాయి.

ఎవరికి వారు వాదనలకు దిగి అప్పులు చేసుకుంటూ పోతున్న కేంద్ర , రాష్ట్రాలు !

శ్రీలంక సంక్షోభం కళ్ల ముందు కనిపిస్తోంది కాబట్టి కేంద్ర, రాష్ట్రాలు అప్పులపై చర్చ పెట్టుకున్నాయి. లేకపోతే అంతర్గతంగానే ఉండేవి. అయితే ఇప్పుడు ఆయా ప్రభుత్వాలు జాగ్రత్త పడుతున్నాయా అని మనం అనుకుంటే మన కంటే వెర్రి వాళ్లు ఉండరేమో. అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రాలు కానీ జాగ్రత్త అనే మాటే తమ వైపు నుంచి రానీయడం లేదు. కేంద్ర అప్పులు జీడీపీలో అరవై శాతానికి మించి పోయాయనన్న లెక్కలు కనిపిస్తున్నా.. కేంద్రం ఏ మాత్రం లెక్క చేయడం లేదు. తమకు ఎంత అనువైన మార్గంలో అవకాశం ఉంటే అన్ని అప్పులు చేస్తోంది. కోటిన్నర కోట్ల అప్పు అంటే ఎంత వడ్డీ చెల్లించాలో లెక్కలు వేసుకుంటే ఓ రాష్ట్ర బడ్జెట్ అంత అనే సమాధాన మనకు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అందు కోసమే కేంద్రం కూడా అప్పులు చేస్తోంది. రాష్ట్రాలు కూడా అదే బాటలో ఉన్నాయి. అటు కేంద్రం ఇటు రాష్ట్రం అయినా మళ్లీ ఎన్నికల్లో గెలవాలంటే ప్రజలకు నగదు రూపంలో డబ్బులు పంచాలనుకుంటున్నాయి. ఈ విషయంలో అటు కేంద్ర రాష్ట్రాలు రాజీ పడే అవకాశాలు కనిపించడం లేదు. కానీ ఆదాయం దానికి తగ్గట్లుగా లేదు. దేశంలో మెజార్టీ రాష్ట్రాల ఆదాయం కేవలం ఉద్యోగుల జీతభత్యాలు, నిర్వహణా ఖర్చులకే సరిపోతాయి. ఆర్థికంగా బలంగా ఉన్న రాష్ట్రాలు వడ్డీలు కూడా కట్టుకోగలవు. చాలా రాష్ట్రాలు అప్పులు తీర్చడానికి .. వడ్డీలు కట్టుకోవడానికి అప్పులు చేయడమే కాకుండా.. నగదు బదిలీపథకాలకూ అవే ఉపయోగిస్తున్నారు. దీంతో అప్పు చేసి పప్పుకూడు తిన్న చందంగా ఈ అప్పుల వ్యవహారం సాగిపోతోంది.

అప్పులు తప్పు కాదు – ఎలా ఆ అప్పుల్ని ఉపయోగిస్తారన్నదే కీలకం !

ఏ ఆర్థిక వ్యవస్థకైనా, వనరులకూ అవసరాలకూ పొంతన కుదరనప్పుడు, వనరులను మించి అవసరాలు ఉన్నప్పుడు ఆ కొరతను పూడ్చుకోవడానికి అప్పు అవసరమవుతుంది. కనుక అప్పు దానికదిగా తప్పు కాదు. కాని ఆ అప్పు అవసరం గుర్తించాలంటే ముందు మన వనరులేమిటి, మన అవసరాలేమిటి, మన వనరులను సక్రమంగానే, సమర్థంగానే వినియోగిస్తున్నామా, మన అవసరాలను సరిగానే అంచనా వేస్తున్నామా, అవసరం లేని ఖర్చులూ దుబారా ఖర్చులూ చేస్తున్నామా వంటి ఎన్నో విషయాలపై అవగాహన తెచ్చుకోవాలి. అప్పుకు వెళ్లకుండా మన అవసరాలను మన వనరుల లోపల తీర్చుకోగలమా లేదా అని ఆలోచించడం లేదు. కేంద్రంలో పాలకులైనా… రాష్ట్రాలు.. స్థానిక సంస్థల పాలకులైనా ఆర్థిక వ్యవస్థ పట్ల అత్యంత బాధ్యతగా ఉండాలి. ఓ రూపాయి అప్పు చేస్తే అది మళ్లీ ప్రజల దగ్గర నుంచి పన్నుల రూపంలో వసూలు చేసి కట్టేలా ఉండకూడదు. ఆ రూపాయితో సంపద సృష్టి జరగాలి. ఆ సంపద నుంచి వచ్చే ఆదాయంతోనే అప్పులు .. వడ్డీలు తిరిగి చెల్లించాలి. నిజానికి సంపద ఎలా పెరుగుతుంది.. అంటే.. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల వల్ల. లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టినా.. యాభై వేల కోట్లు పెట్టి పోలవరం నిర్మించినా అది జాతీయ సంపద. దాని వల్ల కొన్ని లక్షల ఎకరాల పంట పండుతుంది. అది ప్రజలకు ఆదాయాన్ని తెస్తుంది. అదే అసలైన సంపద సృష్టి. అలా కాకుండా తాము చేసే అప్పులు సగం నగదు బదిలీ చేసి.. సగం అప్పటి వరకూ ఉన్న అప్పులకు వడ్డీలు కడితే ఏం మిగులుతుంది? మరికొంత అప్పు పెరుగుతుంది. కానీ సంపద … ఆదాయం మాత్రం పెరగదు. ఇప్పుడు అత్యధిక రాష్ట్రాల్లో జరుగుతోంది ఇదే.

అంతిమంపై ప్రజలపైనే భారం !

అటు కేంద్రం అప్పులు.. కూడా ప్రజలపైనే పడతాయి. ఇటు రాష్ట్రాల అప్పులు కూడా ప్రజలపైనే పడతాయి. ఇంకా చెప్పాలంటే స్థానిక సంస్థలు ఏవైనా అప్పులు చేస్తే అవీ ప్రజలపైనే పడతాయి. ఎవరు అప్పులు చేసినా ప్రజల దగ్గర నుంచి వసూలు చేసే పన్నుల ద్వారానే కట్టాలి. అప్పులు.. అప్పులకు వడ్డీలు పెరిగిపోవడం కారణంగానే దేశ ప్రజలు కట్టాల్సిన పన్నులు కూడా పెరిగిపోతున్నాయని అనుకోవచ్చు. అదే సంపద సృష్టి అనేది జరిగి ఉన్నట్లయితే ఈ సమస్య ఉండేది కాదు. అప్పులకు తగ్గట్లుగా సంపద సృష్టి జరగడం లేదు. ఆదాయానికి తగ్గట్లుగా అప్పులు చేయడం లేదు. అంతకు మించి చేస్తున్నారు. కేంద్రమైనా.. రాష్ట్రాలైనా అప్పులు చేసి.. సంపద సృష్టి చేస్తే … జీడీపీ పెరుగుతుంది. దాని వల్ల అప్పు పెద్ద భారంగా మారదు. కానీ అప్పులు చేసి అనుత్పాదక వ్యయం చేస్తేనే మొదటికే మోసం వస్తుంది. ఆ విషయం తెలుసుకోవాలని శ్రీలంక దుస్థితిని అధ్యయనం చేయాల్సిన పని లేదు. అది బేసిక్ ఆర్థిక సూత్రం. ప్రజలు అధికారం ఇచ్చారు కాబట్టి ఎక్కడో ఓ చోట నుంచి అప్పులు తెచ్చి వారికి ఎంతో కొంత పంచి పెట్టడమో.. మరొకటే చేస్తే మళ్లీ ఎన్నికల్లో గెలవొచ్చనుకోవచ్చు. కానీ అది ప్రజలను కష్టాల్లోకి నెట్టడం అవుతుంది. అంతకు మించి దేశాన్ని ఇబ్బంది పెట్టినట్లు అవుతుంది. అప్పులు చేయడం తప్పు కాదు. కానీ ఆ అప్పును సద్వినియోగం చేసుకోకపోతే మాత్రం తప్పు చేసినట్లే. అది ప్రజలిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లే అవతుంది.

రాష్ట్రాలు చేసిన అప్పులు.. కేంద్రం చేసిన రుణాలు… అన్నీ లెక్కలేసుకుంటే… దేశ.. రాష్ట్రాల జీడీపీలను దాటేశాయి. అంటే ఏభారత దేశం తాకట్టులో ఉందని అనుకోక తప్పదు. ఇప్పుడు పాలకులు దేశాన్ని తాకట్టు నుంచి విడిపించడానికి ప్రజలపైనే పడుతున్నారు. దాని ఫలితమే పన్నులు.. ధరల పెరుగుదల. చివరికి పాలు, పెరుగు మీద కూడా పెంచుతున్నారు. ఇప్పుడు ఈ అప్పుల భారం అంతా ప్రజలపైనే పడుతోంది. మరి లక్షల కోట్ల పన్నేశారు. చెత్తపన్నేశారు. మద్యాన్ని ఊహించనంత ధరలకు అమ్మతుున్నారు. అన్ని రకాల రేట్లు అప్పులన్నీ ఏమైపోయాయి ? అది మాత్రం ప్రజలకు తెలియదు .. కానీ బాకీ పడింది మాత్రం ప్రజలే…కట్టాల్సిందీ ప్రజలే. కానీ అసలు పాపం మాత్రం పాలకులది !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అయితే “ఆదిపురుష్” బీజేపీ ప్రచార చిత్రం కాదన్న మాట !

ఆదిపురుష్ అనే సినిమాలో నటించడానికి ప్రభాస్ అంగీకరించినప్పటి నుండి చాలా మందికి ఆ సినిమాపై డౌట్స్ ఉన్నాయి. ఇటీవల కేటీఆర్ అది బీజేపీ ప్రచార చిత్రమని.. వచ్చే ఎన్నికలకు ముందు అయోధ్య...

మునుగోడుకు 86 మంది ఎమ్మెల్యేల్ని పంపుతున్న కేసీఆర్ !

మునుగోడులో టీఆర్ఎస్ తరపున ప్రచారం చేయడానికి తమ పార్టీకి ఉన్న 86 మంది ఎమ్మెల్యేల్ని పంపుతున్నారు. నియోజకవర్గాన్ని 86 యూనిట్లుగా విభజించారు. ఒక్కో యూనిట్కి ఒక్కో ఎమ్మెల్యే ఇంచార్జ్గా ఉంటారని టీఆర్ఎస్...

డిజిట‌ల్‌లో ‘శివ‌’

ఈమ‌ధ్య రీ రిలీజ్‌ల హంగామా ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. పోకిరి, జ‌ల్సా, చెన్న‌కేశ‌రెడ్డి సినిమాలు రీ రిలీజ్ అయి భారీ వ‌సూళ్లు మూట‌గ‌ట్టుకొన్నాయి. త్వ‌ర‌లోనే ప్ర‌భాస్ - బిల్లా కూడా రీ రీలీజ్ అవ్వ‌బోతోంది....

రీమేకుల‌పై మెగాస్టార్ మాట‌

చిరంజీవిపై ఓ విమ‌ర్శ బ‌లంగా వినిపిస్తుంటుంది. ఆయ‌న ఎక్కువ‌గా రీమేకుల‌పై ఆధార‌ప‌డ‌తాడ‌ని. రీ ఎంట్రీ గా వ‌చ్చిన ఖైదీ నెం.150 రీమేకే. రేపు విడుద‌ల‌య్యే గాడ్ ఫాద‌ర్ కూడా రీమేకే. ఇప్పుడు చేతిలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close