మరో ట్విస్ట్… ఇంద్రాణికి సీరియస్

షీనా బోరా హత్యకేసులో ఇప్పటికే ట్విస్ట్ లమీద ట్విస్ట్ లతో టివీలో నేషనల్ న్యూస్ చూసేవారికీ, పేపర్లు చదివేవారికీ తలదిమ్మెక్కిపోతుంటే, ఇప్పుడు మరో తాజా ట్విస్ట్ వచ్చిపడింది. షీనాబోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలైన ఇంద్రాణి ముఖర్జీ ముంబయ్ లోని జెజే ఆస్పత్రిలో చేరారు. మూడు వారాలపాటు జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నతర్వాత ఆరోగ్యం క్షీణించిందన్న కారణంగా ఆమె ఆస్పత్రిలో చేరాల్సివచ్చింది. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు ఆస్పత్రివర్గాలు చెబుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం రెండుగంటల సమయంలో ఇంద్రాణిని ఆస్పత్రికి తీసుకువచ్చారు. అప్పటికి ఆమె స్పృహలో లేరు. ఆమె కొన్ని రకాల మాత్రలు తీసుకోవడం వల్ల ఆరోగ్య పరిస్థితి విషమించిందనీ, 24గంటలు గడిస్తేనేకానీ ఏ విషయం చెప్పలేమని డాక్టర్లు అంటున్నారు. ఆమె తల్లి దుర్గాబోరా గువాహతిలో గురువారంనాడు మరణించడంతో తట్టుకోలేక ఆమె ఏవో మాత్రలు మ్రింగిఉంటారని టివీల్లో కథనాలు వచ్చాయి.

సెప్టెంబర్ 7న ఆమెకు జ్యూడిషియల్ కస్టడీలోకి తీసుకుంటూ ఆర్థుర్ రోడ్ లోని జైలుకు తరలించారు. కాగా, 2012నాటి షీనా బోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపిస్తూ ఇంద్రాణిని ఆగస్టు 25న పోలీసులు అరెస్ట్ చేశారు.

షీనా బోరా హత్య కేసు వెలుగుచూసినప్పటి నుంచీ కేసు ఎన్నో మలుపులు తిరిగింది. ఒక దశలో షీనా తనకు చెల్లెలని చెప్పిన ఇంద్రాణి తర్వాత ప్లేట్ తిప్పేసి షీనా తనకు కూతురని తేల్చిచెప్పింది. దీనికి తోడు ఇంద్రాణి మాజీ ప్రియుల బాగోవతం ఒకటొకటిగా వెలుగుచూశాయి. ఈ కేసులో ఇంద్రాణితోపాటుగా ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా (ఇతను షీనాకు తండ్రికాదు), కారు డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ లను కూడా అరెస్ట్ చేశారు. వీరిని పోలీసులు ఇంటరాగేట్ చేస్తున్నప్పటికీ కేసు ఇంకా ఓ కొలిక్కిరాలేదు. ఇది ఇలా ఉండగా ఇప్పుడు కీలక నిందితురాలైన ఇంద్రాణి ఆరోగ్యం విషమించడం తాజా మలుపు. ఇంద్రాణికి ఛాతీ నొప్పి వచ్చిందని కూడా అంటున్నారు.

మొదటి నుంచీ షీనా బోరా హత్యకేసు అనేక ట్విస్ట్ లతో నడుస్తుండటంతో బాలీవుడ్ ఈ కేసు ఆధారంగా సినిమా తీయడానికి రంగం సిద్ధం చేసుకుంది. మరో పక్క షీనా బోరా హత్యకేసు వార్తలతో ప్రభావితమైన ఢిల్లీ విద్యార్థి తన తల్లి ఇంద్రాణి లాంటిదంటూ నోట్ బుక్ లో రాయడం మరో సంచలనం సృష్టించింది. వీటన్నింటికీ తోడు ఇంద్రాణి ప్రేమవ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు, కక్ష్యసాధింపు వ్యవహారాలు మొత్తం వెరసి రోజుకో ట్విస్ట్ వస్తుండటంతో ఈ కేసు పట్ల సర్వత్రా ఆసక్తి పెరిగిపోయింది. ఇంటర్నెట్ లో నెట్ జెన్స్ ఎక్కువగా ఇంద్రాణి , షీనా బోరా విషయాలు తెలుసుకోవడం కోసం ఎక్కువ ఆసక్తి చూపినట్లు తేలింది.

కాగా, అనూహ్యమైన మలుపులతో సాగుతున్న ఈ కేసు చివరకు ఎలా ముగుస్తుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com