పొన్నాల‌కు హైకమాండ్ ఇచ్చిన సంకేతాలేంటి..?

మ‌హా కూట‌మి పుణ్య‌మా అని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ల్లో టిక్కెట్లు గుబులు పెరిగిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ నేత‌ల‌కు ఈసారి టిక్కెట్లు గ‌ల్లంతైపోతాయేమో అనే ప‌రిస్థితి నెల‌కొని ఉంది. కూట‌మి పొత్తుల వ్య‌వ‌హారం మాజీ పీసీసీ అధ్య‌క్షుడు పొన్నాల ల‌క్ష్మ‌య్య‌ను బాగానే టెన్ష‌న్ పెట్టింది. సొంత నియోజ‌క వ‌ర్గం జ‌న‌గామలో ఆయ‌న‌కి సీటు ద‌క్కుతుందా, లేదంటే జ‌న‌స‌మితి అధ్య‌క్షుడు కోదండ‌రామ్ కి హైక‌మాండ్ ఇస్తుందా అనే సందిగ్ధ‌త కొన‌సాగిన సంగ‌తి తెలిసిందే. ఎందుకంటే, జ‌న‌గామ జిల్లా సాధ‌న కోసం జేయేసీ ప‌ట్టువ‌ద‌లకుండా పోరాటం చేయ‌డం, ఆ స‌మ‌యంలో యువ‌తా ఉద్యోగులూ కోదండ‌రామ్ కి మ‌ద్ద‌తుగా నిల‌వ‌డం… ఈ ప‌రిస్థితుల‌న్నీ హైక‌మాండ్ ద‌గ్గ‌రే చ‌ర్చ‌కు వ‌చ్చాయి. దీంతో పొన్నాల‌కు సీటు డౌటే అని అంద‌రూ అనుకున్నారు. కానీ, ఆయ‌న‌కి ఢిల్లీ నుంచి సానుకూల సంకేతాలు అందాయ‌నే ప్ర‌చారం ఇప్పుడు మొద‌లైంది.

సీటు ద‌క్కుతుందో లేదో అనే అనుమానం ఉన్న‌వారంతా గాంధీ భ‌వన్ ద‌గ్గ‌ర ధ‌ర్నాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అదే కోవ‌లో పొన్నాల వ‌ర్గీయులు కూడా రెండ్రోజుల‌గా బాగానే గ‌ళం వినిపిస్తున్నారు. అయితే, నేరుగా అధిష్టానం నుంచి పొన్నాల‌కు సంకేతాలు వ‌చ్చాయ‌నీ, ఆయ‌న సీటుపై భ‌రోసా ల‌భించింద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. గ‌డ‌చిన రెండ్రోజులూ కేవ‌లం ఇంటికే ప‌రిమిత‌మైన పొన్నాల‌… ఇవాళ్ల ఉద‌య‌మే త‌న అనుచ‌రుల‌తో చెర్యాల మండ‌లంలో ప్ర‌చారం ప్రారంభించారు. గత కొద్దిరోజులుగా నీర‌సంగా ఉన్న పొన్నాల అభిమానులు, కార్య‌క‌ర్త‌లు ఈ కార్య‌క్ర‌మంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

పార్టీలో కొంత‌మంది త‌న‌కు సీటు ద‌క్క‌కుండా చ‌క్రం తిప్పుతున్నార‌న్న ఉద్దేశంతో… ఆయ‌నే ఢిల్లీకి చెందిన కొంద‌రు సీనియ‌ర్ల‌తో ట‌చ్ లోకి వెళ్లార‌నీ, దాంతో అక్క‌డి నుంచి స్ప‌ష్ట‌మైన హామీ ల‌భించింద‌ని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. అయితే, దీనిపై ఇంకా స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది. పొన్నాల‌కు భువ‌న‌గిరి ఎంపీ టిక్కెట్ ఇస్తామ‌ని, బ‌దులుగా జ‌న‌గామ వ‌దులుకోవాల‌న్న‌ట్టుగా హైక‌మాండ్ బుజ్జ‌గింపుల ప్ర‌య‌త్నం చేసింద‌నే క‌థ‌నాలు ఈ మధ్య వినిపించాయి. అయితే, ప్ర‌స్తుతం ఆయ‌న ప్ర‌చారానికి బ‌య‌లుదేరిన తీరు చూస్తుంటే… జ‌న‌గామ టిక్కెట్ పై స‌స్పెన్స్ వీడిన‌ట్టుగానే క‌నిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.